పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకోవాలి

Tue,March 26, 2019 02:34 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎన్నికలు విధులు నిర్వహించే సిబ్బంది అందరూ విధిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) ఎం. దానకిశోర్ విజ్ఞప్తిచేశారు. సుమారు 21వేల మంది ఎన్నికల సిబ్బందికిగాను ఇప్పటివరకు కేవలం నాలుగు వేలమంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల సిబ్బంది నియామకం, పోస్టల్ బ్యాలెట్ వినియోగం తదితర అంశాలపై సోమవారం దానకిశోర్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన ఫారం-12, 12ఏలను శిక్షణ సందర్భంగా సిబ్బందికి అందజేసినట్లు, అంతేకాకుండా డీఆర్సీ సెంటర్ల వద్ద ఫెసిలిటేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి..
మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌టీయూ ఫైన్‌ఆర్ట్స్ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఓటుహక్కు అవగాహన కార్యక్రమంలో కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తోడ్పడాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన మన దేశంలో యువత తప్పనిసరిగా ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సీ-విజిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అక్రమాలపై ఫిర్యాదుచేయాలని తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 1,50,000 మంది కొత్తగా ఓటుహక్కు పొందినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల వినియోగం, సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేసే విధానం తదితర అంశాలపై ఎన్నికల సిబ్బంది కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.

103

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles