మంత్రివర్గంలోకి ఈటల, కొప్పుల

Tue,February 19, 2019 01:24 AM

-రాజేందర్‌కు రెండోసారి చాన్స్
-కొప్పుల ఈశ్వర్‌కు మొదటిసారి..
-నేడు ప్రమాణ స్వీకారం
కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా పది మంది మం త్రులు ప్రమాణం చేయనుండగా మన జిల్లా నుం చి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు చోటు దక్కింది. ఈ మేరకు సోమవారం రాత్రి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. నేడు ప్రమాణ స్వీకారం చేసేందుకు రావాలని ఆహ్వానం రాగా, ఈ విషయం తెలిసిన వెంటనే ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. నేటి కార్యక్రమానికి హాజరయ్యేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు సిద్ధమయ్యాయి.

ఈటలకు రెండోసారి అవకాశం..
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఆర్థికమంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్, మొదటి నుంచీ కేసీఆర్ వెంటే నడుస్తున్నారు. ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో ఉంటూ, అధినేతకు నమ్మినబంటుగా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనే కాదు, బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2002లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఆయన, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆయనపై ఉన్న నమ్మకంతో బలమైన ప్రత్యర్థి ఉన్న కమలాపూర్ నియోజకవర్గ టికెట్‌ను కేసీఆర్ 2004లో కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో ఉద్దండుడైన ముద్దసాని దామోదర్‌రెడ్డిపై గెలుపొందారు. 2008 ఎన్నికల్లో మెజార్టీని పెంచుకొని మరోసారి ఘనవిజయం సాధించారు. 2009లో ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామా చేశారు. తర్వాత హుజూరాబాద్ నుంచి పోటీ చేసి, గెలుపొందారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. 2014 ఎన్నికల్లో విజయబావుటా ఎగరేశారు. అనంతరం రాష్ట్ర కేబినెట్‌లో రాష్ట్ర తొలి ఆర్థిక, పౌరసరపరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా ఉంటూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్నింటా అండగా నిలిచారు. ఇటీవలి ఎన్నికల్లోనూ గెలుపొంది, డబుల్ హ్యాట్రిక్ సాధించారు.

ఓటమి ఎరుగని నేతగా ముద్రవేసుకున్నారు. నా టి నుంచి నేటివరకు తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ అధినేత వెంటే నడిచిన ఈటల.. నాడు ఉద్యమ సమయంలో పార్టీకి జిల్లాలో పెద్ద అండగా నిలిచారు. పరిస్థితులు ఎలా ఉన్నా.. అధినేతకు నమ్మిన బంటుగా ఉన్నారు. అందుకే ఈటలకు 2014 తొలి క్యాబినెట్‌లో అత్యున్నత అర్థిక మంత్రి పదవి ఇచ్చారు. ఆర్థిక, పౌరసరఫరాల శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన ఆయనకు, మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం రాత్రి ఫోన్ వచ్చింది. నేటి ప్రమాణ స్వీకారం చేసేందుకు రావాలని పిలుపు వచ్చింది. ఈ విషయం బయటకు తెలియడంతో హుజురాబాద్‌లో అభిమానులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. రాత్రి 11గంటల ప్రాంతంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద పటాకలు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. జై కేసీఆర్.. జై జై ఈటల అంటూ నినాదాలు చేశారు.

కొప్పులకు మొదటిసారి పట్టం..
టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ధర్మపురి ఎమ్మె ల్యే కొప్పుల ఈశ్వర్ సింగరేణి ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదట్లో టీడీపీలో ఉన్న ఆయన, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆనాటి నుంచి నేటి వరకు కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. పార్టీలో నమ్మకంగా ఉంటూ, అకింతభావంతో పనిచేస్తూ వచ్చారు. సందర్భం ఏదైనా కేసీఆర్ వెంట నడిచారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2004 నుంచి 2018 వరకు జరిగిన ఉపఎన్నికలు, సాధారణ ఎన్నికలతో కలుపుకుని వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్రంలో ఇంత వరకు డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసిన ఘ నత కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఉండగా, ఆ తర్వాత ఈటల రాజేందర్, హరీశ్‌రావుతోపాటు కొప్పుల సొంతం చేసుకున్నారు. పలుసార్లు అ మాత్య పదవి వచ్చినట్లే వచ్చి చేజారింది. కొత్త రాష్ట్రంలో మొదటిసారి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని భావించినా, చివరి క్షణంలో చేజారి పోయింది. తర్వాత చీఫ్ విప్ హోదా వరించింది. అయినా ఏనాడూ నిరాశ చెందకుండా అధినేత వెంటే నడిచారు. విధేయతతో పనిచేస్తూ, నమ్మకమైన నాయకుడిగా ఉన్నారు. తాజాగా ఆ విధేయత, అంకితభావానికి సీఎం కేసీఆర్ పట్టం కట్టారు. కొప్పులకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ముఖ్యమంత్రే స్వయంగా ఈశ్వర్‌కు ఫోన్ చేసి, నేడు జరిగే మంత్రివర్గ ప్రమాణస్వీకారం కోసం సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ విషయం బయటకు తెలియగానే, హైదరాబాద్‌లో ఉన్న కొప్పులను జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలోనూ అభిమానులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

125
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles