నెక్లెస్‌రోడ్డులో మొబైల్ హుక్కాలు ?

Mon,June 17, 2019 03:47 AM

-రెచ్చిపోతున్న పోకిరీలు, బైక్ రేసర్లు
-వాకర్లు, సందర్శకులపై దాడులు !
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఆహ్లాదం కోసం నెక్లెస్ రోడ్డుకు వచ్చే వారికి పోకిరీలు చుక్కలు చూపిస్తున్నారు.. ఇందులో ఉదయం నడకకు వచ్చే వారిని సైతం వదిలిపెట్టడం లేదు.. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పోకిరీలు నెక్లెస్‌రోడ్డు పరిసర ప్రాంతాలలో అడ్డా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయం వాకింగ్‌కు వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకొని కొందరు ఆకతాయిలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం నెక్లెస్‌రోడ్డులో తన ప్రియురాలితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న మిర్యాలగూడకు చెందిన రౌడీషీటర్ జునైద్ అలియాస్ మహ్మద్ ఖరీద్‌ఖాన్ చేష్టలను చూసి, అటు నుంచి వెళ్తున్న యువకులు ప్రశ్నించిన పాపానికి వారి ప్రాణాలనే ఆ రౌడీషీటర్ బలితీసుకున్నాడు. రౌడీషీటర్ చేతిలో దాడికి గురైన సాయిసాగర్ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇంత జరిగినా కూడా పోలీసులు మాత్రం నెక్లెస్‌రోడ్డు వైపు నిఘాను పెంచకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తున్నది. ఉదయం సాయంత్రం వేళల్లో యువకులు, మైనర్లు వాహనాలతో రేసింగ్‌లు చేస్తూ కన్పిస్తున్నారు. ఇలా నెక్లెస్‌రోడ్డు పరిసరాలకు కొద్ది సేపు సేదా తీరాలని కుటుంబంతో పాటు వచ్చే వారికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ పోలీస్ ఫోకస్ లేకపోవడంతో అనుకోని ఘటనలు జరుగుతున్నాయని సామాన్య ప్రజలు వాపోతున్నారు. పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడ సామాన్య ప్రజలతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనినే ఆసరగా తీసుకుంటున్న కొందరు పోకిరీలు ఇదే ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇందులో కొందరు అక్కడ వ్యాపారాలు నిర్వహించే వారితో సన్నిహితంగా ఉంటూ అదే ప్రాంతంలో 21 గంటలు తిరుగుతుంటారు. దీంతో అప్పుడప్పుడు పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది దృష్టిలోనూ వారు మంచివారుగా గుర్తింపు పొందుతూ సామాన్యులను మాత్రం ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

ఉదయం నడకకు వెళ్లేవారిపై దాడులు..!
ఉదయం 7 గంటలకు కొందరు పోకిరీలు వాహనాలపై వెళ్తూ.. నడుచుకుంటూ వెళ్లేవారిని కొట్టుకుంటూ వెళ్తున్నారు. బైక్‌లపై వెళ్తూ.. అల్లరి చేస్తూ చేతిలో కర్రలు పట్టుకొని వాకర్స్‌పై దాడులు చేస్తున్నారు. అయితే అప్పటికప్పుడే వారిని పోలీసులకు పట్టివ్వాలని అలోచించే లోపే వారు అక్కడి నుంచి పరారవుతున్నారు. అయితే పోలీసులు కూడా ఎక్కడ కన్పించకపోవడంతో చాలామంది తమ నిస్సాయతను వ్యక్తం చేస్తున్నారు. ఇదే పోకిరీలు తమ బైక్‌లతో విభిన్నమైన విన్యాసాలు చేస్తూ ఉదయం వేళల్లోనే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. నెక్లెస్‌రోడ్డు ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని కొందరు యువకులు ప్రతి రోజూ ప్రజలను ఇలాంటి వేధింపులకు గురిచేస్త్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.

మొబైల్ హుక్కాలు...!
నగరంలో హుక్కా కేంద్రాలను మూసివేయడంతో ఇప్పుడు వ్యాపారులు కొత్త తరహాలో దందాను నిర్వహిస్తున్నారు. మొబైల్ హుక్కా కేంద్రాలను నిర్వహిస్తూ యువతను ఆకర్షిస్తున్నారు. యువత, పోకిరీలు ఎక్కువగా ఉండే నెక్లెస్‌రోడ్డు ప్రాంతంలో ఈ మొబైల్ హుక్కా కేంద్రాలను నిర్వహిస్తున్నారని, అది కూడా ఉదయం వేళల్లోనే నిర్వహించడం ఆశ్చర్యకరంగా ఉందంటూ ఉదయం నడకకు వెళ్లిన ఓ వ్యక్తి నమస్తే తెలంగాణతో వాపోయాడు. ఒక్కొక్కరి నుంచి రూ. 150 వసూలు చేస్తూ.. ఈ మొబైల్ హుక్కా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని, ఒకటి రెండు గంటలు పాటు హుక్కా సెంటర్‌ను నిర్వహిస్తూ దాని అడ్డాను మారుస్తున్నారనంటూ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నయా పంథాలో హుక్కా కేంద్రాలు నిర్వహిస్తున్న విషయంపై పోలీసులు గుర్తించారా? లేదా? అనే సందేహాలను సామాన్యులు వ్యక్తం చేస్తున్నారు.

నిద్రావస్థలో పోలీసులు..
నెక్లెస్‌రోడ్డు పరిసర ప్రాంతాలలో 24 గంటలు రద్దీగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంపై ప్రత్యేక ఫోకస్‌ను ఏర్పాటు చేయాల్సిన పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని అక్కడకు ప్రతి రోజు వాకింగ్‌కు వచ్చే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో తరుచుగా పోలీసులు అతివేగం, బైక్‌రేసింగ్, బైక్‌లపై విన్యాసాలు చేసే వారిని కట్టడి చేసేందుకు పాతబస్తీ, నెక్లెస్‌రోడ్డు, బంజారాహిల్స్ ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించేవారు. అయితే ఇటీవల ఈ విషయాన్ని విస్మరించినట్లు కన్పిస్తున్నది. రౌడీషీటర్ దాడి తరువాత అయినా పోలీసులు మేల్కొని, నెక్లెస్‌రోడ్డు పరిసరాలలో పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలాఉండగా నెక్లెస్‌రోడ్డులో వివిధ రకాలైన రన్‌లు, వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో ప్రముఖులు హాజరవుతుంటారు. ఆ సమయంలోనే పోలీసులు అక్కడ పటిష్ట నిఘాను ఏర్పాటు చేస్తుంటారని.. మిగతా సమయంలో ఆటూ వైపు చూసీచూడనట్లే ఉంటారని స్థానికులు పేర్కొంటున్నారు.

642

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles