వీధి వ్యాపారులకు ప్రత్యేక మార్కెట్లు

Thu,April 25, 2019 04:17 AM

- సర్కిల్‌కు ఒకటి చొప్పున ఏర్పాటుకు బల్దియా సన్నాహాలు
- వీటిలో నిరంతరం క్రయవిక్రయాలు
- స్ట్రీట్ వెండర్లకు తొలగనున్న వేధింపులు
- నగరంలో 24,580 మంది వీధి వ్యాపారులు
- గుర్తింపు కార్డులు పొందిన వారు 22,324 మంది

సిటీబ్యూరో: నగరంలోని వీధి వ్యాపారులకు ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేస్తున్నది. వాటిని ఫ్రీ వెండింగ్ జోన్లుగా ప్రకటించి అక్కడ నిరంతరం వ్యాపారాలు నిర్వహించుకునేలా క్రమపద్ధతిలో స్టాళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. సర్కిల్‌కు ఒకటి చొప్పున ఇటువంటి మార్కెట్లను గుర్తించాలని కమిషనర్ దానకిశోర్ జోనల్ కమిషనర్లను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నగరంలో 24,580 మంది వీధివ్యాపారులను గుర్తించి, అందులో 22,324 మందికి ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీచేశారు.

ఇప్పటివరకు గుర్తించిన జోన్ల వివరాలు....
నిరంతర వ్యాపార జోన్లు(గ్రీన్‌జోన్లు)- 77
పాక్షిక వ్యాపార జోన్లు(యాంబర్ జోన్లు)- 34
వ్యాపార నిషేధ జోన్లు(రెడ్ జోన్లు)- 24
ఇప్పటివరకు గుర్తించిన మొత్తం జోన్లు-135

నగరంలోని వివిధ ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా కొనసాగుతున్న మార్కెట్లను మోడల్ మార్కెట్లుగా అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. వాటిని ఫ్రీ వెండింగ్ జోన్లుగా ప్రకటించి అక్కడ నిరంతరం వ్యాపారాలు నిర్వహించుకునేలా అనుమతించడంతోపాటు ఓ క్రమపద్ధతిలో స్టాళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. సర్కిల్‌కు ఒకటి చొప్పున ఇటువంటి మార్కెట్లను గుర్తించాలని కమిషనర్ దానకిశోర్ జోనల్ కమిషనర్లను ఆదేశించారు. దీనివల్ల వీధి వ్యాపారులతో పాటు వినియోగదారులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని, వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మార్కెట్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అవి ఎటువంటి స్టాళ్లు లేకుండా అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ తాజాగా వాటిని అభివృద్ధి చేసి మోడల్ మార్కెట్లుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. సర్కిల్‌కు ఒకటి చొప్పున గుర్తించి సాధ్యమైనంత త్వరగా వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వీధి వ్యాపారుల చట్టం అమల్లో భాగంగా వీటిని అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నగరంలో 24,580 మంది వీధివ్యాపారులను గుర్తించి, అందులో 22,324 మందికి ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేశారు. వీరిలో 204 మంది సభ్యులకు రూ. 90 లక్షల మేర ముద్ర రుణాలను అందజేశారు. 299 కామన్ ఇంట్రస్ట్ గ్రూపులుగా తయారుచేసి అందులో 4,741 మంది సభ్యులతో 23 గ్రూపులను ఏర్పాటు చేసి వారికి ఆర్థిక క్రమశిక్షణలో ప్రత్యేక శిక్షణను అందించడమే కాకుండా రూ. 19 లక్షల బ్యాంకు రుణాలను అందించారు. అలాగే, నగరంలో మొదటిదశలో 135 వెండింగ్ జోన్లను గుర్తించారు. ఇందులో 24 పూర్తిగా వ్యాపార నిషేధ జోన్లు కాగా, 77 జోన్లు నిరంతర వ్యాపార నిర్వహణ జోన్లుగా, 34 పాక్షిక వ్యాపార జోన్లుగా గుర్తించారు. నగరంలో మొత్తం 30 టౌన్ వెండింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. వీధి వ్యాపారాల నిషేధిత ప్రాంతాలను రెడ్‌జోన్‌గా, నిరంతర వ్యాపార నిర్వహణ ప్రాంతాన్ని గ్రీన్‌జోన్‌గా, నిర్థారిత సమయాల్లో మాత్రమే వ్యాపారాలు అనుమతించే ప్రాంతాలను యాంబర్ జోన్‌లుగా నిర్థారించారు.

సామాజిక భద్రతకు చర్యలు....
24,580 మంది స్ట్రీట్ వెండర్ల వివరాలను తెలంగాణ మెప్మా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటు ఈ స్ట్రీట్ వెండర్లకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల కింద సామాజిక బీమా పథకాన్ని వర్తింపజేశారు. వీధి వ్యాపారుల ఉపాధి పరిరక్షణతో పాటు స్ట్రీట్ వెండర్లతో కామన్ ఇన్‌ట్రస్ట్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ప్రతి సర్కిల్ స్థాయిలో టౌన్ వెండింగ్ కమిటీలను ఏర్పాటు చేసి ఈ కమిటీల్లో 20 శాతం ప్రభుత్వ అధికారులు, 40 శాతం స్ట్రీట్ వెండర్లు, 20 శాతం ఎన్‌జీవోల ప్రతినిధులు సభ్యులుగా నియమిస్తున్నారు.

449

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles