వినియోగదారుల మన్ననలు పొందాలి

Tue,March 19, 2019 02:27 AM

-అత్యుత్తమ సేవలు అందించాలి
-బకాయిలను వసూలు చేయాలి
-ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్) దొంతినేని నర్సింగారావు
-కొత్తపల్లి సబ్ స్టేషన్ సందర్శన
జమ్మికుంట: విద్యుత్ వినియోగదారులపట్ల మర్యాదగా ప్రవర్తించాలనీ, అత్యుత్తమ సేవలను అందిస్తూ వారి మన్ననలు పొందాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్)దొంతినేని నర్సింగారావు అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన జమ్మికుంటకు వచ్చారు. మండలంలోని కొత్తపల్లి సబ్ స్టేషన్‌ను సందర్శించారు. పనితీరును అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.15కోట్లు వచ్చాయనీ, వీటిని వీధి దీపాల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. అయితే జిల్లాలోని గ్రామ పంచాయతీల వీధి దీపాల బకాయిలు రూ.74కోట్లున్నాయనీ, అందులో 30శాతం జీపీలు చెల్లించాలని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో కరెంటు వెలుగులు నింపేందుకు నిరుపేదల కోసం రూ.125లకే విద్యుత్ కనెక్షన్ అందిస్తున్నామనీ, ఈ నెల 31వరకే ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రూ.125కనెక్షన్ టార్గెట్ లక్షా 60వేలు కాగా, ఇప్పటికే లక్షా 40వేలిచ్చామని తెలిపారు. వ్యవసాయ బావులకు విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వినియోగదారుల సమస్యలన్నీ పరిష్కరించామని చెప్పారు. అంతరాయం లేకుండా నాణ్యమైన 24గంటల కరెంటును అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రమాదాల్లేకుండా లూజు లైన్లను సరిచేశామనీ, అవసరమున్న చోటల్లా సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే వినియోగదారులు కూడా సకాలంలో బిల్లులు చెల్లించి, సంస్థ రెవెన్యూ పెంచేందుకు సహకరించాలని కోరారు. అనంతరం డైరెక్టర్ నర్సింగారావు తొలిసారిగా జమ్మికుంటకు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఎస్‌ఈ మాధవరావు, ఏడీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఏఈలు సత్యనారాయణ, సర్వేశ్వర్, రాజు, సబ్ ఇంజినీర్లు మనోజ్, శ్రావణ్, మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.

90
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles