అనుమానమే పెనుభూతమై...

Fri,February 15, 2019 01:06 AM

కరీంనగర్ క్రైం: అనుమానమే పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చి పోలీసులకు చిక్కకుండా పారిపోయిన ప్రబుద్దిన్ని కరీంనగర్ రూరల్ పోలీసులు ఎట్టకేలకు జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో గురువారం అదుపులోకి తీసుకున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈనెల 7న ఓ మహిళ హత్యకు గురైంది. ఈ ఘటనలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. హత్యకు గురైన మహిళను ఇనుప రాడ్‌తో కొట్టి తలపై సిమెంట్ ఇటుకతో మోది హత్య చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు చుట్టుపక్కల విచారించినా మృతురాలి వివరాలు దొరకలేదు. అదే సమయంలో ప్రధాన రహదారిపై ఉన్న సీసీ కెమెరాలు, రైల్వే స్టేషన్, మంచిర్యాల చౌరస్తాలో సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించగా హత్యకు గురైన మహిళతో మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో కొన్ని ఆధారాలు దొరకగా పోలీసులు పలువురు పాత నేరస్తులను విచారించగా మృతురాలు జగిత్యాల జిల్లా వెల్గటూరుకు చెందిన బానాల రమాదేవి (25)అలియాస్ రమణగా గుర్తించారు. హుటాహుటీన ఓ బృందం అక్కడికి వెళ్లి నిర్దారించుకున్న తర్వాత రమాదేవి వెంట ఉన్నది ఆమె భర్త కర్నె చిన్న (29)గా గుర్తించారు. సీసీటీవి రికార్డుల ఆధారంగా ఇద్దరిని గుర్తించిన తర్వాత అప్పటికే నాలుగు రోజుల క్రితం గుంటూరు జైలు నుంచి ఓ చోరీ కేసులో బెయిల్‌పై విడుదలైనట్లు గుర్తించి, అక్కడ కూడా విచారణ జరిపారు. నంద్యాల క్వార్టర్స్ సమీపంలో స్క్రాప్ దుకాణంలో పని చేసిన ఆ ఇద్దరిపై రైల్వే పోలీసులు దొంగతనం కేసు పెట్టడంతో గుంటూరు జైలుకు వెళ్లినట్లు గుర్తించి విచారణ జరుపగా రమాదేవి తండ్రి అక్కడికి వెళ్లి బెయిల్ ఇప్పించినట్లు తెలిసిందన్నారు. పోస్టుమార్టం అనంతరం హత్య కేసు నమోదు చేసి, రమాదేవి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు చిన్నా పరారీలో ఉండడంతో హంతకుడు అతనేనని నిర్దారించి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపులు చేపట్టారు. సీసీఎస్, రూరల్ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపులు చేపట్టగా, దొరికిన ఆధారాలతో హైదరాబాద్, కర్నూల్, నంద్యాల, ఆళ్లగడ్డకు వెళ్లి వివరాలు సేకరించారు.

ఈ క్రమంలోనే పోలీసులు తనను వెంటాడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న చిన్నా జగిత్యాలలో గతంలో ఉన్న పరిచయాలతో తన మిత్రులను ఫోన్‌లో సంప్రదించాడు. విషయం తెలిపి ఎక్కడికైనా పారిపోవాలని ప్రయత్నించే క్రమంలో ముంబై వెళ్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చి కరీంనగర్‌కు చేరుకున్నాడు. కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్లి అక్కడి మిత్రుల సహాయంతో ముంబై వెళ్లాలనే ప్రయత్నంలో గురువారం కరీంనగర్ బస్టాండ్‌కు చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఎక్కడ పని చేసినా శాశ్వత ఉపాధి లేకపోగా, ప్రతిసారి తన భార్య వెల్గటూరులో ఉందామని ఒత్తిడి తీసుకురావడంతో కోపంతోనే హత్య చేశానని అంగీకరించినట్లు తెలిపారు. అలాగే తన భార్యకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం వేసి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు చెప్పారు. రమాదేవి ఒత్తిడి మేరకు వెల్గటూరుకు వెళ్లే క్రమంలో కరీంనగర్‌కు వచ్చిన తర్వాత సాయంత్రం సినిమా చూశామనీ, రాత్రయిందని, ఉదయాన్నే లేచి వెళ్దామని అనువైన స్థలం కోసం రైల్వేస్టేషన్ ప్రాంతానికి తీసుకెళ్లాడనీ, రైల్వే స్టేషన్‌లో సాధ్యం కాకపోవడంతో రోడ్డు దాటి పట్టాల మార్గం గుండా రహదారిపైకి రాగా, అక్కడ వేసిన తాత్కాలిక షెడ్డు కనిపించడంతో అక్కడే నిద్రిస్తామ చెప్పి, నిద్రలోకి జారుకోగానే ఇనుప రాడ్‌తో కొట్టి చంపినట్లు నిందితుడు ఆంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. భార్యపై ఉన్న అనుమానంతోనే హత్యకు పాల్పడ్డాడనీ, ఇప్పటికే నమోదైన కేసులో చిన్నాను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ శశిధర్‌రెడ్డి వెల్లడించారు. నిందితున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కరీంనగర్ సీసీఎస్, రూరల్ సిబ్బందిని, కేసును చేధించిన సిబ్బంది బషీర్, హసన్‌లను సీఐ ప్రత్యేకంగా అభినందించారు.

341
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles