ప్రభుత్వ స్థలాల్లో డబుల్ ఇండ్లు నిర్మిస్తాం


Thu,September 19, 2019 03:27 AM

-జీహెచ్‌ఎంసీలో సమీక్షా సమావేశాలను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్
-అంబర్‌పేట నియోజకవర్గ సమీక్షకు హాజరైన జీహెచ్‌ఎంసీ, జలమండలి, రెవెన్యూ శాఖల అధికారులు
-నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ


హైదరాబాద్, నమస్తే తెలంగాణ : అంబర్‌పేట నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్ని గుర్తిస్తే వెంటనే డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాల్ని మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదట అంబర్‌పేట నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి అసెంబ్లీలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని మంత్రులు చర్చించారు. పారిశుధ్యం, నీటి సరఫరా, అంబర్‌పేట ైఫ్లెఓవర్ పనులు, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకున్న అవకాశాలపై వివరాలను అధికారులు అందించారు. అంబర్ పేట ఫ్లైఓవర్ పనుల ప్రారంభానికి అవసరమైన భూసేకరణ దాదాపుగా పూర్తయిందని టౌన్ ప్లానింగ్ అధికారులు మంత్రులకు తెలియజేశారు. రానున్న మూడు వారాల్లో భూసేకరణ పూర్తయిన ప్రాంతాన్ని నేషనల్ హైవే అధికారులకు అప్పగిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అంబర్‌పేటలో డబుల్ బెడ్‌రూంల నిర్మాణాలకు అవకాశమున్న పలు ప్రాంతాలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఈ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణానికి గల పరిస్థితులపైన వారం రోజుల్లో నివేదికను అందజేయాలని స్థానిక తహసీల్దార్‌ను మంత్రులు ఆదేశించారు.

మూసీ శుభ్రత గురించి ప్రత్యేక చర్చ..
నియోజకవర్గ పరిధిలో సరిపోయేంత తాగునీటి సరఫరా జరుగుతున్నదని జలమండలి అధికారులు మంత్రులకు తెలిపారు. ప్రతి రోజు దాదాపు పదకొండు ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఎక్కడైనా సమస్యలున్న ప్రాంతాలుంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రులు జలమండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మూసీలో కలిసే మురుగు నీటి నాలాలు శుభ్రం చేస్తున్న తీరుపైన, అంబర్‌పేట ట్రీట్‌మెంట్ ప్లాంటు గురించి జలమండలి అధికారులతో మంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పారిశుధ్యం ప్రస్తుతం బాగా జరుగుతున్నదని, మరికొంత మంది సిబ్బందిని అదనంగా కేటాయించాలని కోరారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ మే యర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

230

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles