మద్దతు ఇవ్వండి.. మరింత అభివృద్ధి చేస్తా..

Wed,March 20, 2019 12:53 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నగరంలో మరింత అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్ అభ్యర్థి, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి ఐదేళ్లలో శాయశక్తులా కృషి చేశామనీ, ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తే.. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఎస్సారార్ కళాశాల మైదానంలో వాకర్స్‌ను కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కరీంనగర్ జాతీయ రహదారుల కూడలిగా మారుతుందన్నారు. కేంద్రం రూపొందించిన స్మార్ట్‌సిటీ పథకంలో ఇప్పటికే కరీంనగర్ ఎంపికయిందనీ, దీనికింద చేపట్టే అభివృద్ధి పనులకు టెండర్లు కూడ పూర్తి చేశామని గుర్తుచేశారు. కరీంనగర్‌కు సైన్స్ సెంటర్ మంజూరు అయిందనీ, ఈ పనులు పూర్తి అయితే ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలోని విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీని మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తనను మరోసారి గెలిపిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకువచ్చి నగర రూపు రేఖలు మారుస్త్తానన్నారు.

ఎంపీ వినోద్ చొరవతోనే స్మార్ట్‌సిటీ: ఎమ్మెల్యే గంగుల
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు నగరానికి ఒక్క రూపాయి కూడ నిధులు రాలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ హయాంలో రూ.వందల కోట్ల నిధులు వచ్చాయనీ, అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే ఎంపీగా వినోద్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన చొరవతో స్మార్ట్‌సిటీ సాధించుకున్నామనీ, అలాగే జాతీయ రహదారులు వచ్చాయని పేర్కొన్నారు. ఇవేకాకుండా అనేక అంశాల్లో ఎంపీ తనదైన పద్ధతిలో ప్రయత్నించి పలు అభివృద్ధి పథకాలు సాధించారని గుర్తుచేశారు. కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లైన్ సాధించడమే కాదు.. సదరు పనులను యుద్ధప్రాతిపదికన చేయిస్తున్న ఘనత ఎంపీకి దక్కుతుందన్నారు. భవిష్యత్తులో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలువాలంటే ఎంపీ స్థానాన్ని అఖండ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందించాలని కోరారు. ప్రచారంలో జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్‌హుస్సేన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, మేయర్ రవీందర్‌సింగ్, కార్పొరేటర్లు వై సునీల్‌రావు, కంసాల శ్రీనివాస్, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, కొండ సతీశ్, గుంజపడుగు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

104
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles