పార్లమెంట్ ఎన్నికల్లోనూ జయకేతనం

Tue,March 19, 2019 02:30 AM

-రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలు గెలుస్తాం
-కేంద్రంలో మనమే కీలకం అవుతాం
-కరీంనగర్ మహాసభను అదృష్టంగా భావిస్తున్నాం
-ఎంపీ వినోద్‌కుమార్ రాష్ర్టానికీ ఎన్నో సేవలందించారు
-మరోసారి లోక్‌సభ సభ్యుడిగా ఘన విజయం సాధిస్తారు
-విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్
-సభ సక్సెస్‌లో ప్రతి కార్యకర్త కృషి: వినోద్‌కుమార్
-ఐదున్నర లక్షల మెజార్టీ లక్ష్యం : ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌కు మరో ఘన విజయాన్ని అందించబోతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తంచేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్‌తోసహా రాష్ట్రంలోని 16 స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ జయకేతనం ఎగుర వేస్తుందని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు ఆయన వెంట ఉన్నారు. అనంతరం స్థానిక మల్టీప్లెక్స్‌లో మంత్రి ఈటల రాజేందర్ విలేకరులతో మాట్లాడారు. ఎంపీ వినోద్‌కుమార్ అందరినీ కలుపుకు పోయే నాయకుడన్నారు. 2004లో హన్మకొండ ఎంపీగా పరిచయమైన ఆయన 2014లో కరీంనగర్ ఎంపీగా గెలిచి జిల్లాకే కాకుండా రాష్ర్టానికి సైతం ఎన్నో సేవలను అందించారని గుర్తుచేశారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన మరోసారి ఘన విజయం సాధిస్తారని స్పష్టం చేశారు.

కరీంనగర్‌లో ఆదివారం నిర్వహించిన సభ ఓ చారిత్రక అవసరంగా తాము భావిస్తున్నామన్నారు. ఇది యావత్ దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు నిర్వహించిన గొప్ప చారిత్రక సభ అని మంత్రి అభివర్ణించారు. ఇలాంటి మహాసభను నిర్వహించే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలిచి ఏం సాధిస్తారని ప్రశ్నించే వారికి సీఎం కేసీఆర్ కరీంనగర్ నుంచి గట్టి సమాధానమే చెప్పారని అన్నారు. ఒకప్పుడు పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌కు ఆరుగురు ఎంపీలే ఉన్నారనీ, తెలంగాణ సాధించుకున్నపుడు కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని గుర్తు చేసిన మంత్రి.. ఆ ఇద్దరే పార్లమెంట్‌ను స్తంభింపజేశారని పేర్కొన్నారు. ఈనాడు 16 పార్లమెంట్ స్థానాలు గెలిస్తే కేంద్రంలో మనమే కీలకం అవుతామని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, పదకొండేండ్లు పాలించిన బీజేపీ ఈ దేశానికి ఏం చేశాయని మంత్రి ప్రశ్నించారు.

నాలుగున్నరేండ్లలో తెలంగాణ రాష్ట్రంలో గొప్ప కార్యక్రమాలు చేసి దేశానికి చూపిన పార్టీ టీఆర్‌ఎస్ అని చెప్పారు. దేశ వ్యాప్తంగా రైతుబంధు పథకం అమలైతే రైతులు బాగుపడతారని, అభివృద్ధి, సంక్షేమం అంటే ఇప్పుడు దేశం కేసీఆర్ వైపు చూస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక రాష్ర్టాలు దేశ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని 40 గ్రామాల ప్రజలు ఇక్కడ అమలవుతున్న పథకాలకు ఆకర్శితులై తమను తెలంగాణలో కలుపుకోవాలని కోరుతున్నారని మంత్రి చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వాలు దేశాన్ని పాలించే రోజులు వస్తున్నాయని, దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 20 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఈ కొద్ది రోజులు ప్రతి కార్యకర్త సైనికుడిలా పోరాడాలని, ఎన్నికల్లో నిలబడింది తామే అన్న రీతిలో పనిచేసి కరీంనగర్ స్థానం నుంచి వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను మంత్రి ఈటల రాజేందర్ కోరారు.

* సభ సక్సెస్‌లో ప్రతి కార్యకర్త కృషి: వినోద్‌కుమార్
ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాను ఈ రోజు నామినేషన్ దాఖలు చేశానన్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్, చెన్నమనేని రమేశ్‌బాబు, వొడితల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్ నేతృత్వంలో ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభ కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించామన్నారు. ఈ సభ విజయవంతం కావడంతో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ వేదికపైనే అభినందించారని ఎంపీ వినోద్ అన్నారు. ట్రాఫిక్ జామ్‌వల్ల ఇంకా 20 నుంచి 30 శాతం మంది సభ స్థలికి చేరుకోలేక పోయారని అన్నారు. సభను విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్త కృషి, శ్రమ ఉన్నదని ఎంపీ పేర్కొన్నారు.

ఐదున్నర లక్షల మెజార్టీ లక్ష్యం : ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ వినోద్‌కుమార్ మరో సారి ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ఎన్నికలకు సమయం తక్కువ ఉన్నా ప్రతి కార్యకర్త తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటికే 3.50 లక్షల మెజార్టీ సాధించి ఉన్నామని, అదనంగా మరో 2 లక్షల మెజార్టీ సాధించడం కోసం శ్రమించాలని కోరారు. ఇప్పటికే ఎన్నికల్లో ప్రచారం ఏ విధంగా నిర్వహించాలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, ఎంఎఫ్‌సీ చైర్మన్ అక్బర్ హుస్సేన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, నగర మేయర్ రవీందర్ సింగ్, మాజీ ఎమ్మెల్యేలు కొడూరి సత్యనారాయణ గౌడ్, ఆరెపల్లి మోహన్, ఎంపీపీ వాసాల రమేశ్, నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, వై సునీల్ రావు, నాగరాజు, జగ్గం నర్సయ్య, సంపత్‌రావు, కంసాల శ్రీనివాస్, అర్ష మల్లేశం, చల్ల హరిశంకర్, తిరుపతి నాయక్, గుంజపడుగు హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.

* మొదటి రోజే వినోద్ దాఖలు..
నామినేషన్ల స్వీకరణ మొదటి రోజే కరీంనగర్ ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా తన నివాసంలో సర్వమత ప్రార్థనలు చేసి, అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రకాశంగంజ్‌లో ఉన్న సిద్ది వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 2.40గంటలకు కలెక్టరేట్‌లో నామినేషన్ వేశారు. అమాత్యులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్‌తో కలిసి ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు ఒక సెట్ అందించారు. జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎంఎఫ్‌సీ చైర్మన్ అక్బర్ హుస్సేన్‌తో కలిసి మరో సెట్ అందజేశారు.

* మొదటి రోజే వినోద్ దాఖలు..
నామినేషన్ల స్వీకరణ మొదటి రోజే కరీంనగర్ ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా తన నివాసంలో సర్వమత ప్రార్థనలు చేసి, అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రకాశంగంజ్‌లో ఉన్న సిద్ది వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 2.40గంటలకు కలెక్టరేట్‌లో నామినేషన్ వేశారు. అమాత్యులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్‌తో కలిసి ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు ఒక సెట్ అందించారు. జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎంఎఫ్‌సీ చైర్మన్ అక్బర్ హుస్సేన్‌తో కలిసి మరో సెట్ అందజేశారు. ఎంపీ వెంట ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్‌చార్జి బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావు, నగర మేయర్ రవీందర్ సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్, నాయకులు వై సునిల్ రావు, నాగరాజు తదితరులు ఉన్నారు.

114
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles