సమృద్ధిగా తాగునీరు.. సిటీకి ఢోకా లేదు

Thu,July 18, 2019 03:34 AM

- ఏడాది పొడవునా గోదావరి జలాల తరలింపు
- నాగార్జున సాగర్‌లో ఐదేండ్లకు సరిపడా నిల్వలు
- భవిష్యత్‌కు కేశవాపూర్‌తో ఎంతో ఉపయోగం
- రూ. 4,725 కోట్లతో ఔటర్ చుట్టూ రింగ్ మెయిన్ ప్రాజెక్టు
- జలమండలి ఎండీ దానకిశోర్ వెల్లడి


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరవాసులు తాగునీటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాభావ పరిస్థితులు ఉన్నా.. సమృద్ధిగా నీరందిస్తామని జలమండలి ఎండీ దానకిశోర్ స్పష్టం చేశారు. నాగార్జునసాగర్‌లో ఐదేండ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. బుధవారం ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కేశవాపూర్ రిజర్వాయర్ ఎంతో ఉపయోగమంటూ.. శామీర్‌పేట వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నామని, ప్రస్తుతం భూ సేకరణ జరుగుతున్నదన్నారు. 158 కిలోమీటర్ల ఔటర్ చుట్టూ సుమారు రూ.4,725 కోట్లతో రింగ్ మెయిన్ పైపులైన్, 12 మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అలాగే రూ. 580 కోట్లతో ఔటర్ ఫేజ్-2 తాగునీటి పథకానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం నుంచి ఇటీవల అనుమతులు తీసుకున్నామని ఎండీ పేర్కొన్నారు.

గ్రేటర్‌లో తాగునీటికి ఎలాంటి ఢోకా లేదని జలమండలి ఎండీ దానకిశోర్ స్పష్టం చేశారు. సంస్థ పరిధిలో 9. 8 లక్షల వినియోగదారులకు సమృద్ధిగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. ప్రతి రోజూ 460 ఎంజీడీల (మిలియన్ గ్యాలన్ ఫర్ డే )నీటి సరఫరాలో కృష్ణా, గోదావరిల ద్వారా 442 ఎంజీడీలను తరలిస్తున్నామన్నారు. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా మూడు దశల ద్వారా 270 ఎంజీడీలను అత్యవసర పంపింగ్ ద్వారా తరలిస్తున్నామని, ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 120 టీఎంసీల మేర ఉందని, డేడ్‌స్టోరేజీ వరకు ఈ నీటిని వచ్చే ఐదేండ్ల వరకు తరలించవచ్చని ఎండీ వివరించారు. గోదావరి నీటి తరలింపులో భాగంగా ఎల్లంపల్లి ద్వారా నగరానికి 172 ఎంజీడీల మేర నీరు వస్తుందని, 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎల్లంపల్లి ద్వారా గ్రేటర్‌కు సంవత్సరం పొడవునా నీటి సరఫరా చేయొచ్చని ఎండీ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో వచ్చే ఆగస్టు నుంచి ఎల్లంపల్లికి గోదావరి నీరు రానుందని, దీంతో భవిష్యత్‌లో గోదావరి నీటి తరలింపులో అత్యావసర పంపింగ్ అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం దొరికినట్లయిందని చెప్పారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల ద్వారా రోజూ 18 ఎంజీడీల నీటిని తరలిస్తున్నామని, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఈ జంట జలాశయాల నీరు అండుగంటిపోవడం వల్ల అత్యావసర పంపింగ్‌నకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. బుధవారం ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండీ దానకిశోర్ నీటి సరఫరా స్థితిగతులను వివరించారు. హైదరాబాద్ తాగునీటిపై వస్తున్న అపోహలను ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా సూచించారు.

త్వరలోనే రూ. 580కోట్లతో ఔటర్ ఫేజ్-2 పథకం
జలమండలి పరిధి ఔటర్ వరకు విస్తరించడంతో ఔటర్‌లోని 190 గ్రామాలకు సమృద్ధిగా నీరందించే ఉద్దేశంతో 164 రిజర్వాయర్లు, పైపులైన్ నిర్మాణం చేపట్టామన్నారు. రెండేండ్లలో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టును ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని ఎండీ దానకిశోర్ చెప్పారు. వచ్చే డిసెంబర్ నిర్దేశిత గడువుకు ముందే వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల నుంచి డిమాండ్‌ల దృష్ట్యా రూ. 580 కోట్లతో ఔటర్ ఫేజ్-2 తాగునీటి పథకానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం నుంచి ఇటీవల అనుమతులు తీసుకున్నామని ఎండీ పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా ఈ పథకాన్ని ఆచరణలోకి తీసుకువస్తామన్నారు. సింగూరు, మంజీరా నీటి తరలింపు ఆగిపోవడం, బోర్లు ఎండిపోవడం వల్ల శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తిందని, నీటి ట్యాంకర్ల ద్వారా నీటి ఎద్దడిని అధిగమించామని పేర్కొన్నారు. నిర్దేశిత గడువులోపు రూ.422కోట్లతో ఘన్‌పూర్ నుంచి 44 కిలోమీటర్ల మేర రింగు మెయిన్ పైపులైన్ పనులు పూర్తి చేసి సకాలంలో ఐటీ కారిడార్‌కు నీరు అందించామన్నారు.

