లెక్కింపునకు..ఏర్పాట్లు

Tue,May 21, 2019 12:38 AM

-హైదరాబాద్‌ జిల్లాలో 14 కౌంటింగ్‌ కేంద్రాలు
-టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, కౌంటింగ్‌ అసిస్టెంట్‌, మైక్రో అబ్జర్వర్‌
-హోళీమేరి కాలేజీలో ‘మల్కాజిగిరి’, పాలమాకులలో ‘చేవెళ్ల’ ఓట్ల లెక్కింపు
-23న ‘స్థానిక’ సెలవు
మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా డిస్ట్రిబ్యూషన్‌ రిసెప్షన్‌ కౌంటింగ్‌ (డీఆర్‌సీ) కేంద్రాల వద్ద ఈ నెల 23న లెక్కింపునకు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్‌ ఎన్నికల అధికారి దానకిశోర్‌, నగర సీపీ అంజనీకుమార్‌తో కలిసి ఎల్బీస్టేడియంలోని ముషీరాబాద్‌, నాంపల్లి సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా దాన కిశోర్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, 22న సెగ్మెంట్ల వారీగా మరోసారి తర్ఫీదు ఇవ్వనున్నట్లు తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానానికి సంబంధించి మేడ్చల్‌ జిల్లా కీసర మండలం భోగారంలోని హోళీమేరి ఇంజినీరింగ్‌ కాలేజిలో లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం ఓట్ల లెక్కింపు జరుగనున్న శంషాబాద్‌ మండలం పాలమాకుల బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను రంగారెడ్డి కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ పరిశీలించారు.

మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం కౌంటింగ్‌ ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. జిల్లాలో మేడ్చల్‌, ఎల్‌బీనగర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, కంటోన్మెంట్‌, మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్‌ ఈ నెల 23వ తేదీన కీసర మండలం భోగారంలోని హోళీమేరీ ఇంజనీరింగ్‌ కాలేజిలోనే జరుగనుంది. జిల్లాలో మొత్తం ఓటర్లు - 31,49, 710 ఉండగా, వీరిలో పురుషులు - 8,22,098, స్త్రీలు - 7,37,975 మంది, ఇతరులు 35 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. మొత్తంగా మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో 49.40శాతం పోలింగ్‌ నమోదు జరిగింది. మొత్తం 126 టేబుల్స్‌లో కౌంటింగ్‌ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇందులో మేడ్చల్‌-28 టేబుల్స్‌, 20 రౌండ్లు, ఎల్‌బీనగర్‌లోను 28 టేబుల్స్‌, 20 రౌండ్లలో కౌటింగ్‌ జరుగనుండగా, మిగిలిన కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌, కంటోన్మెంట్‌, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 14 టేబుల్స్‌, 32 రౌండ్లలో కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఇందుకు గాను 158 మంది పరిశీలకులు, 158 సహాయ పరిశీలకులు, 161 మంది మైక్రో పరిశీలకులతో పాటు సుమారు మరో 3వేల మంది సిబ్బంది కౌంటింగ్‌ ప్రక్రియలో విధులు నిర్వహించనున్నారు.

23వ తేదీన అన్ని సంస్థలకు సెలవు
లోక్‌సభ ఎన్నికల ఫలితాల లెక్కింపు సందర్భంగా ఈ నెల 23వ తేదీన (గురువారం) స్థానిక సెలవు (లోకల్‌ హాలిడే)గా ప్రకటిస్తున్నట్లు హైదారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ మాణిక్‌ రాజ్‌ కన్నన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు నెగోషియబుల్‌ ఇనిస్టూమెంట్‌ చట్టం కింద లోకల్‌ హాలిడేగా ప్రకటించారు. హైదరాబాద్‌ జిల్లాలో కౌంటింగ్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, స్థానిక సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు. సదరు యాజమాన్యాలు వారి సంస్థలకు సెలవు ప్రకటించాల్సిందిగా కలెక్టర్‌ స్పష్టం చేశారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :
లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ రిసెప్షన్‌ కౌంటింగ్‌ (డీఆర్‌సీ) కేంద్రాల వద్ద ఈ నెల 23వ తేదీన ఎక్కడికక్కడ లెక్కింపు జరుగనుందని, కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ తెలిపారు. సోమవారం సీపీ అంజనీకుమార్‌తో కలిసి ఎల్బీస్టేడియంలోని ముషీరాబాద్‌, నాంపల్లి సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను దానకిశోర్‌ పరిశీలించారు. కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామని, 22వ తేదీన (బుధవారం)సెగ్మెంట్‌ల వారీగా మరోసారి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కౌంటింగ్‌ తేదీ, సమయం, కేంద్రాల వివరాలను పోటీ చేసే అభ్యర్థులకు ముందుగానే సమాచారం అందిస్తామని, కౌంటింగ్‌ జరిగే 23వ తేదీన ఉదయం 5 గంటలకు స్ట్రాంగ్‌ రూమ్‌లను తెరిచే సమాచారాన్ని కూడా అభ్యర్థులకు తెలియజేస్తామని దానకిశోర్‌ తెలిపారు.

ఉదయం 9 గంటలకు కౌంటింగ్‌ షురూ
ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. మొదటగా కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు ఉంటుంది. ఆనంతరం ఈవీఎంల పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ సారి ఐదు వీవీ ప్యాట్‌ స్లిప్పులను కౌంటింగ్‌ హాల్‌ వద్ద ఏర్పాటు చేసిన సఫరేట్‌ హాల్‌లో లెక్కిస్తారు. ఈవీఎంల కౌంటింగ్‌ ఆనంతరం వీవీ ప్యాట్‌ల స్లిప్‌లను ప్రప్రథమంగా ఈ సారి లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్‌ లెక్కింపునకు 20 నిమిషాలు పట్టనుంది.
కౌంటింగ్‌ వివరాలు
-హైదరాబాద్‌ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన మొత్తం ఓట్లు 17, 86, 515
-సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లు 9,10,437, వీటిలో పురుషులు 4,85,913, స్త్రీలు 4,24,520, ఇతరులు 4, సికింద్రాబాద్‌ నియోజకర్గంలో ముషీరాబాద్‌, అంబర్‌పేట, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, సనత్‌నగర్‌, నాంపల్లి, సికింద్రాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లు ఉన్నాయి.
-హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లు 8,76,078, పురుషులు 4,77, 929, స్త్రీలు 4, 24, 520, ఇతరులు 4, హైదరాబాద్‌ నియోజకవర్గంలో మలక్‌పేట, కార్వాన్‌, గోషామహల్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, యాకుత్‌ఫుర, బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సర్వీసు ఓటర్లు 382
-సికింద్రాబాద్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ల సంఖ్య 3, 900, హైదరాబాద్‌లో పోస్టల్‌ బ్యాలెట్లు 2, 696
-సికింద్రాబాద్‌ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌లను ఉస్మానియా యూనివర్శిటీ ఫ్రొఫెసరు రామ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్‌లో లెక్కిస్తారు.
-హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి పోస్టల్‌ బ్యాలెట్‌లను నిజాం కళాశాలలో లెక్కిస్తారు.
-హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం కౌంటింగ్‌ కేంద్రాలు 14, ప్రతి కౌంటింగ్‌ హాల్లో 14 టేబుళ్లు ఉంటాయి. ప్రతి టేబుల్‌ వద్ద ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఒక కౌంటింగ్‌ అసిస్టెంట్‌ ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు.
-మొత్తం కౌంటింగ్‌ స్టాప్‌ (సిబ్బంది) 588 (14X14X3+20% రిజర్వ్‌)

లోనికి మొబైల్స్‌ తీసుకెళ్లవద్దు
ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌తో కలిసి సోమవారం నిజాం కళాశాల కేంద్రాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే పోటీ చేసిన అభ్యర్థుల ఎజెంట్లు విధిగా పోలీస్‌ వెరిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుందని దానకిశోర్‌ చెప్పారు. ఈసారి ఓట్ల లెక్కింపులో ఐదు వీవీ పాట్‌లలోని ప్లిప్‌లను లెక్కిస్తున్నందున ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం దాక కొనసాగే అవకాశం ఉందన్నారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బంది, ఏజెంట్లకు మంచినీరు, ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సెగ్మెంట్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇప్పటికే ఈ నెల 16వ తేదీన ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి మొదటి విడుత శిక్షణ కార్యక్రమం ముగిసిందని, ఈ నెల 22న బంజారాహిల్స్‌లోని ముఫకంజా కాలేజ్‌లో రెండో విడత శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లను చేపట్టామని ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.

262

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles