ఆకాశం నిండా..మువ్వన్నెల జెండా..

Sat,February 16, 2019 01:40 AM

- నగరం నడిబొడ్డున ఎగిరిన అతిపెద్ద జాతీయ పతాకం
- 150ఫీట్ల ఎత్తున రెపరెపలు
- కెప్టెన్, గంగులతో కలిసి ఆవిష్కరించిన ఎంపీ వినోద్
-హాజరైన జడ్పీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే సుంకె, ఎమ్మెల్సీ, కలెక్టర్, సీపీ, మేయర్
-వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు
- వెల్లివిరిసిన దేశభక్తి
-ఎక్కడ ఉన్నా భారతీయుడిగా గర్వపడాలి : ఎంపీ వినోద్
- స్మార్ట్‌సిటీ పనులకు శ్రీకారం

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మువ్వన్నెల జెండాను శుక్రవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో ఎగరేశారు. మల్టీపర్పస్ స్కూల్ మైదానంలో 150 ఫీట్ల ఎత్తున ఎగిరే జాతీయ పతాకాన్ని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఎంపీ బీ వినోద్ కుమార్ ఉదయం 11గంటలకు ఆవిష్కరించారు. వెంటనే వేలాది మంది విద్యార్థులు జాతీయగీతం ఆలపించారు. 32 ఫీట్ల నిలువు, 48ఫీట్ల వెడల్పుతో ఉన్న జెండా రెపరెపలాడగా, చూసి సంబురపడ్డారు. అనంతరం స్మార్ట్‌సిటీ పనుల్లో భాగంగా స్కూల్ మైదానంలో ఏర్పాటు చేయబోయే పార్కు పనులను ఎంపీ ప్రారంభించారు. అంతకుముందు అక్కడే నగర మేయర్ రవీందర్‌సింగ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ముష్కరుల దాడిలో మరణించిన వీర జవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న భారతీయుడిగా ప్రతి ఒక్కరూ గర్వపడాలని పిలుపునిచ్చారు. భారతదేశం భవిష్యత్తులో ప్రపంచంలోనే గొప్ప దేశంగా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం ఉన్నదనీ, ఇందుకు ప్రజలంతా కృషి చేయాల్సినా అవసరం ఉందని చెప్పారు. నేటి విద్యార్థులు కూడా దేశాభివృద్ధి తమ వంతుగా పాటుపడాలని సూచించారు.

మన చుట్టు పక్కల అనేక దేశాలు ప్రజాస్వామ్యంగా ఉండాలని ప్రయత్నాలు చేసినా కొనసాగాలేకపోయాయనీ, మన దేశం మాత్రమే ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతున్నదని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని తర్వాత అన్ని కార్యక్రమాల్లో కరీంనగరే ముందు వరుసలో ఉంటున్నదనీ, ఇప్పుడు జాతీయ జెండా ఏర్పాటులోనూ ముందే ఉందని చెప్పారు. దేశంలోని ప్రజలందరూ ఒకే జెండా కింద ఉండాల్సినా అవసరం ఉందనీ, మనమంతా భారతీయులుగా గర్వపడాలని ఉద్ఘాటించారు. ఎంపీ ప్రసంగానికి ముందు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడారు. బార్డర్‌లో సైనికులు, ఇక్కడ పోలీసులు ఉండడం వల్లే మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామనీ, వారికి అండగా నిలవాల్సిన అవసరమని స్పష్టం చేశారు. దేశభక్తికి గుర్తుగా ఇలాంటి ఏర్పాటు చేయడం వల్ల స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకునే అవకాశం ఏర్పడిందని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ చెప్పారు. దేశభక్తిని చాటుకునేందుకు ఇలాంటివి అవసరమనీ, కరీంనగర్‌లో పెద్ద జెండా ఏర్పాటు చేసుకోవడం గర్వకారణమని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎంఎఫ్‌సీ చైర్మన్ అక్బర్‌హుస్సేన్, సీపీ కమలాసన్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్‌లాల్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, నగర డిప్యూటీ మేయర్ రమేశ్, కమిషనర్ కన్నం సత్యనారాయణ, నగర కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

150
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles