కార్టూనిస్ట్‌గా ఆయనది ప్రత్యేక శైలి


Sun,March 24, 2019 02:27 AM

నమస్తే తెలంగాణ, సిటీబ్యూరో: కార్టూనిస్ట్‌గా, రాజకీయ పరమైన వ్యంగ్య చిత్రకారుడిగా నర్సిమ్‌ది ప్రత్యేకమైన శైలి అని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అన్నారు. ప్రముఖ కార్టూనిస్ట్ నర్సిమ్ తన 35 ఏండ్ల కార్టూనింగ్ వృత్తిలోని అద్భుతమైన కార్టూన్స్‌ను, చిత్రకళా ఖండాలను ఏరి కూర్చి ఐవిట్నెస్ ఆఫ్ యాన్ ఎపాక్ పేర లక్డీకాపూల్ రవీంద్రభారతిలోని ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీ - కళాభవన్‌లో శనివారం ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సదర్భంగా బీఎస్ రాములు మాట్లాడుతూ ... కేరికేచర్స్‌ని, కార్టూన్స్‌ను తనదైన శైలిలో ఆవిష్కరిస్తూ, సరికొత్త వ్యక్తిత్వాన్ని మన కండ్లకు కట్టినట్టుగా చూపించడంలో చిత్రకారుడు నర్సిమ్‌ది ప్రత్యేకమైన శైలి అన్నారు. 35 ఏండ్ల సర్వీసులో పదివేలకు పైగా కార్టూన్లను వేయడం గర్వించదగిన విషయమని కొనియాడారు. ఒక పెద్ద వ్యాసం కన్నా, ఒక ప్రముఖ రచన కన్నా ఒక కార్టూన్ ఎంతో ఉన్నతమైనదన్నారు. అనంతరం, అల్లం నారాయణ మాట్లాడుతూ.. నర్సిం నల్గొండ ప్రాంతం నుంచి వచ్చారని, ఇంకా శంకర్, శేఖర్, శ్రీధర్, ఏలె లక్ష్మణ్ లాంటి ఎందరో అదే జిల్లా నుంచి వచ్చి తమదైన ప్రత్యేక ముద్రను చిత్రకళా రంగంలో వేశారన్నారు. కళాకారులుగా, తెలంగాణ బిడ్డలుగా వీరంతా ఒకే భావజాలంతో ఉన్నారని తెలిపారు.


శంకర్ అంతర్జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం శుభపరిణామమన్నారు. అంతే స్థాయిలో నర్సిం కూడా భావ సారూప్యతతో, వృత్తి పట్ల నిబద్ధతతో ఉన్నారని పేర్కొన్నారు. నమస్తే తెలంగాణ దినపత్రిక సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. నర్సిమ్ ప్రాపంచిక విషయాలపై ప్రత్యేకంగా పట్టున్నవారని, తనదైన భావజాలంతో కార్టూనిస్ట్‌గా రాణిస్తున్నాడన్నారు. ఇలాగే మరింత కాలం రాణించాలని చెప్పారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రాంతాలు, ఆయా రంగాల్లో కళాకారులందరినీ ఆదరిస్తూ, ఎంతగానో ప్రోత్సహిస్తున్నదన్నారు. 150 నుంచి 200 వరకు ప్రత్యేకంగా ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శనకు పెట్టినట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రఖ్యాత పాత్రికేయులు, పలు తెలుగు దిన పత్రికల వ్యవస్థాపక సంపాదకులు ఏబీకే ప్రసాద్, తెలంగాణ టుడే సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి, నవ తెలంగాణ సంపాదకులు ఎస్.వీరయ్య, ప్రఖ్యాత చిత్రకారుడు, జాతీయ అవార్డు గ్రహీత పి.సుదర్శన్ మాట్లాడుతూ నర్సిమ్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో సాక్షి దిన పత్రిక కార్టూనిస్ట్ శంకర్, నమస్తే తెలంగాణ కార్టూనిస్ట్ మృత్యుంజయ, ఆంధ్రజ్యోతి ఆర్టిస్ట్ కత్తుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 27 వరకు కొనసాగునుందని తెలిపారు.

362

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles