ఎన్నికలకు ఏర్పాట్లు


Thu,September 13, 2018 12:59 AM

-ఓటరు జాబితాలో తలమునకలు
- సిద్ధం చేస్తున్న అధికారులు
- ప్రస్తుత ఓటర్ల సంఖ్య 8,08,282
-ఈ నెల 25 వరకు ఓటరు నమోదు
-15,16 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు
- జిల్లాకు రానున్న కొత్త ఈవీఎంలు
- 1,142 పోలింగ్ కేంద్రాలు
- బీఎల్‌ఓలకు ముగిసిన శిక్షణ
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ముందస్తు ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. కొత్త ఓటర్ల నమోదు మొదలుకుని ఎన్నికల కేంద్రాల ఏర్పాటు, ఈవీఎంల భద్రత, సిబ్బందికి శిక్షణ వంటి విషయాలపై దృష్టి సారించారు. హుస్నాబాద్ మినహా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలైన కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్ ఎన్నికల పర్యవేక్షణ ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25 వరకు కొత్త ఓటర్ల నమోదుకు ముసాయిదా కూడా విడుదల చేశారు. కాగా బుధవారం బూత్ లెవల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు.

25 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం
జిల్లాలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలో ఇప్పటికే ఓటరు నమోదు ముసాయిదాను ప్రకటించారు. ఈ నెల 10 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 25వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. వచ్చే నెల 8న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) ఆయా బూత్‌ల పరిధిలో అందుబాటులో ఉంటున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు రోజులు జిల్లాలోని 1,142 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో ఉండి కొత్త ఓటర్ల పేరు నమోదుకు ఫాం-6 ద్వారా దరఖాస్తు స్వీకరిస్తారు. ఓటరు జాబితాను కూడా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. ఓటరు జాబితాను పరిశీలించి ఒకవేళ పేరు నమోదు కాకుంటే అప్పటికప్పుడు బీఎల్‌ఓలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్‌లో కూడా పరిశీలించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రతి స్మార్ట్ ఫోన్‌లో ఈ సదుపాయం ఉన్నదని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ చెబుతున్నారు. ఆధార్ కార్డుతో లింక్ చేసే ప్రసక్తే లేదని కలెక్టర్ చెబుతున్నారు. గతంలో ఆధార్ లింక్ చేసినప్పుడు పొరపాటున గల్లంతైన ఓట్లు ఉంటే ఈ నెల 25 వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.

కొత్త ఓటర్ల నమోదుకు..
కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2018 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చు. మీ సేవ, ఆన్‌లైన్, మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. ఫొటోతో పాటు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాన్ని ఫారం-6కు జత చేసి ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. ఇక పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు మొదలుకొని వీఆర్‌ఓలు, గిర్దావార్లు, తహసీల్దార్లకు కూడా కొత్త ఓటు హక్కు కోసం, తప్పిపోయిన ఓట్ల పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఓటరు జాబితాను పరిశీలించేందుకు ప్రతి 10 మంది బీఎల్‌ఓల పరిధిలో ఒక సూపర్‌వైజర్‌ను నియమించారు. వీరు కాకుండా 50 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ఈ బృందాలు ఇంటింటికీ తిరిగి అర్హులైన ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాయి. ఇంటిలో తప్పిపోయిన ఓటర్లను గుర్తించి పునరుద్ధరిస్తాయి.

అక్టోబర్ 8న తుది ఓటరు జాబితా
జిల్లాలో ప్రస్తుతం 4,06,829 మంది పురుషులు, 4,01,420 మంది మహిళలు, 34 మంది ఇతర ఓటర్ల చొప్పున మొత్తం 8,08,282 ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే కరీంనగర్‌లో 1,15,066 మంది పురుషులు, 1,11,598 మంది మహిళలు, 23 మంది ఇతరుల చొప్పున మొత్తం 2,26,687 ఓట్లు, చొప్పదండిలో 99,456 మంది పురుషులు, 1,00,810 మంది మహిళలు, ఇద్దరు ఇతరుల చొప్పున మొత్తం 2,00,268 మంది ఓటర్లు, మానకొండూర్‌లో 94,929 మంది పురుషులు, 94,022 మంది మహిళలు మొత్తం 1,88,951 మంది ఓటర్లు, హుజూరాబాద్‌లో 97,377 మంది పురుషులు, 94,990 మంది మహిళలు, 9 మంది ఇతరుల చొప్పున మొత్తం 1,92,376 ఓట్లు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో కొన్ని ఓట్లు గల్లంతు, కొత్త ఓటర్ల నమోదు తర్వాత ఈ ఓటర్ల సంఖ్య పెరగనుంది. ఇప్పటికే ఓటరు జాబితా ముసాయిదా అమలు ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 25వ తేదీ వరకు కొత్త ఓటర్ల నుంచి దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈనెల 15, 16 తేదీల్లో గ్రామసభల్లో ఓటరు జాబితా చదివి వినిపించి కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. వచ్చే నెల 4న కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాలు ప్రదర్శిస్తారు. 7న అనుబంధ ఓటరు జాబితాను ముద్రిస్తారు. 8న ప్రకటిస్తారు.

బూత్ లెవల్ అధికారులకు శిక్షణ
తప్పులు లేని ఓటరు జాబితాను తయారు చేసేందుకు బూత్ లెవల్ అధికారులకు బుధవారం శిక్షణ ఇచ్చారు. మరణించిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్ల పేర్లు తొలగించడం, కొత్త ఓటర్లు, గల్లంతైన ఓటర్లను నమోదు చేయడం ఎలాగో శిక్షణలో వివరించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జేసీ శ్యాంలాల్ ప్రసాద్, డీఆర్‌ఓ భిక్షునాయక్‌లు బీఎల్‌ఓలకు వివరించారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్‌లకు సంబంధించి 1,142 మంది బీఎల్‌ఓలకు ఆయా నియోజకవర్గాల్లో ఒక రోజు శిక్షణ పూర్తి చేశారు. కాగా జిల్లాకు అవసరమైన ఈవీఎం మిషన్లను కూడా తెప్పిస్తున్నారు. జిల్లా స్టోరేజ్‌లో ఉన్న 2,400 పాత ఈవీఎంలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. జిల్లాకు అవసరమైన 1,500 బ్యాలెట్ యూనిట్లు, 1,600 కంట్రోల్ యూనిట్లను తెప్పిస్తున్నారు. వీటికి తోడు వేసిన ఓటు పడిందా లేదా, తాము వేసిన అభ్యర్థికే ఓటు పడిందా, ఇతరులకు పడిందా పరిశీలించుకునేందుకు ఈసారి ఓట్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)లను వినియోగిస్తున్నారు. 1,400 వరకు వీటిని జిల్లాకు తెప్పిస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు బెంగళూర్ నుంచి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...