రూ.8వేల కోట్లతో సీవరేజీ మాస్టర్‌ప్లాన్
పాతకాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ ఒకవైపు, మరోవైపు సంస్థ పరిధి ఔటర్ వరకు విస్తరించడంతో 2036 జనాభాను దృష్టిలో ఉంచుకొని 2133 ఎంఎల్‌డీ మేర మురికినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా సీవరేజి మాస్టర్‌ప్లాన్ రూపకల్పన జరుగుతుందన్నారు. షా కన్సల్టెన్సీ అధ్యయనం చేస్తున్నదని, 51 ప్రాంతాల్లో సివరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. రెండు, మూడు చెరువులు కలుపుకొని ఎస్టీపీ చేపట్టి శుద్ధి చేసిన మురుగునీటిని మూసీలోకి వదలనున్నామని వివరించారు. సీవరేజి మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనను వచ్చే 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నామన్నారు. కూకట్‌పల్లి నాలాపై ఎస్టీపీలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

జరిమానా విధిస్తాం
భూగర్భ జలాల అభివృద్ధి లక్ష్యంగా థీమ్‌పార్కులు, జల సంరక్షణ, జల నాయకత్వం, వాక్ బృందాలతో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామని ఎండీ దానకిశోర్ తెలిపారు. ఎన్జీవోలు, జలమండలి, జీహెచ్‌ఎంసీల సంయుక్తాధ్వర్యంలో ఇప్పటి వరకు కొత్తగా 350 ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం, తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించడం వల్ల రోజూ 50 ఎంజీడీల మేర నీరు వృథా అవుతుందని, ఈ వృథాను తగ్గించేందుకు కాలనీలు, బస్తీల వారీగా స్వయం సహాయక బృందాలతో కలిసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. నీటిని వృథా చేసే వారిపై అవసరమైతే జరిమానాలు విధించనున్నామని ఎండీ దానకిశోర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సత్యనారాయణ, డైరెక్టర్లు విజయ్‌కుమార్‌రెడ్డి, సత్యసూర్యనారాయణ, రవి, అజ్మీరా కృష్ణ, ఎల్లాస్వామి, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.

కేశవాపూర్‌తో ఎంతో ఉపయోగం
హైదరాబాద్ తాగునీటికి శాశ్వత పరిష్కారంగా శామీర్‌పేట వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో కేశవాపూర్ రిజర్వాయర్‌ను చేపడుతున్నామని, ప్రస్తుతం భూ సేకరణ జరుగుతుందని జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 30 టీఎంసీలను నీటి అవసరాలకు వినియోగించుకోవచ్చన్నారు. కొండపోచమ్మసాగర్ నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు గ్రావిటీ ద్వారా పైపులైన్ నిర్మాణం చేపట్టి గోదావరి నీటిని ఏడాది పొడవునా నీటి సరఫరా చేయొచ్చన్నారు. 10 టీఎంసీల కేశవాపూర్ రిజర్వాయర్ స్టోరేజీ చేసుకుని నగరంలో ఏ మూలకైనా నీటి తరలింవచ్చన్నారు. ఔటర్ చుట్టూ రింగు మొయిన్ పైపులైన్ ద్వారా గోదావరి జలాలను పాతబస్తీకి కూడా తరలించే వీలు ఉంటుందన్నారు. 158 కిలోమీటర్ల ఔటర్ చుట్టూ దాదాపు రూ.4725 కోట్లతో రింగు మెయిన్ పైపులైన్, 12 మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేపట్టేందుకు ప్రతిపాదన సిద్ధం చేశామన్నారు. టాటా కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చిందని, ఈ ప్రాజెక్టుకు హడ్కో సంస్థ రూ.2వేల కోట్ల రుణసాయం అందించేందుకు సుముఖత వ్యక్తం చేసిందని ఎండీ వివరించారు. ఏడీపీ బ్యాంకు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థలు రుణం సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మిగిలిన నిధులను ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టి నగరంలో ఏ మూలనా నీటి సమస్య వచ్చినా పరిష్కరించుకోవచ్చన్నారు అంతేకాకుండా రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు 12 కిలోమీటర్ల మేర పైపులైన్ వేసి నీటి సరఫరా తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మరో ప్రతిపాదిత డేడికేటెడ్ స్టోరేజీ రిజర్వాయర్ దేవులనాగారానికి సంబంధించి వాప్కోస్ సంస్థ అధ్యయనం చేస్తుందన్నారు.

579

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles