నీటి దోపిడీకి చెక్..!


Mon,October 14, 2019 01:14 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రతి నీటి బొట్టును లెక్కించేందుకు జలమండలి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన నల్లాలకు ఆర్‌ఎఫ్‌ఐడీ విధానం సత్ఫలితాలను రాబట్టింది. జూబ్లీహిల్స్ సెక్షన్ పరిధిలోని కావూరి హిల్స్, ప్రశాసన్‌నగర్, ఆదర్శ్‌నగర్‌లోని నల్లాలకు ఏఎంఆర్ మీటర్లను(ఆటోమేటెడ్ మీటర్ రీడింగ్/నీటి వాడకానికి తగ్గట్టుగా బిల్లు జారీ) బిగించారు. ఈ ఏఎంఆర్ మీటర్లకు ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ద్వారా ఆన్‌లైన్‌లో నిరంతర పర్యవేక్షణ జరిపారు. తొమ్మిది నెలల పాటు ఏఎంఆర్ మీటర్ల పనితీరుపై అధ్యయనం చేసి, నీటి దోపిడీకి చెక్ పెట్టడంతో పాటు పక్కాగా నీటి లెక్కింపుతో గణనీయంగా 15 శాతం ఆదాయాన్ని పెంచుకున్నారు. ఈ విధానంతో నీటి బిల్లుల జారీ, మీటర్ల లోపాలు గుర్తించడంతో నీటి వృథాను అరికట్టవచ్చన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ విధానం సక్సెస్ కావడంతో మున్ముందు కమర్షియల్ నల్లాలన్నింటికీ ఆర్‌ఎఫ్‌ఐడీ విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.


ఆర్‌ఎఫ్‌ఐడీ ప్రత్యేకత..
ప్రస్తుతం నల్లా కనెక్షన్లకు మెకానికల్ మీటర్లు ఉండగా, ఇందులో ట్యాంపరింగ్‌కు పాల్పడి రీడింగ్‌లో తేడాలు చూపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా బల్క్ సైప్లె, భారీ అపార్ట్‌మెంట్ల నీటి కనెక్షన్లలో ఎక్కువగా ఈ తరహా నీటి దోపిడీకి మీటర్ రీడర్లు తెరలేపుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. అయితే ఆర్‌ఎఫ్‌ఐడీ మీటర్లు నిత్యం ఆన్‌లైన్ పర్యవేక్షణలో పనిచేస్తాయి. ఇందులో ప్రత్యేకంగా చిప్‌ను అమర్చి యాంటెన్నా ద్వారా రీడింగ్ సులువుగా గుర్తించవచ్చు. మీటర్ రీడింగ్ సమయంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఈ సిస్టం పనిచేస్తుంది. తద్వారా వినియోగదారులకు నీటి వాడకానికి తగ్గట్టుగా బిల్లులు ఇచ్చేసి ఆదాయాన్ని పటిష్టం చేసుకోవడంతోపాటు నీటికి పక్కాగా లెక్క ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

248

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles