ఓటరుగా నమోదు చేసుకోవాలి

Wed,September 12, 2018 03:09 AM

- ఈ నెల 15,16 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు
- ఈ నెల 25 వరకు అవకాశం
- కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తున్నందునా ఎన్నికల సంఘం ప్రత్యేక ముసాయిదా విడుదల చేసిందని, దీని ప్రకారం ఈ నెల 10 నుంచి 25 వరకు అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2018 జనవరి 1 వరకు 18 ఏండ్లు నిండిన వారు, ఓటరు జాబితాలో పేర్లు గల్లంతైన వారు ఫాం-6 ద్వారా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ ఫాం పూరించి, ఒక ఫొటోను సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్లకుగానీ, వీఆర్‌ఓలు, ఆర్‌ఐలు, తహసీల్దార్లకు ఇవ్వవచ్చని, లేదంటే ఆన్‌లైన్‌లో, మీ సేవ కేంద్రాల్లో, మోబైల్ యాప్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని వివరించారు. జిల్లాలో ఉన్న 1,142 పోలింగ్ బూత్‌లకు ఒక్కో బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్‌ఓ)ను నియమించామని, వీరంతా ఈ నెల 25 వరకు సంబంధిత ఏరియాలో అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి బూత్ స్థాయిలో ప్రత్యేకంగా పరిశీలించేందుకు జిల్లాలో 50 బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా కరీంనగర్ లాంటి పెద్ద నియోజకవర్గాల్లో ఈ నెల 14 నుంచి ఈ బృందాలు ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదును పరిశీలిస్తాయని కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు nvsp.in (నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్)లో పరిశీలించుకోవచ్చని తెలిపారు.

వీఆర్‌ఓ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 16న నిర్వహించే వీఆర్‌ఓ ఉద్యోగ నియామక పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. మొత్తం 70,907 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటికే వీరిలో 50 శాతానికి పైగా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. ఏవైనా కారణాలతో హాల్ టికెట్ల డౌన్‌లోడ్ విషయంలో ఇబ్బందులు ఎదురైతే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ 0878 2234731 నంబర్‌కు ఫోన్ చేయాలని అభ్యర్థులకు సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ పరీక్షకు అభ్యర్థులంతా ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. వివాహితులైన మహిళలకు మంగళ సూత్రం మినహా ఇతర ఆభరణాలు అనుమతించమని చెప్పారు. సెల్‌ఫోన్లు, వాచ్‌లు, చివరికి షూ (బూట్లు) వేసుకుని వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేసీ శ్యాంప్రసాద్ లాల్ , డీఆర్‌ఓ బిక్షానాయక్ తదితరులు పాల్గొన్నారు.

198
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles