ప్రైవేట్‌కు వ్యతిరేకం కాదు..

Wed,March 20, 2019 12:52 AM

-సీఎం దృష్టికి ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు
-ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి
-ట్రస్మా సమావేశంలో రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్
-హాజరైన అభ్యర్థులు వినోద్‌కుమార్, మామిడి చంద్రశేఖర్‌గౌడ్
హుజూరాబాద్,నమస్తే తెలంగాణ, హుజూరాబాద్ టౌన్: ప్రైవేట్ విద్యా సంస్థలకు టీఆర్‌ఎస్ సర్కార్ వ్యతిరేకం కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రతాపసాయి గార్డెన్స్‌లో ఎమ్మెల్సీ అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతుగా నియోజకవర్గ ట్రస్మా సమావేశం జరిగింది. దీనికి ఎంపీ బీ వినోద్‌కుమార్‌తో కలిసి మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభు త్వం మానవత్వంతో పని చేస్తున్నదనీ, పేదల సంక్షేమానికి ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మంత్రి ఈటల హామీ ఇచ్చారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. విద్యా, వైద్యానికే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదనీ, అయితే ఇందులో ప్రైవేట్ విద్యా సంస్థలను నష్టపరిచే ఉద్దేశ్యం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నారని, దీనికి తమ వంతుగా ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించి తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్లు అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటే అందరికీ బీమా సౌకర్యం కల్పించేందుకు తాను ఎంపీగా గెలచిన తర్వాత తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపిస్తే రాష్ట్ర, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 22న జరుగబోయే కరీంనగర్ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో తనకు ఉద్యోగ, నిరుద్యోగ పట్టభద్రులు అండగా నిలవాలని కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులకు అండగా నిలువాలనే ఏకైక లక్ష్యంతో తాను ఉద్యోగానికి రాజీనామా చేసి, ఎన్నికల బరిలో నిలిచానని స్పష్టంచేశారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటి సారిగా సమావేశానికి వచ్చిన ఈటల రాజేందర్‌తోపాటు ట్రస్మా నాయకుడిగా ఉండి చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన సుంకె రవిశంకర్, ఎంపీ వినోద్‌కుమార్‌లను ట్రస్మా నాయకులు శాలువా కప్పి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ట్రస్మా నాయకులు యాదగిరి శేఖర్‌రావు, కోరెం సంజీవరెడ్డి, ఎడవెల్లి విజేందర్‌రెడ్డి, పేర్యాల రవీందర్‌రావు, మహిపాల్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మంద ఉమాదేవి, బండ శ్రీనివాస్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles