16 సీట్లూ గెలుస్తాం

Sun,March 24, 2019 01:30 AM

మానకొండూర్ : గత నాలుగున్నరేళ్లలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం యావత్ దేశానికే దిక్సూచిగా మారిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోతోపాటు ప్రచారసభకు ఎంపీ వినోద్‌కుమార్, స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి పాల్గొన్నారు. స్థానిక పల్లెమీద చౌరస్తా నుంచి తూర్పు దర్వాజ, మార్కెట్ ఏరియా మీదుగా గడిమహల్ వరకు డప్పు కళాకారుల విన్యాసాలు, మహిళల కోళాటాల నడుమ సాగిన రోడ్‌షోకు జనం నీరాజనం పట్టారు.

అనంతరం గడిమహల్ వద్ద ప్రచార సభలో మంత్రి మాట్లాడారు. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో జరుగని అభివృద్ధి టీఅర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఉంది కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఉద్యమ పార్టీకి పట్టంగట్టారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 24 గంటల పాటు కరెంట్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణేనని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు టీఅర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించి ప్రజాసమస్యలపై పోరాడుతున్న ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. అనంతరం ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవనీ, రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలిచి గులాబీ పార్టీ జాతీయ రాజకీయాల్లో సత్తాచాటుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేంద్ర నిధులు రావాలంటే పార్లమెంట్‌లో మన సంఖ్యాబలం ఎక్కువగా ఉండాలన్నారు. దక్షణ భారత దేశంలో ఎక్కడాలేని తీగల వంతెనను కరీంనగర్‌లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, ఎంఎఫ్‌సీ చైర్మన్ అక్బర్ హుస్సేన్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

82
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles