గుర్రపు డెక్క.. తొలగింపు సులభమిక..

Sun,March 24, 2019 02:30 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గుర్రపు డెక్క.. చెరువులు, జలాశయాలను పట్టిపీడిస్తున్న జఠిలమైన సమస్య. ఇలాంటి సమస్యను సులభంగా పరిష్కరించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ప్లోటింగ్ ట్రాష్ కలెక్టర్లను రంగంలోకి దించుతున్నారు. హుస్సేన్‌సాగర్ తరహాలో హెచ్‌ఎండీఏ పరిధిలోని నాలుగు చెరువుల శుద్ధికి వీటిని ఉపయోగించబోతున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడ గ్రామంలోని చందన్‌చెరువు, మీర్‌పేట గ్రామంలోని మంచెర్యాల్ తలాబ్, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కీసరమండలంలోని రాంపల్లి లేక్, నాగారం గ్రామంలోని అన్నరాయుని చెరువుల్లో గుర్రపుడెక్కను తొలగించేందుకు ట్రాష్ కలెక్టర్లను వినియోగించబోతున్నారు. ఇందుకు గాను ముంబైలోని క్లీన్‌టెక్ ఇన్‌ఫ్రా సంస్థ ద్వారా రూ. 3 కోట్లు వెచ్చించి, 2 ట్రాష్ కలెక్టర్లను కొనుగోలు చేశారు. ఈ కలెక్టర్లు శుక్రవారం నగరానికి చేరుకోగా, వీటిని సరూర్‌నగర్ మండలంలోని జిల్లెలగూడ చందన్‌చెరువులో గుర్రపుడెక్కను తొలగించేందుకు వీలుగా అక్కడికి చేర్చారు. రెండు మాసాల్లోగా ఈ నాలుగు చెరువుల్లోని గుర్రపుడెక్కను పూర్తిగా తొలగించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందు ట్రాష్ కలెక్టర్లను హుస్సేన్‌సాగర్ శుద్ధి కోసం వినియోగించారు. 2016 నుంచి హుస్సేన్‌సాగర్‌లో ట్రాష్ కలెక్టర్ల ద్వారా గుర్రపుడెక్కను సులభంగా తొలగిస్తున్నారు. ఈ ప్రయోగం సత్ఫతాలివ్వడంతో పాటు, సాగర్‌లో పేరుకుపోయిన గుర్రపుడెక్కను విజయవంతంగా తొలగిస్తున్నారు. ఇదే తరహాలో గ్రేటర్‌లోని మరికొన్ని చెరువుల్లోనూ గుర్రపుడెక్కను తొలగించాలని నిర్ణయించిన హెచ్‌ఎండీఏ అధికారులు, ముంబై నుంచి కొనుగోలు చేసి, రంగంలోకి దించబోతున్నారు.

ట్రాష్ కలెక్టర్ల ప్రత్యేకతలివి..
- 12 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు వరకు గుర్రపుడెక్కను ఒకే సారి తొలగించవచ్చు.
- తొలగించిన చెత్తను ట్రాష్ కలెక్టర్‌లోనే స్టోర్ చేసుకోవచ్చు.
- 5 టన్నుల వరకు గుర్రపు డెక్కను స్టోర్ చేసుకోగలదు.
- తెడ్డు చక్రాల ద్వారా నీటిపై తేలుతూ ముందుకు పోగలదు.
- నాలుగు యాంకర్ లెగ్స్ ద్వారా సులభంగా కదలగలదు.

303

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles