ప్రజా ఆశీర్వాదమే ఎనలేని బలం


Sun,September 9, 2018 01:32 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: ప్రజల ఆశీర్వాదమే తనకు ఎనలేని బలమని, మరోసారి అండగా నిలిచి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపుతామని తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినందుకు శనివారం స్థానిక నేత బజార్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కృతజ్ఞతాభినందన సభ నిర్వహించారు. గంగుల కమలాకర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడం ప్రజాప్రతినిధుల బాధ్యతని, అదే విధంగా తాను ఇప్పటి వరకు పని చేశానని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో పాలకులు ఏ రోజు కూడా ప్రజల కోసం పనిచేయలేదని, సొంత లాభం చూసుకున్నారని ఆరోపించారు. పద్మశాలిలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నేత బజార్ అభివృద్ధి కోసం రూ.1.20 కోట్లు, పద్మశాలి హాస్టల్‌కు రూ. 75 లక్షలు, పోశమ్మవాడ భవన రీడింగ్ రూమ్ అభివృద్ధికి రూ.25 లక్షలు కేటాయించిందని గుర్తు చేశారు.

కరీంనగర్‌లో ఏ నాయకుడు కూడా రెండో సారి గెలువలేదని, కానీ ప్రజలు తనను ఆశీర్వదించి రెండు సార్లు గెలిపించారని, మూడోసారి గెలిపిస్తే నగరాన్ని సర్వాంగ సుందరంగా ఆధునీకరిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ హయాంలో వందల కోట్ల నిధులు తీసుకువచ్చి నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామన్నారు. ప్రజా సేవలో రాజకీయాల్లోకి వచ్చిన తాను ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటున్నానని చెప్పారు. తనను మూడోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు బలహీన వర్గాల సంక్షేమాన్ని బాధ్యతగా తీసుకుని పని చేస్తానని పేర్కొన్నారు. అన్ని కులాల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. అందరం కలిసి కరీంనగర్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రవీందర్‌సింగ్, ఎంపీపీ వాసాల రమేశ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, పద్మశాలి సంక్షేమ ట్రస్టు అధ్యక్షుడు దూడం లక్ష్మిరాజం, నాయకులు మల్లేశం, స్వర్గం మల్లేశం, మెతుకు సత్యం, కస్తూరి సుజాత, పోలు సత్యనారాయణ, దూడం శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ఎలగందుల సత్యనారాయణ, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

173
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...