ప్రణాళిక ఉంటేనే లక్ష్యం చేరుతాం

Sun,March 24, 2019 01:30 AM

కరీంనగర్ క్రైం : కరీంనగర్ కమిషనరేట్‌లో పోలీసులు విధులు విస్మరించి జరిమానాలు జమ చేస్తున్నట్లుగా వస్తున్న ఆరోపణలు నిజం కాదని సీపీ కమలాసన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఏ వ్యవస్థలో నైనా పాలన సక్రమంగా సాగాలంటే ప్రణాళిక అవసరమనీ, ప్రణాళిక లేకుండా లక్ష్యాన్ని సాధించలేవన్నారు. ట్రాఫిక్ వ్యవస్థ అనేది పకడ్బందీ ప్రణాళికతో కూడుకున్న విభాగమనీ, ఈ విభాగానికి సంబంధించి మూడు విషయాలు గుర్తించాల్సి ఉంటుందని తెలిపారు. మొదటిది ట్రాఫిక్ ఇంజినీరింగ్, రెండోది ట్రాఫిక్ ఎడ్యుకేషన్, మూడోది ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అని వివరించారు. మొదటిది మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్, ఆర్‌అండ్‌బీ వాళ్లకు సంబంధించిన అంశమనీ, ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా తాము మనసు పెట్టి చేసిన రోడ్డు పనులు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. ఉదాహరణకు వర్షాకాలంలో నిలిచిన నీళ్లు.. పెరిగిన చెట్లు, అమర్చిన లైట్లు, తొలగించిన చెత్త, డ్రైనేజీలకు కొట్టిన గండ్లు, ఇంకా చెప్పాలంటే ఈ మధ్య నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిన చిన్న రోడ్లును పెద్ద మనసుతో పద్మనగర్‌లో వెడల్పు చేసింది పోలీసులేనని గుర్తుచేశారు. రెండో అంశంలో ఇప్పటికే కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు నగరమంతటా పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య సముదాయాల్లో అనేక కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారని తెలిపారు. మూడో అంశం జరిమానా ఇది ప్రజల్లో వేగంగా చొచ్చుకుపోయే అంశమనీ, దీనిపై ప్రజలకు మరింత తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కరీంనగర్‌లో ఈ- చలాన డిసెంబర్ 23, 2018 నుంచి ప్రారంభమైందనీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విధానం వల్ల ప్రజల్లో క్రమశిక్షణ కలిగిన డ్రైవింగ్ పెరుగుతున్నదని పేర్కొన్నారు.

అలాగే ఫిబ్రవరి 1 నుంచి 95 శాతం హెల్మెట్ కలిగి ఉన్న డ్రైవింగ్ పెరుగుతున్నదని తెలిపారు. అక్రమ పార్కింగ్‌లు లేకపోవడం, నగరంలో భారీ వాహనాల ప్రవేశం లేకపోవడం, ఇరుకు రోడ్లలో నిత్యం రద్దీగా ఉన్న డాక్టర్ స్ట్రీట్‌లో ట్రాఫిక్ జామ్ కాకపోవడం, ఆటో డ్రైవర్లలో పెరిగిన క్రమశిక్షణ ఇలా చెప్పుకుంటే పోతే ట్రాఫిక్ విభాగంలో క్రమబద్ధీకరణ, పర్యవేక్షణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అని దేనికవే వేర్వేరుగా ఉంటాయో తప్ప, కేవలం ఫొటోల కోసమే కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం సిగ్నలింగ్ వ్యవస్థ మొదలు కాకపోయినా, ముఖ్యమైన సభలు, పరీక్షల సమయంలో కానీ, ర్యాలీ సందర్భంలో ఏదైనా సరే ట్రాఫిక్ పోలీసులు మండే ఎండను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. రద్దీగా ఉన్నప్పుడు ఏ పోలీసు కూడా ఫొటోలపై దృష్టి పెట్టరనీ, ప్రతి ట్రాఫిక్ పోలీసు లక్ష్యం ప్రయాణం సులభం చేయడమేనని గమనించాలన్నారు. హైదరాబాద్ తర్వాత ఈ-చలానలో మెరుగ్గా ఉండటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా నగరాలకు సాధ్యం కాని విధంగా క్రమశిక్షణ గల ట్రాఫిక్ ఒక ఉదాహరణగా కనిపిస్తున్నదని చెప్పారు. కరీంనగర్ ట్రాఫిక్ పోలీసు పరిధి చాలా విస్తృతమైందనీ, పెరుగుతున్న రద్దీ కారణంగా ప్రధాన రహదారులపై కాకుండా కాలనీ ఉన్న రోడ్లపై ప్రమాదాలు జరుగుతుండటం గమనిస్తున్నామనీ, అవి కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించని ఐదు, పది శాతం ప్రజల వల్లేనని పేర్కొన్నారు. తమ లక్ష్యం ఆ కొద్ది మందిలోనూ మార్పు తేవడమేనన్నారు. ఆ సంకల్పంగా ఈ-చలాన పద్ధతి ద్వారా మార్పు వస్తున్నదనీ, పోలీసు చేసే ప్రతి పని సమాజ శ్రేయస్సు కోసమేనన్న విషయాన్ని గుర్తించాలే తప్ప నొప్పించడం తమ లక్ష్యం కాదని స్పష్టంచేశారు. వందల మంది క్షేమం కోసం ఒకరిద్దరిపై పడే జరిమానా అనేది సమాజానికి మంచి చేస్తుందే తప్ప, చేటు చేయదన్న విషయాన్ని గమనించాలని సీపీ కోరారు.

74
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles