బ్రహ్మోత్సవ వైభవం

Sun,February 17, 2019 02:22 AM

కరీంనగర్ కల్చరల్: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు వేద పండితులు మంత్రోచ్ఛారణ మధ్య శాస్ర్తోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించగా, ఆలయం భక్తులతో పోటెత్తింది. కృష్ణయజుర్వేద పండితులు గుదిమెళ్ల విజయకుమారాచార్యులు, ప్రణిత్ కుమారాచార్యుల బృందం ఆధ్వర్యంలో యాగశాలలో ఆరాధన, సేవాకాలం, చతుస్థానార్చన, మూలమంత్రహవనం, మహాపూర్ణాహుతి జరిపారు. శ్రీవారి సేవలో ఎంపీ వినోద్‌కుమార్ దంపతులు, సీఎం కేసీఆర్ తోడల్లుడు రవీందర్‌రావు దంపతులు వేర్వేరుగా పాల్గొని తరించారు. వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి గర్భాలయంలో పూజలు జరిపించగా, ఉత్సవాల ప్రధాన నిర్వాహకులు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఈఓ, ఉత్సవ కమిటీ నిర్వాహకులు సన్మానించి శేషవస్ర్తాలు, ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ముత్తయిదువలతో చూర్ణోత్సవం జరిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో చక్రతీర్థోత్సవం జరుపగా భక్తులు అందులో స్నానం చేసి పునీతులయ్యారు. ఎమ్మెల్యేకు ఆలయ ఈఓతోపాటు, అర్చకులు చూర్ణం అలంకరించారు.

కార్యక్రమంలో చైర్మన్ చకిలం ఆగయ్య, ఈఓ పీచర కిషన్‌రావు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు వాసం రామలింగం, గంప రమేశ్, తిప్పబత్తిని రవీందర్, కంసాల దేవత, గోగుల ప్రసాద్, బూర్ల విద్యాసాగర్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నందెల్లి మహిపాల్, నాయకులు, కార్పొరేటర్లు, ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు భారీగా రావడంతో ఏసీపీ అశోక్, సీఐ తుల శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు చేశారు. ఎస్సారార్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, శ్రీవారి సేవకులు భక్తులకు పలు చోట్ల సేవలందించారు.సాయంత్రం కల్యాణం జరిగిన వేదికపై ఉత్సవ మూర్తులకు శ్రీ పుష్పయాగం జరిపారు. పూలతో అర్చించారు. ద్వాదశరాధన, సప్తవరణాలు, తర్వాత ధ్వజావరోహణ, ఏకాంతసేవ, పండిత సన్మానం, మహదాశీర్వచన కార్యక్రమాలు జరిగాయి.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఉదయం సుందర సత్సంగ్ బృందం భజనలు, సుకన్య బృందం భరతనాట్యం, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణరావు ప్రవచనం భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. వావిలాల నాగరాణి భాగవతారిణి హరికథ అలరించింది. సాయంత్రం అన్నమయ్య ఆరాధనా అసోసియేషన్ బృందం అన్నమాచార్య సంకీర్తనలు, గణేశ్ భక్తిమండలి, ఉష బృందం పారాయణం, కే భ్రమరాంబశిష్యబృందం నృత్య ప్రదర్శనలు జరిగాయి.

107
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles