ఒక్క పూటలో.. పరిష్కరించారు

Fri,April 26, 2019 12:20 AM

- కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో మీ భూమి.. మీ పత్రాలు కార్యక్రమం షురూ
- 9 గ్రామాల్లోని 192 సమస్యలు పరిష్కారం
- నేడు మరికొన్ని గ్రామాల్లో.. ఫిర్యాదులు స్వీకరించనున్న అధికారులు
- సంతోషం వ్యక్తం చేస్తున్న రైతన్నలు

నేను చాలా రోజులుగా రికార్డుల్లో పేరు మార్పు కోసం మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. అధికారులు అదిగో చేస్తాం... ఇదిగో చేస్తామన్నారు తప్పా.. ఏనాడు పట్టించుకోలేదు. కానీ ఈ రోజు నా సమస్యకు ఓ పరిష్కారం చూపారు. ఏడాది కాలంగా తిరిగినా పరిష్కారం కాని సమస్యను కేవలం ఒక్క పూటలోనే పరిష్కరించారు. సంతోషంగా ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రెవెన్యూ అధికారుల్లో మార్పు వచ్చిందనిపిస్తున్నది. ఇది శాశ్వతం కావాలి.
- శామీర్‌పేట్ మండల పరిధిలోని ఓ రైతు.

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారులు రైతుల సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ఒక్కరోజులోనే 259 సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించగా 192 సమస్యలను ఒక్కపూటలోనే పరిష్కరించి వివిధ కారణలతో 67 ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచారు. రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా ప్రకటించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మేడ్చల్ జిల్లా కీసర ఆర్డీఓ వి.లచ్చిరెడ్డి తన పరిధిలోని ఐదు గ్రామీణ మండలాల్లో ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు మీ భూమి మీ పత్రాలు సరి చూసుకొండంటూ ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే గురువారం ఐదు మండలాల పరిధిలోని 9 గ్రామాల్లో రైతులతో పాటు ఇతర ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. రికార్డుల్లో తప్పులను సవరించడం, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం, ఇవ్వని వారికి ఎందుకు ఇవ్వలేదో తెలుపడం, మ్యూటేషన్లు, విరాసత్ ఇలా గ్రామంలోని రైతుల అనేక రకాల రెవెన్యూ సమస్యలను కేవలం ఒక్కరోజులో పరిష్కరించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎక్కువగా నా రికార్డుల్లో రెండు ఎకరాలుంటే పొజీషన్‌లో మాత్రం ఎకరమే ఉందని కొందరు, పొజీషన్‌లో ఎన్నో ఏండ్లుగా ఉంటున్నా కానీ కొంత భూమికే పట్టాలున్నాయి, మిగిలిన భూమికి లేవనే ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

ధనాధన్.. ఫటాఫట్
వచ్చిన ప్రతి ఫిర్యాదును ధనాధన్.. ఫటాఫట్ పరిష్కరించాలనే లక్ష్యంతో మండల పరిధిలోని రెవెన్యూ అధికారులందరూ ఒకేచోట గ్రామాల వారీగా పూర్తిస్థాయిలో రెవెన్యూ రికార్డులతో రైతులకు అందుబాటులో ఉంచారు. ఏదేని సమస్యతో వచ్చిన వారి నుంచి ఫిర్యాదును స్వీకరించిన అధికారులు ముందస్తుగా అతని వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి వెంటనే రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. సదరు ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదులోని భూమిపై ఎలాంటి కోర్టు వివాదం లేనైట్లెతే కేవలం నిమిషాల వ్యధిలోనే రైతుల సమస్యలకు ఓ పరిష్కారం అందిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల రైతులు సంబురపడుతున్నారు.

నేడు ఈ గ్రామాల రైతులు రావాలి..
నేడు కీసర మండల పరిధిలోని గోదుమకుంట, కుందన్‌పల్లి, మూడుచింతలపల్లిలోని చిన్నపర్వతాపూర్, ఉషార్‌పల్లి, శామీర్‌పేట్ మండల పరిధిలోని బొమ్మరాశిపేట్, దేవరయంజాల్, ఘట్‌కేసర్ మండల పరిధిలోని కొండాపూర్, పడమటిసాయి గూడ, మేడ్చల్ మండల పరిధిలోని మైసిరెడ్డిపల్లి, రైలాపూర్, ఘన్‌పూర్ గ్రామాల్లోని రెవెన్యూ సమస్యలపై ఆయా గ్రామాల రైతులు వచ్చి తమకు ఫిర్యాదులు అందించాలని అధికారులు కోరారు.

ప్రజలకు నమ్మకం కలుగుతుంది
ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం కలుగుతున్నది. అధికారుల పనితీరులో మార్పు రాకపోవడంతో ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు ఏం చేయలేకుండా పోతుందని అపనమ్మకం ఉండేది. మీ భూమి మీ పత్రాలను సరిచూసుకోండి కార్యక్రమంలో అప్పటికప్పుడే దరఖాస్తుల స్వీకరణ, సమస్యల పరిష్కారం చేపడుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రెవెన్యూ యంత్రాంగం కదిలి వచ్చినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.

పాస్‌పుస్తకాలు వస్తాయని చెప్పారు
మా ఊరు ఆద్రాస్‌పల్లి మా నాన్నపేరు మీదా ఎకర పొలం ఉంది. 2016లో నాన్న శ్రీపతి రాంచందర్‌ముదిరాజ్ మృతి చెందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్న పేరుపై ఉన్న భూమిని అమ్మ శ్రీపతి సుగుణ పేరుపైకి మార్చాలని ఎన్నోసార్లు ఆర్జిలు పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు ఒక్క రోజులో సమస్య పరిష్కారం అయ్యింది. దరఖాస్తు చేసుకోగా అధికారులు వీరాసత్ పూర్తి చేశారు. పట్టాధార్ పాస్ పుస్తకాలు వస్తాయని చెప్పారు.
-చిరంజీవి, శామీర్‌పేట మండలం.

మేమే జిమ్మేదార్లం..
ప్రభుత్వ భూములకు, రైతుల పట్టా భూముల సమస్యల పరిష్కారం కొరకు మా రెవెన్యూ అధికారులు, సిబ్బంది జిమ్మేదార్లుగా పనిచేస్తున్నారు. ఎక్కడో కొంత మంది అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా యావత్తు రెవెన్యూ శాఖకు మచ్చ వస్తున్నది. ఈ మచ్చను తొలగించుకోవడంతో పాటు రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించి రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా ప్రకటించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. మున్ముందు ఇలానే వస్తుందని ఆశిస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా చేస్తారని ఆశిస్తున్నా.
-వి.లచ్చిరెడ్డి, కీసర రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ.

301

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles