చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయాలి

Fri,April 12, 2019 01:35 AM

వేములవాడ, నమస్తేతెలంగాణ/చందుర్తి : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాలను బహిర్గతం చేయాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు డిమాండ్ చేశారు. వేములవాడలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఓటుబ్యాంకు చెక్కు చెదరనిదని అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదమైన 16 సీట్ల గెలుపునకు ప్రజలు నీరాజనం పలికారని గుర్తుచేశారు. వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ దుకాణం మూత పడిందని ఆరోపించిన ఆయన, అనూహ్యంగా ఆ పార్టీ శ్రేణులకు బీజేపీకి ఓటు వేయమని చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. జాతీయ స్థాయిలోనే వైరుధ్య పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ చీకటి లోపాయికారి ఒప్పందాలను నాయకులు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పుల్కం రాజు, అన్నారం శ్రీనివాస్, నాయకులు పీచర భాస్కర్ రావు, గుడూరి మధు, పీర్ మహమ్మద్, తదితరులున్నారు.

టీఆర్‌ఎస్ గెలుపు లాంఛనమే
చందుర్తి: ప్రజల నాడి పరిశీలిస్తే టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు లాంఛన ప్రాయమేనని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు అన్నారు. గురువారం ఆయన చందుర్తి మండలంలోని లింగంపేట, సనుగులతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ సారథ్యంలో జరుగుతున్న నిరంతర అభివృద్ధి వినోద్ కుమార్ గెలుపునకు తారకమంత్రంగా పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాత్రికిరాత్రే చేతులెత్తేసి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుందని మండిపడ్డారు. ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో అనైతికంగా చీకటి ఒప్పందం చేసుకున్నాయని దుయ్యబట్టారు. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీలు కలిసి పరోక్షంగా బీజేపీకే అనుకూలంగా ప్రచారం చేయడం ప్రజాస్వామ్యాన్ని, నమ్మిన ప్రజలను అవమానపర్చడమేనని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ ప్రజల్లో మంచి స్పందన కనిపించిందనీ, వినోద్ కుమార్ గెలుపు నల్లేరుపై నడకేనని జోస్యం చెప్పారు. ఇక్కడ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ దప్పుల అశోక్, నాయకులు జలగం కిషన్‌రావు, లింగంపల్లి కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

98
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles