కేసీఆర్ వదిలిన బాణాన్ని నేను

Tue,March 26, 2019 02:38 AM

- భారీ మెజార్టీతో గెలిపించండి.. చేవెళ్లను అభివృద్ధి చేస్తా
- రోజూ తిరిగిన గల్లీల్లోనే నామినేషన్ వేస్తున్నా
- ఈ ప్రాంతం గురించి అన్నీ తెలుసు
- 84 గ్రామాలను వేధిస్తున్న111 జీఓ త్వరలో ఎత్తివేసే దిశగా ప్రభుత్వం అడుగులు
- తాండూరులో కందిబోర్డు ఏర్పాటు చేస్తాం
- నిరంతరం అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా..
- చేవెళ్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి

రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : లేట్‌గా వచ్చినా.. లేటెస్ట్‌గా వచ్చా.. నేను కేసీఆర్ విల్లు నుండి వచ్చిన బాణాన్ని.. ఆయన లక్ష్యాన్ని సాధించితీరుతా.. చేవెళ్ల నాకు కొత్త కాదు.. చేవెళ్ల ప్రజల గురించి.. ఈ ప్రాంతం గురించి నాకు అన్నీ తెలుసు.. నేను చదువుకున్న గడ్డమీద.. నేను తిరిగిన గల్లీలోనే నామినేషన్ దాఖలు చేస్తున్న.. చేవెళ్ల అభివృద్ధిని కాంక్షించి సీఎం కేసీఆర్ నన్ను చేవెళ్ల నుంచి బరిలో దింపారు. ప్రజలంతా మంచి మెజార్టీ ఇవ్వాలని తలవంచి నమస్కరిస్తున్న.. అని చేవెళ్ల పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసేందుకు ఉదయం 10 గంటలకు బుద్వెల్ ఎక్స్‌టెన్షన్ నుంచి ర్యాలీగా బయలుదేరిన రంజిత్‌రెడ్డి మధ్యాహ్నం 1.30 గంటలకు నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. ఆ తర్వాత నామినేషన్ కేంద్రం సమీపంలో టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రంజిత్‌రెడ్డి మెడలో క్రేన్ సహాయంతో గజమాలను వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ర్యాలీలో ఏర్పాటు చేసిన సభలో రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ కోసం సత్తా చాటే సమయం ఆసన్నమైందన్నారు. అభివృద్ధి.. అందుబాటు నా నినాదమన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే.. చేవెళ్ల పార్లమెంట్‌లో గులాబీ గెలుపు ఖాయమైపోయిందని మెజార్టీయే లక్ష్యంగా సత్తాచట్టాలని పిలుపునిచ్చారు. తనను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపితే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. 84 గ్రామాల ప్రజలు 111 జీఓతో ఎదుర్కొంటున్న ఇబ్బందులు నాకు తెలుసని దాన్ని ఎత్తివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. రూ.18 వేల కోట్లతో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. జోగులాంబ జోన్‌లో ఉన్న వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలిపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నగర ప్రజల దాహర్తిని తీర్చుతున్న జంట జలాశయాల అభివృద్ధికి గత పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఎన్నికలు పూర్తి కాగానే పర్యటక కేంద్రంగా చేస్తామని హామీ ఇచ్చారు.

ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. తాండూరులో కందిబోర్డును సాధించి తీరుతామని తెలిపారు. ఇండస్ట్రీయల్ జోన్, ఐటీ పార్క్, ఎలక్ట్రికల్ డివైస్ పార్క్‌లను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రత్యక్ష ఎన్నికలకు ఇప్పుడు వచ్చినా, నాకు టీఆర్‌ఎస్ పార్టీ, చేవెళ్ల ప్రజలు కొత్తకాదన్నారు. నిరంతరం ప్రజల వెన్నంటే ఉంటానని.. జీవితాన్ని ప్రజల సేవకే అంకితం చేస్తున్నట్లు రంజిత్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, తాండూరు నియోజకవర్గాల టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తల నృత్యలు.. ఆటపాటలతో నామినేషన్ ర్యాలీ జనసంద్రమైంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ గడ్డ రంజిత్‌రెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, అరికేపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, పార్లమెంట్ ఇన్‌చార్జి గట్టు రాంచందర్‌రావు, యువ నాయకులు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, రాష్ట్ర విద్యా, మౌలిక వసతుల కల్పన చైర్మన్ నాగేందర్‌గౌడ్, కార్పొరేటర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ సీనియర్ నాయకులు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు.

రంజిత్‌రెడ్డి రాజకీయాలకు కొత్త కాదు
రంజిత్‌రెడ్డి రాజకీయాలకు కొత్త కాదు. రంజిత్‌రెడ్డిని గెలిపించుకునే బాధ్యత మానదే. ప్రజలంతా ఆలోచించాలి.. నా చిరకాలంగా మిత్రుడు, పార్టీకి చేసిన సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇక్కడే చదివి, ఇక్కడే ఉద్యోగం చేసి, ఇక్కడే వ్యాపారాలు విస్తరించి, ఇక్కడే అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చారు.
- పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ మంత్రి

కొండా చెక్కగుర్రంమీద కూర్చుండు
అపోల దవాఖాన ఉద్యోగుల జీతాలు పెంచమంటే కేసులు నమోదు చేసినవారు చేవెళ్ల ప్రజలకు ఏం మేలు చేస్తారు. నేను గతంలో కార్మిక సంఘంలో పనిచేస్తున్నప్పుడు అపోల ఉద్యోగుల జీతాలు పెంచమంటే 20 మంది ఉద్యోగులను తొలగించిన మీరు చేవెళ్ల ప్రజలకు ఏం మేలు చేస్తారు. ఉద్యోగుల జీతాలు అడిగితే తామ ముందే రాళ్లతో కారు ఆద్దాలు పగులగొట్టుకుని ఆ కేసును ఉద్యోగుల (కార్మికుల) మీదకు నెట్టిన ఘనత వారిది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెక్క గుర్రం మీద కూర్చుని ఊరుకుతుందనుకుటున్నాడు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో జిల్లాలో తాగు, సాగునీరందిస్తాం.
- గట్టు రాంచందర్‌రావు , చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జి

మూడు లక్షల మెజార్టీ తగ్గొద్దు..
కొందరితో అయ్యేది కాదు..పోయ్యేది కాదు.. పట్టుదలతో పనిచేసి మంచి మెజార్టీ సాధించాలి. మన పార్టీతో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఉన్నందున మనకు మిత్ర పక్షమైనా ఎంఐఎంతో పొత్తుంది. ఎంఐఎం ఓట్లు కూడా మనకే వస్తాయి. చేవెళ్ల లోక్‌సభలో 3 లక్షలకు తగ్గకుండా మెజార్టీ వచ్చే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి.
- టి.ప్రకాశ్‌గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

ఛాలెంజ్‌గా తీసుకుంటాం
గడపగడపకూ అభివృద్ధి.. సంక్షేమ ఫలాలు అందించాం. రంజిత్‌రెడ్డి రంగారెడ్డి జిల్లాకు చిర సుపరిచితుడు. శాయశక్తులా పనిచేస్తాం, రంజిత్‌రెడ్డిని గెలిపిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాం. చేవెళ్ల గెలుపుని ప్రతీ టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త ఛాలెంజ్‌గా తీసుకోవాలి.
- అరెకపూడి గాంధీ,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే

ద్రోహికి గుణపాఠం చెబుతాం
చేవెళ్ల లోక్‌సభకు ఐదేండ్లు కొనసాగిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఏ ఒక గ్రామానికి నిధులు ఇవ్వాలేదు. ఒక సర్పంచ్‌కు కూడా ఎంపీ నిధులు ఇవ్వలేదు. ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ను వీడి పార్టీని మోసం చేశాడు. ఐదేండ్లు పనిచేసిన ఎవ్వరికీ ఉపయోగపడలేదు. పార్టీకి ద్రోహం చేసిన విశ్వేశ్వర్‌రెడ్డికి గుణపాఠం చెప్పాలి.
- కాలె యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే

చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తాం
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తన స్వార్థంతో పార్టీని వదిలివెళ్లిపోయారు. ఈ 15 రోజులు కష్టపడి చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తాం. 16 ఎంపీలు గెలిచి ఢిల్లీలో మన సత్తా ఎంటో చూపించాలి. ఎమ్మెల్యేల ఎన్నికల కంటే రెట్టింపు స్థాయిలో పనిచేసి గ్రామాల వారీగా మెజార్టీ చూపిస్తాం. అత్యధిక మెజర్టీతో గెలిచి కేంద్ర నిధులు అత్యధికంగా తెచ్చుకోవాలి.
- కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే

కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ద్రోహులకు వేసినట్లే..
కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ద్రోహులకు వేసినట్లే. జనహోరు చూస్తుంటే గెలుపు తధ్యం. రంజిత్‌రెడ్డికి ఓటేస్తే.. తెలంగాణకు ఓటేసినట్లే. రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తాం. వికారాబాద్‌కు అత్యధిక నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేసుకుంటాం.
- మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

రంజిత్‌రెడ్డికి ప్రజల సంపూర్ణ మద్దతు
రంజిత్‌రెడ్డికి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది. ప్రజలంతా కారు గుర్తుకు ఓటేసి రేపు ఢిల్లీ వాళ్ల దిమ్మతిరిగే మెజార్టీ ఇవ్వాలి. పారిశ్రామిక వేత్త, విద్యవేత్త అయిన రంజిత్‌రెడ్డిని గెలిపించుకుంటాం. నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి.
- తీగల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ ద్రోహి కొండాకు బుద్ధి చెప్పాలి
తెలంగాణ ద్రోహి కొండాకు గుణపాఠం చెప్పాలి. రంజిత్‌రెడ్డి స్థానికుడే.. గత ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి ఎవ్వరిని పట్టించుకోలేదన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డికి అవకాశం ఇస్తే విశ్వాస ఘాతకుడిగా మారి, పార్టీ మారి తెలంగాణకు ద్రోహం చేశాడు. రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి, చేవెళ్ల సత్తా చాటాలన్నారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
- పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, టీఆర్‌ఎస్ యువనేత

రంజిత్‌రెడ్డికి మద్దతు తెలుపుతూ బుడగజంగాల సంఘం ఏకగ్రీవ తీర్మానం
శంషాబాద్, మార్చి 25 : రాష్ట్రంలో బుడగ జంగాల(బేడ)కు ఆత్మగౌరవ గుర్తింపు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కే పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సోమవారం శంషాబాద్‌లో జరిగిన రాష్ట్ర బుడగ జంగాల సంఘం సమావేశంలో ఏకగ్రీవతీర్మానం చేశారు. సంఘం వ్యవస్థ్ధాపక అధ్యక్షుడు చింతల రాజలింగం, రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి హన్మంత్, ప్రధాన కార్యదర్శి చింతల యాదగిరి, గ్రేటర్ యూత్ అధ్యక్షుడు చదువుల రామస్వామి, ఉపాధ్యక్షుడు సదానందం తదితరులు పాల్గొని చేవెళ్ల టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి మద్దతు తెలుపుతూ టీఆర్‌ఎస్‌కే ఓటువేసి గెలిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా చింతల రాజలింగం మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు తమను గుర్తింలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సముచిత స్థానాలతో రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారతతో పాటు ఉద్యోగ, ఉపాధి, రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం జరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్, జంగస్వామి, రాంచందర్, కె.ఎం.రాజు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.

431

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles