ఉనికి కోసం ఆరాటమే..!

Tue,March 26, 2019 02:34 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వరుస ఓటములతో డీలాపడిన నగర కాంగ్రెస్, బీజేపీ తాజాగా పార్లమెంటు ఎన్నికల్లో ఉనికి కాపాడుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తుంది. గెలుపు గుర్రా లు లేక శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థులనే తిరిగి పార్లమెంటుకు నిలిపి ఒంటరిపోరుకు సిద్ధమైంది. క్షేత్రస్థాయిలో కనీసం కార్పొరేటర్లు, కార్యకర్తల బలం కూడా కరువవడంతో అభ్యర్థులు తమకుతామే ఓటర్లకు పరిచయం చేసుకుంటూ ప్రచారంలో ముం దుకు సాగుతున్నారు.

గ్రేటర్‌లోని హైదరాబాద్, మల్కాజిగిరి తదితర రెండు స్థానాల్లో ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులనే కాంగ్రెస్ పార్టీ పోటీకి నిలిపింది. కాగా, సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రితంసారి ఓటమిపాలైన ఆ పార్టీ నగరాధ్యక్షుడిని మరోసారి పోటీకి నిలిపడం విశేషం. హైదరాబాద్ నుంచి పోటీచేస్తున్న ఫిరోజ్‌ఖాన్ గత శాసనసభ ఎన్నికల్లో నాంపల్లి స్థానం నుంచి, అలాగే మల్కాజిగిరి నుంచి పోటీకి దిగిన రేవంత్‌రెడ్డి కొడంగల్ నుంచి ఓటమిపాలు కాగా, అంజన్‌కుమార్ యాదవ్ తనయుడు ముషీరాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. పార్టీకి గెలుపు అభ్యర్థులు దొరకకపోవడం, సీనియర్లుగా పేర్కొనే పలువురు నాయకులు పోటీకి ఆసక్తి చూపకపోవడంతో ఓడిన అభ్యర్థులనే నిలపాల్సిన అనివార్య పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడింది. కాంగ్రెస్ 2014 శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవకపోగా అనంతరం 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను చావుదప్పి కన్ను లొట్టబోయిన చందంగా కేవలం రెండు డివిజన్లలో మాత్రమే విజయం సాధించిన విషయం విదితమే. ఆ తరువాత ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. అటు దేశం లో, ఇటు రాష్ట్రంలో దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు రెండు దఫాలుగా నగరం నుంచి శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవడం, స్థానిక సంస్థలో సైతం నామమాత్రంగా ఇద్దరు సభ్యులు మాత్రమే ఉండడంతో క్రమంగా నేతలతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీకి దూరమయ్యారు.

ఈ నేపథ్యంలో, ఓ జాతీయపార్టీగా కాంగ్రెస్ ఎన్నికల బరిలో పరువు కాపాడుకునేందుకు తంటాలు పడుతుంది. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అంతా అధికరపార్టీకి చెందినవారే కావడంతో చాలాచోట్ల గల్లీ నేతలు కూడా ఆ పార్టీకి మిగలలేదు. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల ప్రచారం నేతలు, కార్యకర్తలు లేక కళతప్పింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆ పార్టీ ప్రభావం క్రమంగా మసకబారుతూ రాగా, ఆ పార్టీకున్న సాంప్రదాయ ఓటు బ్యాంకు సైతం పూర్తిగా గండిపడినట్లు గత శాసనసభ ఎన్నికల్లో స్పష్టమైపోయింది. ఆశలన్నీ అడియాశలైన వేళ తాజా ఎన్నికల్లో కనీసం ఉనికైనా నిలుపుకునేందుకు ఆ పార్టీ రంగంలోకి దిగింది. పార్టీ అగ్రనేతలు సహా జాతీయనేతలంతా తమ గెలుపు కోసం సొంత నియోజకవర్గాల్లో ప్రచారంలో బిజీ కావడంతో వారు రాష్ట్రంలో వారి పర్యటనలు కూడా నామమాత్రంగానే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్, దాని మిత్రపక్షమైన మజ్లీస్ నగరంపై పూర్తిస్థాయిలో పట్టుసాధించడంతో మిగిలిన పార్టీలు దాదాపు కనుమరుగైనట్లు చెప్పవచ్చు. టీడీపీ ఈసారి పోటీకి దూరంగా ఉండగా, బీజేపీ సైతం అభ్యర్థులు లేక శాసనసభ ఎన్నికల ఓటమి అభ్యర్థులనే బరిలో నిలిపింది. ఇక వామపక్షాల ప్రభావం నగరంపై ఏనాడూ లేదని చెప్పకతప్పదు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో నామమాత్ర ఓట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ సైతం ఈసారి ఉనికి కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. ప్రచారం సం దర్భంగా ఆ పార్టీ అభ్యర్థులకు ఓటర్ల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు, వరుస విజయాలతో దూకుడు మీదున్న టీఆర్‌ఎస్ రెట్టించిన ఉత్సాహంతో విజయంపై ధీమాతో ఉన్నది. ఓటరు మహాశయుడు ఎవరిని కరుణిస్తాడో, ఈసారైనా కాంగ్రెస్ పరువు దక్కుతుందేమో వేచిచూడాల్సిందే.

101

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles