మత్స్యావతారుడి దర్శనం..సకల పాపహరణం

Fri,February 15, 2019 01:06 AM

శంకరపట్నం: దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు మహావిష్ణువు ఆయా యుగాల్లో దశావతారాలు ఎత్తాడు. స్వామి స్వయంభూగా వెలసిన ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. అందులో శంకరపట్నం మండలం కొత్తగట్టులోని ఏకశిలా కొండపై ఉన్న శ్రీమత్స్యగిరీంద్రస్వామి ఆలయం ఒకటి. పూర్వం సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున గల కొత్తగట్టు కొండపై ఉన్న కోనేటిలో దాగగా, చతురాణనుడు (బ్రహ్మదేవుడు) ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుడి శరణు వేడుకోగా ఆయన కొలనులోని సొరంగంలో వేదాధ్యయనం చేస్తున్న సోమకాసురున్ని మత్స్యావతారంలో వెళ్లి సంహరించి వేదాలను సురక్షితంగా బ్రహ్మ దేవుడికి అందించాడనీ, తిరిగి బ్రహ్మ సజావుగా పాలన సాగించాడని ఒక పురాణ గాథ. అక్కడి నుంచి 13వ శతాబ్దానికి వస్తే కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు, రుద్రమదేవితో కొత్తగట్టు గుండా వెళ్తూ చీకటి పడడంతో ఇక్కడి కొండపై విశ్రమించగా, స్వామి కలలోకి వచ్చి ఇక్కడ తాను వెలిశాననీ, తనకు ఆలయం నిర్మించాలని ఆదేశించాడనీ, రుద్రమదేవి గణపతిదేవున్ని కోరగా ఆలయ నిర్మాణం చేశాడని కొండపై ఉన్న ఒక శిలాశాసనం ద్వారా అవగతమవుతుంది. అయితే ఆలయ నిర్మాణం పూర్తిగాక ముందే కాకతీయుల సామ్రాజ్యం అంతరించగా, ఇక్కడ యజ్ఞయాగాదులు నిర్వహించే మహర్షులు స్వామి వారి ఆలయాన్ని పూర్తి చేసినట్లు చెబుతారు. ఆలయ నిర్మాణంలో కాకతీయుల కాలం నాటి శిల్పకళా రీతులు గోచరిస్తాయి. అప్పటి నుంచి ఇక్కడ శ్రీమన్నారాయణుడు దక్షిణ భారతంలోనే ఏకైక స్వయంభూ మత్స్యావతార రూపంలో భక్తుల పూజలందుకొంటున్నట్లు పండితులు చెబుతారు. స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం.

జాతరకు పోటెత్తనున్న భక్తులు
16వ తేదీ నుంచి పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈనెల 16న స్వామివారి కల్యాణం, 19న పౌర్ణమి జాతర, 20న నాకబలి నిర్వహిస్తారు. కల్యాణంతో పాటు జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.

దర్పణంలో మత్స్యావతార దర్శనం
శ్రీమహా విష్ణువు దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారాన్ని భక్తులు ఇక్కడ నేరుగా చూడలేరు. ఆలయం లోపల కుడివైపున ఉన్న ఓ గుహలో వెలిసిన చేప ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది. ముందు భాగంలో స్వామి వారితో పాటు శ్రీనీల, భూనీల విగ్రహాలు ఇరుపక్కల నయనానందకరంగా దర్శనమిస్తాయి. ఈ ఆలయం రాతి శిలలతో నిర్మించారు. స్వామి వారికి కుడివైపు ఉన్న మరో గుహలో భారీ ఆకారంలో ఉన్న ఉగ్ర నరసింహస్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. ఆలయానికి ఉత్తర దశలో శివాలయం, పక్కనే వీరాంజనేయస్వామి ఆలయం, కాళీమాతతో పాటు నవగ్రహాలు కలిగిన అనుబంధ ఆలయాలు కూడా ఉన్నాయి. మరో పక్క కొండపై కల్యాణ మంటపం ఉంది.

కోనేటి స్నానంతో వ్యాధులు దూరం
గుట్టపై ఆలయానికి తూర్పు భాగంలో నిత్యం నీటితో కోనేరు ఉంటుంది. కోనేటిలో స్నానం చేస్తే చర్మ వాధులతో పాటు పలు రుగ్మతలు తొలగిపోతాయని విశ్వాసం. కోనేటి నీటిని రైతులు పవిత్ర తీర్థంగా భావిస్తారు. చుట్టు పక్కల గ్రామాల రైతులు ప్రతీ శ్రావణ మాసంలో కోనేటి నీటిని తీసుకెళ్లి పంట పొలాల్లో చల్లుతుంటారు.

భక్తులకు ఏర్పాట్లు
భక్తుల కోసం పాలకమండలి సభ్యులు, అధికారులు తాగునీరు, చలువ పందిళ్లు, లైటింగ్, విద్యుత్, వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు. కాలినడకన గుట్టపైకి ఎక్కడానికి మెట్ల మార్గంతో పాటు వాహనాలు పైకి వెళ్లడానికి రోడ్డు మార్గం కూడా ఉంది. ఆలయం కరీంనగర్ నుంచి 30, హన్మకొండ నుంచి 40 కిలో మీటర్ల దూరంలో ప్రధాన రహదారిని ఆనుకొని ఉండడంతో భక్తులకు సులభ దర్శనం అవుతుంది.

133
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles