కాంగ్రెస్‌ ‘పరిరక్షణ’ యాత్రకు స్పందన కరువు

Tue,May 21, 2019 12:35 AM

బడంగ్‌పేట, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ప్రజా స్వామ్య పరిరక్షణ యాత్రకు ప్రజల మద్దతు కరువైంది. మల్లు భట్టి విక్రమార్కతో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి తదితర నాయకులు పాల్గొన్న కార్యక్రమంలో ప్రజల మద్దతును కూడ గట్టలేక పోయారు. ఆర్కేపురం, సరూర్‌నగర్‌ డివిజన్‌లో యాత్ర ముగించుకొని బాలాపూర్‌ మండలానికి వచ్చే సరికి అసలే జనం లేకుండా పోయారు. జిల్లెలగూడలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి బాలాపూర్‌ చౌరస్తా, బాలాపూర్‌, మల్లాపూర్‌, నాదర్‌గుల్‌, బడంగ్‌పేట, అల్మాస్‌గూడ, మీర్‌పేట మీదగా జిల్లెలగూడలో రోడ్డు షో కార్యక్రమం ఉంటుందని డీసీసీ అధ్యక్షులు ప్రకటించారు. కాంగ్రెస్‌ నాయకులు అనుకున్న విధంగా ప్రజా స్వామ్య పరిరక్షణ యాత్ర కొనసాగ కుండా మధ్యలో బ్రేక్‌ పడింది. బాలాపూర్‌ చౌరస్తాలో ప్రజలు లేకపోవడంతో నేరుగా బాలాపూర్‌లో కార్యక్రమం నిర్వహించారు.

అక్కడాజనం లేక పోయే సరికి బడంగ్‌పేట మున్సిపాలిటీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి డబ్బులు పెట్టి కొంత మందిని పోగు చేశారు. దీంతో ప్రసంగాలు చేసి మమ అనిపించుకున్నారు. డబ్బులు ఇస్తామని ప్రజలను తీసుకొచ్చి డబ్బులు ఇవ్వక పోవడంతో కొంత మంది బహిరంగంగానే ఆరోపణలు చేశారు. నాదర్‌గుల్‌, మల్లాపూర్‌, కుర్మల్‌గూడ, బడంగ్‌పేటలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన యాత్రకు ఎవరూ రావడం లేదని తెలిసి విరమించుకున్నట్లు సమాచారం. మహేశ్వరం, కందుకూరు మండలంలో కూడా అదే పరిస్థితి నెలకొన్నది. పార్టీ నాయకులు కూడా గైర్హాజరయ్యారు.

అనుమతి లేదంటూ.. కేసు నమోదు
యాత్రకు అనుమతి లేదంటూ.. కేసు నమోదు చేసిన సంఘటన మీర్‌పేట పోలీస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మైబెల్లి తెలిపిన వివరాల ప్రకారం జిల్లెల్‌గూడ మున్సిపాలిటీ కేంద్రంలోని స్వాగత్‌గ్రాండ్‌, లలితానగర్‌ చౌరస్తా వద్ద రాత్రి 7.30కు ప్రజా స్వామ్య పరిరక్షణ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సభకు అనుమతి లేదంటూ కాంగ్రెస్‌ నాయకులు చల్లా నర్సింహారెడ్డి, చిగురింత నర్సింహారెడ్డి, జంగారెడ్డిపైన కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

255

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles