ఠారెత్తిస్తున్న ఎండలు

Tue,March 26, 2019 02:44 AM

- గిర్రున తిరుగుతున్న మీటర్లు
- మార్చిలోనే 5.7 కోట్ల యూనిట్ల డిమాండ్
- విద్యుత్‌శాఖ పకడ్బందీ ఏర్పాట్లు


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు నగరవాసులు విద్యుత్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మార్చి నెలలోనే 57.7 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. వచ్చే ఏప్రిల్, మేలో ఎండలు ఇంకా మండిపోనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం ఈ ఏడాది 70 మిలియన్ యూనిట్ల గరిష్ఠ వినియోగానికి చేరుకునే అవకాశాలు లేకపోలేదు. వినియోగానికి తగిన విధంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు.

సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు..

వేసవిలో అత్యధికంగా విద్యుత్ వినియోగం నమోదవుతుండడంతో అధికారులు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. వాస్తవంగా వేసవిలో అధిక విద్యుత్ వినియోగం వల్ల తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, కవర్ కండెన్సర్లు వంటి వాటిని ఇప్పటికే ఏర్పాటు చేశారు. విద్యుత్ తీగల్లో జాయింట్లు ఉన్నచోట లోడ్ ఎక్కువగా పడి తెగిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితులు చోటుచేసుకోకుండా ముందస్తుగానే వాటిని సరి చేశారు. అధికలోడును తట్టుకునే విధంగా రీకండెక్టరింగ్, తీగలపై పడే చెట్టు కొమ్మలను తొలిగించడం, సబ్‌స్టేషన్ల నిర్వహణను అప్రమత్తం చేశారు. మరమ్మతులకు గురైన ఇన్సులేటర్లను మార్చడం, దెబ్బతిన్న జంపర్లను మార్చడం, కేబుల్స్ లుంగ్స్ ఏర్పాటు చర్యలు తీసుకున్నారు.

మార్చి నెలలో ఇదీ పరిస్థితి..

ప్రస్తుతం ఇప్పటివరకు మార్చి నెలలో 57.7 మిలియన్ యూనిట్ల గరిష్ఠ విద్యుత్ వినియోగం నమోదయ్యింది. అదే గతేడాది మార్చి నెలలో గరిష్ఠంగా 56.7 మిలియన్ యూనిట్ల గరిష్ఠ విద్యుత్ వినియోగించారు. మార్చి నెల మొత్తంగా చూసుకుంటే..గతేడాది కంటే ఈ యేడు మార్చిలో దాదాపు మూడు మిలియన్ యూనిట్ల నుంచి నాలుగు వరకు అధికంగా వినియోగం పెరిగింది. ప్రస్తుత ఏడాది మార్చి నెల ముగిసేసరికి 60 మిలియన్ యూనిట్లకు చేరుకొనే అవకాశాలున్నాయి.

3300 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్..

వేసవిలో ఈ యేడు 3300 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే విద్యుత్ శాఖ నాలుగేండ్లుగా ఏడాదికి 2.60 లక్షల కొత్త సర్వీసులను మంజూరు చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే పెరుగుతున్న లోడును తట్టుకునేందుకు వీలుగా నగరంలో 12 కొత్త సబ్‌స్టేషన్లకు ఏర్పాటు చేయడంతో పాటు దాదాపు 5వేల పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి.. 250 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే.. గతేడాది మే నెల 30న 2958 గరిష్ఠ మెగావాట్ల డిమాండ్‌ను అందుకోగా, అదే ఏడాది మే నెల 29న 62.83 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేశారు.
hyd

క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేశాం..

నగరంలో డిమాండ్‌కు తగిన విధంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేశాం. కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేశాం. ట్రాన్స్‌ఫార్మర్ ఎర్తింగ్, జాయింట్లు లేకుండా చర్యలు తీసుకున్నాం. గత రెండేండ్లుగా నగరంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశాం. విద్యుత్ తీగలను చెట్లు అనుకుని ఉన్న చోట కవర్ కండక్టర్‌లను బిగించాం. నగరంలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు ఎలాంటి అంతరాయాలు లేకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. ఈ యేడు 3300 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ చేరుకునే అవకాశం ఉంది.
- రఘుమారెడ్డి, సీఎండీ, టీఎస్‌ఎస్పీడీసీఎల్

286

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles