టీఆర్‌ఎస్‌లోకి ఆరెపల్లి

Mon,March 18, 2019 01:39 AM

- హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో చేరిక
- ఆయన వెంటే ప్రధాన అనుచరగణం
- మానకొండూర్‌లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్
- బంగారు తెలంగాణలో భాగస్వాములం కావాలనే చేరాం : ఆరెపల్లి మోహన్
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:అధికార టీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించిన రోజునే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి తొలి దెబ్బ తగిలింది. ఈ పార్టీ సీనియర్ నాయకుడు, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి పనిచేసిన ఆరెపల్లి మోహన్ అంచెలంచెలుగా ఎదిగి తిమ్మాపూర్ జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి, జడ్పీ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఆ తర్వాత మానకొండూర్ ఎమ్మెల్యేగా గెలిచి రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్ ముఖ్యమంత్రులుగా ఉన్నపుడు ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్న ఆరెపల్లి మోహన్ మానకొండూర్ నియోజవర్గంలో పెద్ద దిక్కుగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికకు ముందు ఆయన చేరిక కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కేసీఆర్ శంఖారావం రోజునే..
కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘ కాలం కొనసాగిన ఆరెపల్లి మోహన్ మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పెద్దపల్లి పార్లమెంట్‌కు టికెట్ కేటాయించే విషయంలో తనను కనీసం సంప్రదించలేదని ఆయన ఆ పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడిగా ఉన్న తనకు కనీస సమాచారం లేకుండా, స్థానిక నాయకత్వాన్ని విచారించకుండా పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో కొనసాగడం కష్టమని భావించిన ఆరెపల్లి, కరీంనగర్‌లో సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించన రోజునే టీఆర్‌ఎస్ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్ పార్టీలో మొదటి విడత పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న ఆరెపల్లిని ఆ పార్టీ నాయకులు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయినా ఆరెపల్లి తన ముఖ్య అనుచరులతో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, నుస్తులాపూర్ మాజీ సర్పంచు తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, అల్గునూర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు చల్ల రవీందర్, మానకొండూర్ మండలం చెంజర్ల సర్పంచు బోల్ల వేణుగోపాల్, ఇల్లంతకుంట మండల నాయకులు ఒగ్గు నర్సయ్య, ఒగ్గు రమేశ్, మానకొండూర్ మండల నాయకులు పడాల శంకరయ్య, తదితరులు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

బంగారు తెలంగాణలో భాగస్వామ్యులం కావాలని చేరాం
- ఆరెపల్లి మోహన్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అమలు చేస్తున్న ప్రతీ పథకం ప్రజలకు ఎంతో ఉపయోగరంగా ఉంటోందనీ, ఆయన కంటున్న బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే తాను కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టు నిర్మాణం వంటి అనేక పథకాలతో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా భవిష్యత్తులో దళిత జనోద్దారకుడిగా కూడా కేసీఆర్ అవతరించబోతున్నారని విశ్వసిస్తున్నట్లు ఆరెపల్లి చెప్పారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలపట్ల ఆకర్శితులవుతున్న అనేక పార్టీల నాయకులు ఈ రోజు టీఆర్‌ఎస్‌ను బలపర్చాలనే నిర్ణయానికి వస్తున్నారనీ, అందులో భాగంగానే తాను కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొంత మంది ముఖ్యమైన అనుచరులతో టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ఆరెపల్లి మోహన్ ప్రకటించారు.

226
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles