నేడే లోక్‌సభ పోరు

Thu,April 11, 2019 01:19 AM

- కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం
- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్
- సామగ్రితో కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
- బరిలో 15 మంది అభ్యర్థులు
- 16,50,893 మంది ఓటర్లు
- 1,107 ప్రాంతాల్లో 2,181 కేంద్రాలు
- వెయ్యి సెంటర్లలో వెబ్‌కాస్టింగ్
- విధుల్లో 10,305 మంది సిబ్బంది
- కేంద్ర పోలీసు బలగాలతో నిఘా
- నేటి సాయంత్రం 5 గంటల దాకా 144 సెక్షన్
- దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నేటి పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్ల పరిధిలో అన్ని ఏర్పాట్లూ చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్ జరగనుండగా, మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 16,50,893 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 1,107 ప్రాంతాల్లో 2,181 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వెయ్యి పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించారు. మిగతా 1,181 కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ చేయనున్నారు. ఇటు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా అధికారులు విస్తృత ప్రచారం చేశారు. నియోజకవర్గానికో మహిళా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

16,50,893 మంది ఓటర్లు..
పార్లమెంట్ పరిధిలో 8,15,230 మంది పురుషులు, 8,35,629 మంది మహిళలు, 34 మంది ఇతరుల చొప్పున మొత్తం 16,50,893 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 39,468 మంది పద్దెనిమిది నుంచి పందొమ్మిదేళ్ల యువకులు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.

విధుల్లో 10,305 మంది సిబ్బంది..
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 4:6 నిష్పత్తి చొప్పున ఎన్నికల సిబ్బందిని కేటాయించారు. ఈ లెక్కన కరీంనగర్ సెగ్మెంట్‌లో 1,794, చొప్పదండిలో 1,504, వేములవాడలో 1,173, సిరిసిల్లలో 1,297, మానకొండూర్‌లో 1,453, హుజూరాబాద్‌లో 1,403, హుస్నాబాద్‌లో 1,408 మంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 2,181 మంది పోలింగ్ ఆఫీసర్లు ఉండగా, 327 మందిని రిజర్వ్‌లో ఉంచారు. మరో 2,181 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లను నియమించగా, 327 మందిని రిజర్వ్‌లో ఉంచారు. 4,363 మందిని ఇతర పోలింగ్ ఆఫీసర్లుగా నియమించి, 654 మందిని రిజర్వ్‌లో ఉంచారు. అలాగే, 129 ప్రాంతాల్లో 273 మందిని సూక్ష్మపరిశీలకులుగా నియమించగా, 26 మందిని రిజర్వ్‌లో ఉంచారు. వీరంతా కలుపుకొని 8,724 మంది అవుతున్నారు. 1,308 మంది రిజర్వ్‌డ్ సిబ్బంది, 273 మంది మైక్రో అబ్జర్వర్లను కలుపుకుని 10,305 మంది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు.

దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు..
పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 41,138 మంది దివ్యాంగులున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో దృష్టి లోపం ఉన్నవారు 6,103 మంది, మూగ, చెవిటి వాళ్లు 6,605 మంది, పక్షవాతంతో బాధపడుతున్న వారు 17,469, ఇతర దివ్యాంగులు 10,961 మంది ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా చూస్తే కరీంనగర్‌లో 4,619, చొప్పదండిలో 6,030, వేములవాడలో 5,496, సిరిసిల్లలో 5,156, మానకొండూర్‌లో 8,367, హుజూరాబాద్‌లో 7,975, హుస్నాబాద్‌లో 3,495 మంది ఉన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలో నిల్చునే పనిలేకుండా నేరుగా వెళ్లి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మొత్తం 1,107 ప్రాంతాల్లోని 2,181 పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి, తిరిగి పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ఆటోలు సిద్ధంగా ఉంచారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీల్‌చైర్స్ కూడా అందుబాటులో ఉంచారు.

3,747 మంది పోలీసు బలగాలు..
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 3,747 మంది బందోబస్తులో తలమునకలు కానున్నారు. కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల విధుల్లో ఒక సీపీ, ఇద్దరు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 15 మంది సీఐలు, 77 మంది ఎస్‌ఐలు, 322 మంది ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, 1,538 మంది కానిస్టేబుళ్లు, 1,787 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా చూస్తే కరీంనగర్‌లో 602, చొప్పదండిలో 556, మానకొండూర్‌లో 565, వేములవాడలో 475, సిరిసిల్లలో 502, హుజూరాబాద్‌లో 540, హుస్నాబాద్‌లో 507 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. 129 ప్రాంతాల్లో గుర్తించిన 273 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి ఆరుగురి చొప్పున కేంద్ర అదనపు పోలీస్ బలగాలను కేటాయించారు.

ఎన్నికల సామగ్రి పంపిణీ..
లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బుధవారం ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాలకు సంబంధించి కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో, మానకొండూర్ నియోజకవర్గానికి అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో సామగ్రి పంపిణీ చేశారు. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, హుజూరాబాద్ జూనియర్ కళాశాలలో, హుస్నాబాద్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో సంబంధిత నియోజకవర్గాలకు సంబంధించిన సామగ్రిని అందజేశారు. మొత్తం 2,181 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 2,947 బ్యాలెట్ యూనిట్లు, 2,425 కంట్రోల్ యూనిట్లు, 2,484 వీవీ ప్యాట్లు సిబ్బందికి అందించారు. ఇందుకోసం 213 రూట్లలో 207 మంది సెక్టోరల్ ఆఫీసర్లను నియమించారు. కరీంనగర్‌లో 33 రూట్లలో 33 మంది, హుజూరాబాద్‌లో 30 రూట్లలో 30 మంది, మానకొండూర్‌లో 29 రూట్లలో 29 మంది, చొప్పదండిలో 31 రూట్లలో 31 మంది, హుస్నాబాద్‌లో 32 రూట్లలో 32 మంది, సిరిసిల్లలో 32 రూట్లలో 26 మంది, వేములవాడలో 26 రూట్లలో 26 మంది సెక్టోరల్ ఆఫీసర్లున్నారు. మరో 22 మందిని రిజర్వులో ఉంచారు. ఎన్నికల సిబ్బందిని తరలించి, పోలింగ్ తర్వాత తిరిగి ఎస్సారార్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంల్లోకి ఈవీఎంలను భద్రపర్చడంలో సెక్టోరల్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తారు. కాగా, ఎన్నికల సామగ్రి పంపిణీని రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ సర్ఫరాజ్‌అహ్మద్‌తోపాటు జేసీ శ్యాంప్రసాద్‌లాల్, సబ్ కలెక్టర్లు, రాజశ్రీ, ప్రావీణ్య, సంబంధిత అసెంబ్లీ సెగ్మెంట్ల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు పర్యవేక్షించారు.

105
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles