స్వచ్ఛ ఉల్లంఘనలకు ఈ-చలాన్


Sun,November 17, 2019 03:17 AM

-దేశంలోనే మొదటి కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ
-బాధ్యతాయుతమైన మార్పు తేవడమే లక్ష్యం
-పబ్‌లు, బార్‌లు, స్కూళ్లు, దవాఖానలకు నోటీసులు
-అగ్ని ప్రమాద నివారణ వ్యవస్థ తప్పనిసరి -మేయర్ బొంతు రామ్మోహన్


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ
నగరంలో నిబంధనలకు విరుద్ధ్ధంగా భవన నిర్మాణ వ్యర్థాల పారవేత, చెత్తను రోడ్డుపై వేయడం, అక్రమంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం తదితర స్వచ్ఛ ఉల్లంఘనలకు ఈ-చలాన్ ద్వారా జరిమానాలు విధించే మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ నిలిచింది. అధికారులు, సిబ్బంది నేరుగా ప్రమేయంలేకుండా కేవలం నిబంధనలు, అతిక్రమణల ప్రాతిపదికన ఆటోమేటిక్‌గా ఈ-చలాన్‌లను జనరేట్ చేయడం ద్వారా జీహెచ్‌ఎంసీ సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దేశంలోనే సాంకేతిక విధానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే కార్పొరేషన్‌గా ఘనత సాధించిందని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ బుద్ధభవన్‌లోని జీహెచ్‌ఎంసీ ఈవీడీం కార్యాలయంలో డైరెక్టర్ విశ్వజీత్ కంపాటితో కలిసి మేయర్ శనివారం విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ద్వారా నగరంలోని వివిధ విభాగాల్లో చేసిన ఉల్లంఘనలకు గాను ఇప్పటివరకు 1084మందికి రూ. 1.50కోట్లమేర జరిమానాలు విధించినట్లు తెలిపారు. ఇందులో రూ. 18.5లక్షలు బ్యాంకుల ద్వారా స్వచ్ఛందంగా చెల్లించారని పేర్కొన్నారు.

నగరంలో జరిగే ఉల్లంఘనలకు సంబంధించి జరిమనాలు వేసేందుకు జీహెచ్‌ఎంసీకి చెందిన 24విభాగాలు కేవలం ఫొటో, వీడియో తీసి అప్‌లోడ్ చేస్తాయని, దీంతో ఆయా ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానా నమోదవుతుందని తెలిపారు. జనరేట్ అయ్యే ప్రతి చలాన్‌కు క్యూ ఆర్ కోడ్ ఉంటుందన్నారు. ఈ విధానం ద్వారా చలాన్ల విధింపులో ఏ విధమైన అవకతవకలకు, అవినీతికి ఆస్కారంలేదని మేయర్ తెలిపారు. అంతేకాకుండా ఒక్కసారి ఈ-చలాన్ జనరేట్ అయితే దాన్ని మార్చేందుకు అవకాశంలేదని, తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటివరకు కేవలం ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు మాత్రమే ఈ విధానంలో చలాన్‌లు వసూలుచేస్తుండగా, వచ్చే జనవరి నుంచి జీహెచ్‌ఎంసీకి చెందిన అన్ని విభాగాల అధికారులకు ట్యాబ్‌లను అందించి జరిమానాలు విధించే అధికారం కల్పిస్తున్నామన్నారు. నగరవాసులపై జరిమానాల భారం మోపాలన్న ఉద్దేశం తమకు లేదని, బాధ్యతాయుతమైన మార్పును తేవడమే లక్ష్యమని స్పష్టంచేశారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చిచూస్తే హైదరాబాద్‌లో జరిమానాలు అతితక్కువగా ఉన్నట్లు తెలిపారు. అగ్నిప్రమాద నివారణ పరికరాలను ఏర్పాటుచేయాలని కోరుతూ పబ్‌లు, బార్‌లు, స్కూళ్లు, దవాఖానలు, కోచింగ్ సెంటర్లు తదితరవాటికి నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు ఈనెల 20నుంచి 29వ తేదీవరకు భవన నిర్మాణ వ్యర్థాల ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డెబ్రిస్ డ్రైవ్ ముగిసిన అనంతరం వివిధ స్వచ్ఛ ఉల్లంఘనలపై మరింత కఠినంగా వ్యవహరించాలని, జరిమానాలు విధించాలని నిర్ణయించినట్లు మేయర్ వివరించారు.

283

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles