కూల్‌ కూల్‌గా..

Tue,May 21, 2019 12:34 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరం రోజురోజుకు కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోతుంది. ఎటువైపు చూసినా పచ్చదనం కరువు. ఫలితంగా విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు మన చేతుల్లో ఉన్నా.. ఎలా పాటించాలో తెలియక మిన్నకుండిపోతున్నాం. అయితే ఆలోచన ఉంటే.. నిత్యం మన చుట్టూ పచ్చదనాన్ని పెంచుకోవచ్చు. ఫలితంగా ఉష్ణోగ్రతలను తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.

పచ్చదనం అంటే.. దాదాపు ప్రతిఒక్కరికీ మక్కువే. అదీ హైదరాబాద్‌ మహానగరంలో పచ్చదనం కన్పిస్తే.. ఆ వాతావరణం నుంచి వెళ్లాలన్పించదు. ఈ నేపథ్యంలో ఇండ్లు, కార్యాలయాల్లో మొక్కలను పెంచుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు. దానికి తగిన విధంగా ఏవేవో ప్రయత్నాలు చేస్తూ.. మొక్కలు పెంచేందుకు ఆరాటపడుతుంటారు. మరికొంతమంది ఇంటిపై సోలార్‌ విద్యుత్‌ను అమర్చుకోవాలని భావిస్తారు. కానీ దానికి తగిన ప్రణాళిక లేకపోవడంతో ప్రయత్నాలను మధ్యలోనే ఆపేస్తారు. వీటన్నింటికీ పరిష్కార మార్గాలను చూపించేందుకు ‘ద ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌(ఇండియా), తెలంగాణ రాష్ట్ర శాఖ ఇంధన పొదుపు సంస్థల ఆధ్వర్యంలో ‘శీతల, హరిత, శక్తివంతమైన పైకప్పు’ అనే అంశంపై ఖైరతాబాద్‌లో సెమినార్‌ నిర్వహించారు.

టైమ్‌ స్విచ్‌..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కాలంతో పాటే పరుగెత్తాల్సి వస్తుంది. అలాంటి తరుణంలో నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో చాలాసార్లు ఇండ్లు, కార్యాలయాల్లో విద్యుత్‌ ఉపకరణాలను ఆఫ్‌ చేయకుండా బయటికి వెళ్లిన సందర్భాలు అనేకం ఉంటాయి. అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు కార్యాలయాలు, ఇండ్లల్లోని ఫ్యాన్లు, లైట్లు వంటి విద్యుత్‌ ఉపకరణాలను మనకు నచ్చిన నిర్దేశిత సమయంలో ఆటోమెటిక్‌గా ఆఫ్‌ అయ్యేలా చేసేందుకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రత్యేక ‘టైమ్‌ స్విచ్‌'ను రూపొందించారు. దీనివల్ల మనం ఎలాంటి ఉపకరణాన్నైనా ఆఫ్‌ చేయడం మరిచిపోతే.. ముందుగానే ఈ టైమ్‌ స్విచ్‌లో సమయాన్ని నిర్ణయించుకోవడం వల్ల ఆఫ్‌ అయిపోతాయి. ఈ స్విచ్‌(ఎనలాగ్‌ మోడ్‌) రూ.600 నుంచి రూ.800 ఉంటుంది.

ఆల్‌ ఇన్‌ వన్‌ సోలార్‌ స్ట్రీట్‌ లైట్‌..
విద్యుత్‌ను విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ‘ఆల్‌ ఇన్‌ వన్‌ సోలార్‌ స్ట్రీట్‌ లైట్‌'ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ప్రత్యేక ఏంటంటే.. సెన్సార్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దీనివల్ల చీకటి పడగానే మాములు వెలుతురు ఉంటుంది. సాయంత్రం కాగానే ఆటోమెటిక్‌గా వెలుగడంతో పాటు తెల్లవారుజామున సన్‌లైట్‌ రాగానే ఆఫ్‌ అవుతుంది. ఇందులోనే ఇన్‌బిల్ట్‌గా ఉండే 11.1ఏహెచ్‌ బ్యాటరీ ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ అయితే .. రెండు రోజుల పాటు బ్యాకప్‌ వస్తుంది.

ఇంటి పైకప్పులా పనిచేసే సోలార్‌ రూఫ్‌..
ఇది చూసేందుకు సాధారణ సోలార్‌ ప్యానెల్‌లానే ఉంటుంది. కానీ దీన్ని నేరుగా ఇంటి పైకప్పుగా వినియోగించవచ్చు. ఇంటిపైన ఖాళీ స్థలంలోనే ఒకట్రెండు గదుల్లాగా ఈ ప్యానెల్స్‌ను ఉపయోగించి కప్పు వేసుకోవచ్చు. పైగా సాధారణ సోలార్‌ ప్యానెల్స్‌ కంటే 48శాతం ఎక్కువ పవర్‌ను జనరేట్‌ చేస్తుంది. ఒక్కసారి ఏర్పాటు చేసుకుంటే.. 40 ఏండ్ల పాటు ఉంటుంది. అగ్ని, నీటి ప్రమాదాల వల్ల వీటికి నష్టం వాటిల్లదు.

కూల్‌ రూఫ్‌ టైల్స్‌..
ఇల్లు అందంగా కన్పించడంలో టైల్స్‌ పాత్ర కీలకమనే చెప్పాలి. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన కూల్‌ రూఫ్‌ టైల్స్‌ ఇంటి ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గిస్తుందనే చెప్పాలి. ‘సిరికోనియం సింకెట్‌ను’ ఈ టైల్స్‌లో కలుపడం వల్ల ఇవి ఇతర టైల్స్‌ మాదిరిగా వేడిని గ్రహించవు. దీంతో ఇంటి లోపలి వాతవరణం అంతగా వేడెక్కదు. ఫ్లోర్‌ టైల్స్‌ చదరపు అడుగుకు రూ.65 నుంచి రూ.70 పలుకుతుంది.

మొక్కలతో మరింత చల్లదనం..
మొక్కలు పెంచుకోవాలనే అభిలాష చాలామందికి ఉ న్నా కానీ పెంచుకోలేరు. ప్లాస్టిక్‌ డబ్బాలే కాకుండా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఫ్యాబ్రిక్‌, గన్నీ సంచుల్లోనూ మొక్కలను పెంచుకునే వెసులుబాటు ఉంది. విశ్వేశ్వరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఇంటి ఆవరణలో మొక్కలను ఎలా పెంచుకోవచ్చనే విషయాన్ని ప్రదర్శించారు.

275

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles