కొండంత విషాదం


Wed,September 12, 2018 03:15 AM

-కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
-బ్రేకులు ఫెయిలై అదుపుతప్పి బోల్తాకొట్టిన ఆర్టీసీ బస్సు
-డ్రైవర్ సహా 58 మంది మృత్యువాత
-మరో 42 మందికి తీవ్రగాయాలు.. చికిత్స
-ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
జగిత్యాల, నమస్తే తెలంగాణ/జగిత్యాల క్రైం/మల్యాల/కొడిమ్యాల/జగిత్యాల అర్బన్/జగిత్యాల కలెక్టరేట్/ జగిత్యాల లీగల్:జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఘాట్ రోడ్డుపై మృత్యుఘోష మోగింది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 28జడ్ 2319), కొడిమ్యాల మండలం శనివారం పేట నుంచి మంగళవారం ఉదయం 10.30గంటలకు బయలు దేరి జేఎన్‌టీయూ క్యాంపస్ మీదుగా కొండగట్టు దేవస్థానం చేరుకున్నది. అక్కడి నుంచి డ్రైవర్, కండక్టర్‌తో కలిపి 100మందితో ఘాట్ రోడ్డు మీదుగా కొండ దిగుతుండగా, బ్రేకులు ఫెయిలైంది. అదుపులోకి తీసుకొచ్చేందుకు డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చిట్టచివరి మూల మలుపు వద్దకు రాగానే ఎదురుగా ఉన్న ఆటోను తాకి నేరుగా లోయలోకి వెళ్లి పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా 57 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. అక్కడికక్కడే 25మంది, చికిత్స పొందుతూ 32 మంది ప్రా ణాలు కోల్పోయారు. మృతుల్లో 30మంది మహిళలు, 23మంది పురుషులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో 43మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు లోయలోపడి భారీ శబ్ధం రావడంతో స్థానికులు వెంటనే వచ్చి క్షతగాత్రులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ఐదు నిమిషాల్లోపే మల్యాల పోలీసులు వచ్చి, ప్రమాద తీవ్రత ఎక్కువ ఉందని భావించి అంబులెన్సులను పిలిపించి, క్షతగాత్రులను తరలించే ప్రయత్నం చేయడంతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూ శర్మ, జగిత్యాల ఆర్డీఓ ఘంటా నరేందర్, జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను జగిత్యాల వైద్యశాలకు పలు 108 అంబులెన్సులు, పోలీస్ వాహనాలు, ప్రైవేట్ జీపులు, ప్రైవేట్ అంబులెన్సులు, టాటా ఎసీలు, ట్రక్కుల్లో తరలించారు. గాయపడినవారిని జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ దవాఖానలకు తరలించారు. రాత్రి వరకు మృతుల సంఖ్య 57కు చేరుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇది ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదమని అధికారులు చెబుతున్నారు. గతంలో ఓ సారి జరిగిన ప్రమాదంలో 26మంది , ఇప్పుడు 58 మంది చనిపోవడం బాధాకరమని ఈడీ సునిల్ ఆవేదన చెందారు.

రూటు మార్చడం వల్లే ప్రమాదం..
ఈ బస్సు జగిత్యాల, ధరూర్, రాజారాం, మల్యాల ఎక్స్ రోడ్డు, కొండగట్టు దిగువన బస్టాండ్, దొంగలమర్రి పోలీస్ చెక్‌పోస్టు, నాచుపెల్లి, జేఎన్‌టీయూ కళాశాల, డబ్బు తిమ్మాయ్యపల్లె, రాంసాగర్, హిమ్మత్‌రావుపేట, తిర్మలాపూర్, శనివారంపేటకు రోజూ వెళ్తుంది. తిరిగి ఆదే మార్గంలో జగిత్యాలకు చేరుకుంటుంది. కానీ, వేములవాడ డిపోకు చెందిన కొన్ని ఆర్టీసీ బస్సులు కొండగట్టు గుట్టపైకి భక్తుల కోసం వెళ్తూ, ఘాట్ రోడ్డు ద్వారా జగిత్యాలకు రాకపోకలు సాగిస్తున్నాయనీ, జగిత్యాల డిపో మేనేజర్ హన్మంతరావు కూడా శనివారం పేట బస్సును దేవస్థానంలో రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో జేఎన్‌టీయూ కళాశాల నుంచి తిరుగు ప్రయాణంలో కొండగట్టు దేవస్థానం మీదుగా, ఘాట్ రోడ్డు ద్వారా జగిత్యాలకు వారం రోజులుగా నడిపిస్తున్నారు. ఆర్టీసీ బస్సు రూటు మార్చడం, ఆయా గ్రామాల్లో ప్రయాణికులు ఎక్కువ మంది ఎక్కడం, దాదాపు 100మందితో నిండిపోవడం వల్లే బస్సు అదుపు తప్పి ప్రమాదం సంభవించిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

బస్సులోనే చిక్కుకొని.. డ్రైవర్
ప్రమాద విషయం తెలిసి కొండగట్టు ఆలయ ఉద్యోగులు, మండల రెవెన్యూ ఉద్యోగులు, పోలీసు శాఖ సిబ్బంది చేరుకొని స్థానికులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మల్యాల, కొడిమ్యాల ఎస్‌ఐలు మిథున్ కుమార్, సతీశ్ బస్సుల్లో చిక్కుక్కున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ప్రయాణికులంతా కొడిమ్యాల మండలం హిమ్మత్‌రావుపేట, రాంసాగర్, డబ్బు తిమ్మాయపల్లె, శనివారంపేట, కోనాపూర్ గ్రామాల వారని తెలిసి వెంటనే తిర్మలాపూర్ సహకార సంఘం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రయాణికులందరినీ తీసిన తర్వాత డ్రైవర్ శ్రీనివాస్ బస్సులోనే చిక్కుకోవడంతో అతడిని తీసేందుకు రాడ్లను ఉపయోగించి, బయటకు తీసి చికిత్స కోసం జగిత్యాలకు తరలించగా పరిస్థితి విషమించి చనిపోయాడు. కాగా, అతడు మరో నెలలో రిటైర్డ్ కావాల్సి ఉందని తెలిసింది.

కారణాలపై పోలీస్ శాఖ ఆరా..ప్రమాదానికి కారణాలపై పోలీస్, రవాణా శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి ఎం కిషన్ రావు, ఏఎంవీఐ అభిలాష్ ఘటనా స్థలానికి చేరుకొని, బస్సును పరిశీలించారు. రోడ్డు నుంచి 30 ఫీట్ల లోతులో ఉన్న లోయలో పడడంతో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ సమయంలోనే కలెక్టర్ శరత్ వచ్చి బస్సులో ఉన్న విలువైన వస్తువులను సీజ్ చేయాలని రవాణా శాఖ అధికారి కిషన్‌రావును ఆదేశించారు. సంఘటనా స్థలానికి మల్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల రూరల్ సీఐలు నాగేందర్ గౌడ్, సతీశ్ చందర్ రావు, రవి కుమార్, రాజేశ్, ఉమ్మడి జిల్లా ఎస్‌ఐలు, సీఐలు చేరుకొని కారణాలను వివిధ కోణాల్లో పరిశీలించారు.

ఘటనా స్థలంలో మంత్రులు..
ఘటనా స్థలాన్ని మంత్రులు కేటీఆర్, పట్నం మహేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, బొడిగ శోభ, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీఐజీ ప్రమోద్, కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి, జగిత్యాల టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్ కుమార్, టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవి శంకర్, కాంగ్రెస్ నాయకులు కట్కం మృత్యుంజయం, మేడిపల్లి సత్యం, ఆర్టీసీ ఎండీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ రవాణ శాఖ సునీల్ శర్మ, ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ కొమురయ్య, చీఫ్ మెకానికల్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, కరీంనగర్ రీజినల్ మేనేజర్ జీవన్ సాగర్, జాయింట్ డైరెక్టర్ విజిలెన్స్ డైరెక్టర్ రాంచందర్ రావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద కారణాలు అడిగి తెలుసుకున్నారు.

కన్నీరు పెట్టిన కొడిమ్యాల..
ప్రమాదంలో కొడిమ్యాల మండలంలోని ఆరు గ్రామాలకు చెందిన సుమారు 55మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీంతో మండలం కన్నీటి పర్యంతమైంది. తిర్మలాపూర్, శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్, డబ్బుతిమ్మాయపల్లి, కోనాపూర్‌కు మృతదేహాలను తీసుకురాగా బంధువులు గుండెలు బాదుకున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు రోదనల్లో మునిగిపోవడంతో ఎవరిని ఓదార్చాలో తెలియని అయోమయస్థితిలో పడ్డారు. కొంతమంది స్పృహ తప్పి పడిపోవడంతో భయాందోళనకు లోనయ్యారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన బంధువులతో గ్రామాల్లో రోదనలు మిన్నంటాయి. ఎటు చూసినా విషాద ఛాయలే కనిపించాయి.

195
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...