మానవ వ్యర్థాలకు కొత్త అర్థం

Wed,February 13, 2019 01:21 AM

-శుద్ధీకరణ ప్లాంట్లతో బహుళ ప్రయోజనం
-సేంద్రియ ఎరువుల తయారీ
-విడుదలయ్యే నీటితో పార్కులు, రోడ్ల శుభ్రానికి వాడకం
- పూర్తిగా పర్యావరణ హితం
-ఏడాదిన్నర క్రితమే సిరిసిల్లలో ప్రయోగాత్మకంగా ఫీకెల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్
-90శాతం పనులు పూర్తి.త్వరలోనే ప్రారంభం
-తాజాగా ఉమ్మడి జిల్లాలోని పాత బల్దియాల్లో ఏర్పాటుకు శ్రీకారం
-నిధుల కేటాయింపు.. అధికారులకు దిశానిర్దేశం
-ఓడీఎఫ్ ప్లస్ ర్యాంకు సాధనే లక్ష్యం
కరీంనగర్ ప్రధాన ప్రతినిధి/రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఇప్పుడు ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణంతో ప్రతి పట్టణం బహిరంగ మల, మూత్ర విసర్జన రహితం (ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ- ఓడీఎఫ్)గా మారుతున్నది. అయితే మూడేళ్లకోసారి సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేయాల్సి ఉంటుంది. అందుకు ప్రత్యేకంగా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు సైతం వచ్చాయి. అయితే ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ యంత్రాల నిర్వాహకులు ఆ వ్యర్థాలను సేకరించి పట్టణ శివార్లు, బహిరంగ ప్రదేశాలతోపాటు వాగులు, నదుల్లో వదిలేయడంతో అసలు సమస్య మొదలవుతున్నది. మానవవ్యర్థాలను అలా ఊరిబయట ఎక్కడ పడితే అక్కడ వదలడం వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. దుర్వాసన వెదజల్లడమేగాక భూ గర్భజలాలూ కలుషితమవుతున్నాయి. ఎన్నో రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. అయితే మానవ మల, మూత్ర వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి, సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు తెలంగాణ సర్కారు, మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాల (ఫీకెల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల-ఎఫ్‌ఎస్‌టీపీ)కు 2017లోనే శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వరంగల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈ ఎఫ్‌ఎస్‌టీ ప్లాంట్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. ఇప్పటికే వరంగల్‌లో పూర్తయి సత్ఫలితాలు వస్తుండడంతో, తాజాగా మరో 74 పట్టణాలు, నగరాల్లో 140కోట్లతో ఫీకెల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు చేసి, ఓడీఎఫ్ డబుల్ ప్లస్‌గా మార్చాలని భావిస్తున్నది.

సిరిసిల్లలో 90శాతం పూర్తి..
కర్ణాటకలోని దేవహనహళ్లి మున్సిపాల్టీని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సర్కారు ముందుకు పోతున్నది. నేషనల్ అర్బన్ శానిటేషన్ పాలసీ పథకం కింద రాష్ట్రంలో తొలివిడతగా వరంగల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 2017లో ఈ ఫీకెల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. వరంగల్ అర్బన్ జిల్లాలో నెలకొల్పిన యూనిట్ ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతూ ప్రభుత్వం ఆశించిన రీతిలో సత్ఫలితాలనిస్తున్నది. సిరిసిల్ల పట్టణంలోని డంపింగ్‌యార్డు వద్ద కోటి 65 లక్షలను వెచ్చించి, 18కిలో లీటర్ ఫర్ డే సామర్థ్యంతో చేపట్టిన యూనిట్ పనులు 90శాతం పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లోనే యూనిట్‌ను పూర్తి చేసేందుకు శరవేగంగా సాగుతున్నాయి.

తాజాగా అన్ని పాత బల్దియాల్లో ఏర్పాటు..
రాష్ట్రవ్యాప్తంగా 74 పట్టణాలు, నగరాల్లో 140కోట్లతో ఫీకెల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు చేసి, ఓడీఎఫ్ డబుల్ ప్లస్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, పెద్దపల్లి బల్దియాలను ఎంపిక చేసింది. ఆయాచోట్ల జనాభా ప్రాతిపదికన నిర్ణీత సామర్థ్యంతో ఈ యూనిట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఆయాచోట్ల ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన నిధులు కూడా కేటాయించింది. ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం కేటాయించాలని ఆదేశించింది. కరీంనగర్‌లో 10 నుంచి 50 కిలోలీటర్ల సామర్థ్యంతో, రామగుండంలో 50 కిలోలీటర్లకు మించి సామర్థ్యంతో నిర్మించేందుకు ఇప్పటికే వర్క్ ఆర్డర్లను సైతం ప్రభుత్వం జారీ చేసింది.

కాంట్రాక్టర్లతో చర్చలు..
ఎఫ్‌ఎస్‌టీపీల ఏర్పాటులో భాగంగా మొదట సెప్టిక్ ట్యాంకర్ల క్లీనర్లు, సంస్థల ప్రతినిధులతో మున్సిపల్ అధికారులు చర్చలు జరుపుతున్నారు. వారికి స్థానికంగానే లైసెన్సులు జారీ చేయనున్నారు. మానవ వ్యర్థాల సేకరణ, తరలింపునకు సంబంధించి పక్కా రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రజలు కూడా తమ సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయించు కోవాలంటే మున్సిపల్ సిబ్బందినే సంప్రదించాల్సి ఉంటుంది. మున్సిపల్ అధికారులే ఇళ్లకు ట్యాంకర్లను పంపిస్తారు. సెప్టిక్ ట్యాంకు నుంచి తీసిన వ్యరాలను మున్సిపల్ డంపింగ్ యార్డుకు తరలించి సేంద్రియ ఎరువును తయారు చేయనున్నారు.

ప్లాంట్‌తో బహుళప్రయోజనాలు..
ఎఫ్‌ఎస్‌టీపీ ద్వారా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. మానవవ్యర్థాలను బయోమెథనైజేషన్ పద్ధతిలో శుద్ధి చేసి, ఎరువును తయారు చేయనున్నారు. 50 కిలోల మలాన్ని శుద్ధి చేయడం వల్ల సుమారు 6 నుంచి 7 కిలోల ఎరువు వస్తుంది. అదీగాక ఈ ప్రక్రియ వెలువడే శుద్ధి చేసిన నీటిని ఉద్యానవనాలకు సరఫరా చేయనున్నారు. రోడ్లను శుభ్రం చేసేందుకు సైతం ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందించారు. ఎరువును పచ్చక, కూరగాయల మొక్కలు పెంచాడానికి ఉపయోగించనున్నారు. ఈ ప్లాంట్ పూర్తిగా పర్యావరణ హితంగా ఉంటుంది. ఎకరం లేదా అంతకంటే తక్కువ స్థలంలోనే నెలకొల్పుతారు. శుద్ధి ప్రక్రియలో ఎలాంటి దుర్గంధం వెలువడకుండా ఉండే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తారు. ఇందులోని కెల్విన్ పరికరం ద్వారా ఎక్కడి నుంచయినా ప్లాంట్‌ను నిర్వహించే అవకాశమున్నది. మొత్తంగా ప్లాంట్ ద్వారా పట్టణాలు పరిశుభ్రంగా మారుతాయి.

ఓడీఎఫ్ డబుల్ ప్లస్ ర్యాంకే సిరిసిల్ల లక్ష్యం..
స్వచ్ఛతెలంగాణలో భాగంగా పట్టణంలో తడిపొడి చెత్త సేకరణ, మెరుగైన పారిశుధ్య నిర్వహణకు చర్యలను చేపట్టడంలో సర్కారు సఫలీకృతమైంది. మరోవైపు ఇంటింటికీ సెప్టిక్ ట్యాంకులు నిర్మించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రతిపాదికగా తీసుకున్న సిరిసిల్ల మున్సిపాల్టీ అధికారులు వంద రోజుల్లోనే వంద శాతం పూర్తి చేసి దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. ఓడీఎఫ్‌ను సాధించిన సిరిసిల్ల మరో అవార్డును దక్కించుకున్నది. స్వచ్ఛత సిరిసిల్లగా జాతీయస్థాయిలో ఓడీఎఫ్ ప్లస్‌గా గుర్తింపు తెచ్చుకున్నది. ప్రస్తుతం నిర్మిస్తున్న ఎఫ్‌ఎస్‌టీపీ యూనిట్ ప్రారంభమై పూర్తి స్థాయిలో పనిచేస్తే స్వచ్ఛతలో దేశంలోనే అగ్రస్థానంలోనిలిచి ప్లస్, ప్లస్ గుర్తింపు పొందనున్నది. సిరిసిల్ల శాసన సభ్యులు కేటీఆర్ మార్గదర్శకత్వంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి, అధికారులు ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎఫ్‌ఎస్‌టీపీ అందుబాటులోకి వస్తే తప్పకుండా సాధిస్తామని చెబుతున్నారు.

251
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles