దళితవర్గాలకు దన్ను

Thu,February 14, 2019 01:18 AM

-స్వయం ఉపాధికి రాష్ట్ర సర్కారు భరోసా
-నాటుకోళ్ల పెంపకానికి పైలెట్ ప్రాజెక్టుగా జిల్లా
-గ్రామానికొకరు చొప్పున 321 మంది మహిళలకు అవకాశం
-ఒక్కొక్కరికి 50వేల విలువ జేసే కోళ్లు ఉచితం
-949 మంది యువతీయువలకు సబ్సిడీ రుణాలు
-త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ
-ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్
-అర్హులైన వారికే ప్రభుత్వ ఫలాలు : కార్యనిర్వాహక సంచాలకుడు మధుసూదన శర్మ
కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: దళితవర్గాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారి కుటుంబాలను అభివృద్ధి దిశగా మళ్లించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. వివిధ రకాల నాటు కోళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని పెంపకంవైపు ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే నాటుకోళ్ల పెంపకానికి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను కూడా జారీ చేసింది. ప్రతి గ్రామంలో అర్హులైన ఒక దళిత మహిళను ఎంపిక చేసి వారికి ఉపాధి చూపాలని ఆదేశాలు రాగా, జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. ఈ పథకం కింద ప్రతి గ్రామం నుంచి 321 మహిళలను ఎంపిక చేయనున్నారు. ఒక్కొక్కరికి 50వేల విలువ చేసే కోళ్లను పూర్తిగా ఉచితంగా కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. నాటు కోళ్ల పెంపకంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడంతోపాటు తగిన సహకారాన్ని అందించేందుకు జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం సహకారాన్ని తీసుకుంటున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం నిర్వహకులు లబ్ధిదారులకు సలహాలు, సూచనలే కాదు మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు.

* 1.61కోట్లతో మహిళలకు లబ్ధి..
నాటుకోళ్ల డిమాండ్, పెంపకానికి అనువైన వాతావరణం ఉందన్న ఉద్దేశంతో జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ పథకం కింద జిల్లావ్యాప్తంగా 1.61కోట్లతో లబ్ధిదారులకు లబ్ధి కల్పించనున్నారు. ఎంపిక పక్రియను కూడా అత్యంత పకడ్బందీగా చేపట్టనున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసే కమిటీలో మండలాభివృద్ధి అధికారితోపాటుగా, పశుసంవర్థక శాఖ నుంచి ఒక వెటర్నరీ అసిస్టెంట్, ఐకేపీ నుంచి ఏపీఎం, కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఒక సభ్యుడు ఉంటారు. ఈ నెలాఖరులోగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

* 949 మందికి స్వయం ఉపాధి..
దళిత యువతీ యువకులకు వివిధ పథకాల కింద లబ్ధి కల్పించేందుకు ప్రభుత్వం కొత్తగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల కింద 949 మందికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వడానికి ఆమోద ముద్ర వేసింది. అంతేకాదు, గతంలో మాదిరిగా కాకుండా ఈసారి 50వేల వరకు ఉండే స్వయం ఉపాధి యూనిట్లకు నూరు శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించడమే కాదు, అందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేసింది. అంటే 50 వేలతో ఏదేని యూనిట్ ఏర్పాటు చేసుకునే లబ్ధిదారుడు ఒక్క పైసా తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. గతానికి భిన్నంగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద జిల్లాలో 518 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వీటితోపాటుగా వివిధ రకాల పథకాల కింద 431 మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

* కేటగిరి-1 కింద అంటే యాభైవేల పై నుంచి లక్ష రూపాయల వరకు ఉండే యూనిట్‌కు 80 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. దీనికి కింద 199 మందికి 1.59 కోట్ల సబ్సిడీతో ఉపాధి కల్పించాలని నిర్ణయించారు.
* కేటగిరి-2 కింద లక్ష పై నుంచి 2 లక్షల విలువ వరకు యూనిట్ పెట్టుకుంటే దానిపై 70 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. దీని కింద 160 మందికి 2.24 కోట్ల సబ్సిడీతో లబ్ధి కల్పించాలని నిర్ణయించారు.
* కేటగిరి -3 కింద 2 లక్షల పైనుంచి 12 లక్షలవరకు పెట్టుకునే యూనిట్లకు 60 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. అయితే ఇందులో గరిష్ఠ సబ్సిడీ 5 లక్షలకు మించకుండా నిబంధన విధించారు. దీని కింద 65 యూనిట్లకు గాను 2.60 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు.

* ఇలా పొందాలి..
949 మందికి సంబంధించిన యూనిట్లలో ఉపాధి పొందాలంటే ఇప్పటికే www.tsobmms.cgg.gov.inలో నమోదు చేసుకున్న అభ్యర్థులు వారి ఆధార్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, తాజా ఆదాయ ధృవ పత్రాలతో సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్‌ను సంప్రదించాలి. ప్రతి పథకంలోనూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, అర్హులైన వారికే ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ అభివృద్ధి సంఘం కార్య నిర్వాహక సంచాలకుడు యన మధుసూదన శర్మ నమస్తే తెలంగాణకు తెలిపారు. అభ్యర్థులు ఎవరికి ఎమైనా అనుమానాలను నివృత్తి చేసుకోవాలంటే కలెక్టరేటులో ఉన్న కార్యాలయాన్ని సంప్రదించవచ్చని చెప్పారు. పైరవీలకు తావు లేదనీ, దళారులను ఎవరూ నమ్మవద్దని లబ్ధిదారులకు సూచించారు.

138
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles