జీవభాషలో రాసేదే మంచి కవిత్వం

Sun,September 9, 2018 01:28 AM

కరీంనగర్ కల్చరల్: జీవభాషలో రాసేదే మంచి కవిత్వమనీ, బడి పలుకుల భాషకన్నా, ఇంటి పలుకు బడుల్లో ఎంతో ఆత్మీయత నిండి ఉంటుందని నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఫిలింభవన్‌లో తెలంగాణ రచయితల సంఘం, కరీంనగర్ పక్షాన నిర్వహించిన కాళోజీ సాహిత్య పురస్కార ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. యువత నిరంతరం పుస్తకాల్ని అధ్యయనం చేస్తూ, సాహిత్య సృజన పట్ల శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం కాళోజీ పురస్కారాన్ని వనపట్ల సుబ్బయ్యకు ప్రదానం చేశారు. సభాధ్యక్షత వహించిన తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ భాషలో సజీవ కవిత్వాన్ని రచిస్తూ, స్ఫూర్తిగా నిలుస్తున్న వనపట్లకు పురస్కారమివ్వడం గర్వంగా ఉందన్నారు. ప్రధాన కార్యదర్శి కొత్త అనిల్ మాట్లాడుతూ.. తెరసం ఆధ్వర్యంలో బాలల, హరిత, స్త్రీ కవి సమ్మేళనాలు, సాహిత్య పాఠశాలల్ని నెలనెలా సాహితీ వికాస సృజన కోసం నిర్వహిస్తున్నామన్నారు.

ఆత్మీయ అతిథులుగా హాజరైన దాస్యం సేనాధిపతి, వేణుశ్రీ మాట్లాడుతూ.. తెలంగాణ జీవ చైతన్యంతో ఉత్తమ కవిత్వాన్ని సృజించిన వనపట్ల సుబ్బయ్య పేదల కష్టాలకు చలించి అనేక కవితా సంపుటాల్ని రచించడం అభినందనీయమన్నారు. గుర్రాల మాధవ్.. వనపట్ల కవిత్వ సమీక్ష నిర్వహించగా, బొమ్మకంటి కిషన్ మాట్లాడారు. కాళోజీ అవార్డు గ్రహీత వనపట్ల సుబ్బయ్య మాట్లాడుతూ.. కరీంనగర్ కవులకు, కళాకారులకు పుట్టినిల్లని, ఇలాంటి సాహిత్య క్షేత్రం సదా స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజుల రవీందర్ కీలకోపన్యాసం చేస్తూ కాళోజీ వ్యక్తిత్వాన్ని, కవిత్వాన్ని విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో సినీ విమర్శకులు, కవులు, రచయితలు వారాల ఆనంద్, ఇస్రత్ సుల్తానా, ప్రేమ్‌సాగర్‌రావు, మెరుగు ప్రవీణ్, స్తంభంకాడ గంగాధర్, దొమ్మాటి శంకర్, హరిప్రసాద్, డాక్టర్ బీవీఎన్ స్వామి, నమిలికొండ జయంత్‌శర్మ, ఓదెలు కుమార్, డాక్టర్ వరప్రసాద్, సత్యంరాజు, కేఎస్ అనంతాచార్య, సురేశ్, సౌందర్య, రాజు, నవీన్, నసీరుద్దీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

136
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles