బాలల అక్రమ రవాణా.. ముఠా అరెస్ట్

Wed,July 17, 2019 03:25 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : బాలల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి గాజుల పరిశ్రమలో వెట్టిచాకిరీ చేస్తున్న 54 మంది బాలలకు రాచకొండ పోలీసులు విముక్తి కల్పించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీపీ మహేశ్‌భగవత్ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహ్మద్ అస్లాం, ఫిరోజ్ అలాం, అన్వరుల్, మునావర్, ఇంతికాబ్‌లు చిన్నచిన్న గాజుల తయారీ కంపెనీలు హబీబ్‌నగర్, ఉస్మాన్‌నగర్, సైఫ్‌కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఇండ్లను అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్నారు. వీరికి కావాల్సిన లేబర్, ఇతర ఏర్పాట్లకు షాహిన్‌నగర్ పరిసర ప్రాంతాలకు చెందిన షేక్ మహ్మద్ రియాజ్, మహ్మద్ హషాన్, షేక్‌హబీబ్, మహ్మద్ ముస్లీం, అస్గర్, నసీమ్ అక్రమ్ సహకరిస్తున్నారు. ఇందులో భాగంగా పరిశ్రమల్లో పని చేసేందుకు కావాల్సిన కార్మికులను బీహార్ నుంచి నిర్వాహకులు రప్పిస్తున్నారు. ఇందుకు బీహార్‌కు వెళ్లి, అక్కడ వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకొని గాజుల పరిశ్రమల్లో పనిచేసేందుకు పిల్లలను ఎంచుకుంటారు. వారి తల్లిదండ్రులకు డబ్బు అడ్వాన్స్ ఇచ్చి ఇక్కడకు బాలలను తీసుకొచ్చి వారితో పరిశ్రమల్లో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు పనులు చేయిస్తూ పిల్లలందరిని ఒకే గదిలో బంధించేస్తున్నారు. బయటకు వెళ్లకుండా కట్టడి చేస్తూ పనులు చేయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సైదులు బృందం ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి తరువాత బాల కార్మికులున్న ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఇరుకైన గదుల్లో వెట్టిచాకిరీ చేస్తూ గడుపుతున్న 54 మంది పిల్లలను గుర్తించారు. పోలీసుల సోదాలతో అర్ధరాత్రి పరిశ్రమల నిర్వాహకులు, వారికి సహకరిస్తున్న వారంతా పరారయ్యారు. ఈ నేపథ్యంలో పిల్లలను సైదాబాద్‌లో బాలల సదనానికి తరలించిన పోలీసులు, బాలలను వెట్టి చాకిరీ కోసం అక్రమ రవాణా చేయిస్తున్న ముఠా కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బాలాపూర్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఫలక్‌నుమా రైల్వేస్టేషన్ వద్ద నిందితుల్లో ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, కార్మిక శాఖ, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ నెల 1వ తేదీ నుంచి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 176 మంది బాలలను కాపాడామని సీపీ మహేశ్‌భగవత్ వెల్లడించారు. సమావేశంలో అదనపు సీపీ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఏసీపీ గాంధీనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

183

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles