ప్రశాంతమైన పోలింగ్‌కు భారీ బందోబస్తు


Tue,March 26, 2019 02:35 AM

- సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా
- 2018 ఎన్నికల ఉల్లంఘనలపై వేగవంతంగా చార్జీషీట్లు..
- 20 రోజుల్లో 3.50 కోట్ల నగదు స్వాధీనం..
- 45 ప్రత్యేక బృందాలతో నిరంతరం తనిఖీలు


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతం నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాంతాల్లో 12 వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. సోమవారం బషీర్‌బాగ్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఓటర్లకు, ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన పలు పోలీస్‌స్టేషన్లను తమ పరిధిలో ఉండడంతో సరిహద్దు కమిషనరేట్ అధికారుల సమన్వయంతో భద్రత చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నోడల్ అధికారులను నియమించి ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు జరుగకుండా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రచారం సమయంలో అన్ని ర్యాలీలు, సమావేశాలు, సభలను పూర్తిగా వీడియో రికార్డింగ్‌లో బంధిస్తున్నామన్నారు. మార్చి 18 నుంచి ప్రారంభమైన ఎన్నికల కోడ్ ప్రకారం ఇప్పటి వరకు నిర్వహించిన ప్రత్యేక పోలీస్ డ్రైవ్‌లో 3.50 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికల సందర్భంగా పోలీస్ అధికారులు అవలంబించాల్సిన నియమ నిబంధనలపై ఇప్పటి వరకు 9700 మంది పోలీసు అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను ఇప్పటికే విశ్లేషించుకొని ఇందుకు అనుగుణంగా పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలీస్, ఇతర శాఖల అధికారులతో మొత్తం 45 స్టాటిక్ సర్వేలెన్స్, ైఫ్లెయింగ్ స్క్వాడ్స్ బృందాలను రంగంలోకి దింపామన్నారు. 1602 ప్రాంతాల్లో 4020 పోలింగ్ స్టేషన్లు ఉండగా 440 ప్రాంతాల్లోని 1340 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకమైనవి గుర్తించామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల పోలింగ్ స్టేషన్లను సీనియర్ అధికారులతో పాటు డీసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని అంజనీకుమార్ చెప్పారు. లైసెన్స్ కలిగి ఉన్న 4400 తుపాకులను డిపాజిట్ అయ్యాయని, 5074 రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అల్లరి మూకలను బైండోవర్ చేశామన్నారు. ఇక 2018 ఎన్నికలకు సంబంధించి మొత్తం 194 కేసులను నమోదు చేయగా, ఇందులో 154 కేసులకు సంబంధించి చార్జీషీటులను దాఖలు చేశామని చెప్పారు. సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్‌కు సంబంధించిన కేసులో కోర్డు రెండ్రోజుల జైలు శిక్షను కూడా విధించిందని సీపీ చెప్పారు.

408

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles