సభకు సన్నద్ధం

Sun,March 17, 2019 12:53 AM

-భారీ జనసమీకరణపై టీఆర్‌ఎస్ దృష్టి
-పార్టీలోకి ఊపందుకున్న వలసల పర్వం
-మానకొండూర్, చొప్పదండిలో భారీగా చేరికలు
-ముఖ్య నాయకులతో ఎమ్మెల్యేల సమావేశాలు
-నేటిసభకు రెండు లక్షలకుపైగా జనసమీకరణ
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:పార్లమెంట్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు టీఆర్‌ఎస్ నాయకులు సన్నద్ధమయ్యారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో జిల్లా నాయకులు భారీ జనసమీకరణపై దృష్టి సారించారు. శనివారం అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్యులు, ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి బాధ్యతలు అప్పగించారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా పలు పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో శనివారం ఎంపీ బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రసమయి, సుంకె రవిశంకర్ సమక్షంలో భారీగా చేరారు.

భారీ జన సమీకరణే లక్ష్యం
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి 2 లక్షలకు పైగా జనాన్ని తరలించాలని టీఆర్‌ఎస్ నాయకులు నిర్ణయించుకున్నారు. ఇందు కోసం నాలుగైదు రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతి గ్రామం, పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. శనివారం కరీంనగర్ ఎమ్మెల్యే తన మీసేవా కేంద్రంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కూడా తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి జన సమీకరణకు కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. రామడుగు మండలం రుద్రారంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వీర్ల వెంకటేశ్వర్‌రావు ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశమై మండలం నుంచి భారీగా జనాన్ని తరలించేందుకు కార్యాచరణ రూపొందించారు. హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని చిగురుమామిడి మండలం ఇందుర్తిలో ఎంపీపీ అందె సుజాత ఇంటింటికీ తిరిగి బొట్టు పెడుతూ సీఎం కేసీఆర్ సభకు హాజరు కావాలని ఆహ్వానించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో పార్టీ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు బ్యాండ్ వాయిస్తూ గ్రామంలో ప్రచారం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో జన సమీకరణకు టీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.

టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం
అధికార టీఆర్‌ఎస్‌లోకి పెద్ద ఎత్తున వలసల పర్వం కొనసాగుతున్నది. మానకొండూర్ నియోజకవర్గంలో శనివారం కాంగ్రెస్, తదితర పార్టీల నుంచి చేరికలు కొనసాగాయి. ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి సమక్షంలో మానకొండూర్ నుంచి ఏడుగురు సర్పంచులు, 800 మందికి పైగా కార్యకర్తలు, నాయకులు పార్టీలో చేరారు. అలాగే తిమ్మాపూర్ మండలంలో 8 మంది సర్పంచులు, 900 మందికిపైగా కార్యకర్తలు, నాయకులు చేరారు. మానకొండూర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచే వలసలు మొదలయ్యాయి. శనివారం చేరిన 8 మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. ఈ పార్టీ మండల శాఖ అధ్యక్షులు దన్నమనేని నర్సింగరావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో కీలక నాయకుడు, కేడీసీసీబీ డైరెక్టర్ దేవెందర్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక చొప్పదండి అసెంబ్లీ పరిధిలోనూ ఇదే విధంగా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరారు. శనివారం గంగాధర, రామడుగు మండలాల నుంచి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పార్టీ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్‌రావు సమక్షంలో పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరికలు జరిగాయి. ఇందులో రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, తదితరులు ఉన్నారు.

122
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles