మాయమాటలు నమ్మొద్దు

Tue,February 12, 2019 12:48 AM

-ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదు
-దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
-దేహదారుఢ్య పరీక్షలకు సాంకేతిక పరిజ్ఞానం
-ఎక్కడికక్కడ మఫ్టీలో విధులు
-నమస్తే ప్రత్యేక ఇంటర్వ్యూలోసీపీ కమలాసన్‌రెడ్డి
కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ:పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో (సివిల్, ఏఆర్, టీఎస్‌ఎప్‌పీ ఫైర్, కమ్యూనికేషన్స్, ఫింగర్ ఫ్రింట్) ట్రైనీ ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో ఎలాంటి పైరవీలకూ తావులేదని కరీంనగర్ పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒక్క హైజంప్ తప్ప ప్రతీ పరీక్షకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు. సూదిమొనంత కూడా తప్పు చేసే అవకాశం ఎవరి చేతిలోనూ లేదనీ, ఈ విషయాన్ని అభ్యర్థులంతా గుర్తించాలని సూచించారు. దేహదారుఢ్య పరీక్షల్లో పాస్ చేయిస్తామంటూ ఎవరైనా దళారులు మాయ మాటలు చెప్తే వాటిని నమ్మి మోసపోవద్దని సూచించారు. మోసకారుల ఆటకట్టించేందుకు అభ్యర్థుల్లోనే తమ స్పెషల్ బ్రాంచి పోలీసులున్నారని చెప్పిన సీపీ.. ప్రతి ఈవెంట్ వెంటవెంటనే ఆన్‌లైన్‌లోకి అప్‌లోడ్ అవుతుందన్నారు. సోమవారం నుంచి 25 రోజుల పాటు 25,182 మందికి జరిగే దేహదారుఢ్య పరీక్షలపై ఆయన సోమవారం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు.

నమస్తే : దేహదారుఢ్య పరీక్షలకు ఎంత మంది హాజరవుతున్నారు?
సీపీ: ఈ పరీక్షలకు మొత్తం 25,182 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు 25 రోజులపాటు కొనసాగుతాయి.
రోజుకు ఎంత మందికి పరీక్షలు నిర్వహించే ఆస్కారం ఉంది?
సోమవారం మొదటి రోజు కాబట్టి 600 మందికి దిగ్విజయంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాం. నేటి (మంగళవారం) నుంచి ప్రతిరోజు వెయ్యి మందికి నిర్వహిస్తాం. ఏ రోజు ఏ అభ్యర్థులకు పరీక్షలు ఉంటాయన్న సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులకు అందిస్తున్నాం. ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచే పరీక్షలు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఐదు గంటలకే సిటీ పోలీస్ శిక్షణ కేంద్రానికి రావాల్సి ఉంటుంది.

పరుగు పోటీలకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు?
పరుగు పోటీలను గతంలో స్టాఫ్‌వాచ్ సిస్టం ద్వారా పర్యవేక్షణ చేసేవాళ్లం. కానీ, మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ పరీక్షలకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్(ఆర్‌ఎఫ్‌ఐడీ)ని వినియోగిస్తున్నాం. ప్రతిఅభ్యర్థి జాకెట్‌లో ఆర్‌ఎఫ్‌ఐడీ సాంతికే పరిజ్ఞానంతో ఉన్న బిట్‌లు ఉంటాయి. గన్ షాట్‌ద్వారా పరుగు పందం ప్రారంభం కాగానే ఆ సౌండ్‌ను రికార్డు చేస్తాయి. తిరిగి గమ్యం చేరుకోగానే అక్కడ ఏర్పాటు చేసే సెన్సార్‌లో పరుగు రికార్డు అవుతుంది. ఇలా రికార్డు అయిన వెంటనే సదరు వివరాలు అన్‌లైన్‌లోకి అప్‌లోడ్ అవుతాయి. కాబట్టి ఎక్కడ కూడా మనుషులు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ చేయడానికి ఆస్కారం లేదు. ఆర్‌ఎఫ్‌ఐడీ జాకెట్లు సుమారు 600 వరకు ఉన్నాయి. అంటే ఏకకాలంలో ఆరు వందల మందికి మనం పరీక్షలు నిర్వహించవచ్చు. అలాగే ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూనే మరోవైపు శిక్షణ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇందులో ప్రతీ అంశం రికార్డు అవుతుంది. కాబట్టి ఎవరూ ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు.
దేహదారుఢ్య పరీక్షల్లో పాస్ చేయిస్తామంటూ కొంత మంది దళారులు రంగంలోకి దిగారన్న ప్రచారం వినిపిస్తున్నది? వీటిని అడ్డుకోడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

నా మొదటి విజ్ఞప్తి ఏంటంటే.. దేహదారుఢ్య పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడా ఆస్కారం లేదు. అభ్యర్థులు కష్టపడితేనే ఫలితం ఉంటుందన్న విషయాన్ని ముందుగా గుర్తించాలి. ఎవరైనా పాస్ చేయిస్తామని చెప్తే నమ్మి మోసపోవద్దు. ఈ విషయాన్ని అభ్యర్థుల తల్లిదండ్రులు కూడా గుర్తించాలి. అయితే పోలీస్ పరంగా దళారుల ఆట కట్టించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఉదాహరణకు అభ్యర్థుల్లో మా స్పెషల్ బ్రాంచి పోలీసులు కూడా ఉన్నారు. అలాగే మరికొన్ని పోలీసు బృందాలు కూడా మఫ్టీలో పనిచేస్తున్నాయి. పోలీస్ పరంగా మా వంతు ప్రయత్నం చేయడమే కాదు, నిష్పక్ష పాతంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఎవరైనా దళారులు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తే, సదరు సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. వక్రమార్గాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తే నమ్మి మోసపోవద్దని అభ్యర్థులందరిని కోరుతున్నా. అంతేకాదు, దళారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోక తప్పదు. అభ్యర్థులంతా శ్రమను నమ్ముకోవాలే తప్ప పైరవీలను కాదన్న విషయాన్ని మరోసారి చెబుతున్నాం.

385
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles