దైవ దర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు..

Sun,September 9, 2018 01:29 AM

మానకొండూర్ రూరల్: దైవ దర్శనం చేసుకొని సంతోషంగా స్వగ్రామానికి బయలుదేరిన ఓ కుటుంబంలో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. ఆటో ఢీకొని తీవ్ర గాయాలతో ఓ మహిళ దుర్మరణం చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి పెట్రోల్ బంకుకు సమీపంలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలు.. వరంగల్ జిల్లా ఖాజీపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పల్లెపు భిక్షపతి, భాగ్యలక్ష్మి దంపతులు. కూతురు చందన, అల్లుడు లవకుమార్‌తో కలిసి ప్యాసెంజర్ ఆటో(ఏపీ36 టీబీ 1991)లో వేములవాడకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. గట్టుదుద్దెనపల్లి వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా (కరీంనగర్ వైపు వెళ్తూ) వచ్చిన ట్రాలీ ఆటో బలంగా ఢీకొన్నది. ప్యాసెంజర్ ఆటో పూర్తిగా దెబ్బతినగా.. అందులో ప్రయాణిస్తున్న భాగ్యలక్ష్మి (45) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. తల పగిలి మెదడు బయటపడటం ప్రమాద తీవ్రతకు అద్దంపట్టింది. చందన, లవకుమార్, భిక్షపతిలకు గాయాలయ్యాయి. ఘటన స్థలానికి సీఐ ఇంద్రసేనారెడ్డి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ దవాఖానకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

213
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles