సర్వాంగ సుందరంగా మీరాలం


Sat,March 23, 2019 03:04 AM

సిటీబ్యూరో/బండ్లగూడ/చార్మినార్, నమస్తే తెలంగాణ : పాతబస్తీలో మరో మేజర్ పార్కు అందుబాటులోకి వచ్చింది. మీరాలం ట్యాంకు వద్ద చింతల్‌మెట్ వైపు రూ.2.51కోట్లతో ఏర్పాటు చేసిన ఈ పార్కు(మీరాలం పార్కు)ను శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ప్రారంభించనున్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పాత నగరానికి సంబంధించి చార్మినార్ జోన్‌లో ఇంతకాలం ఇమ్లీబన్ పార్కు మేజర్ పార్కు కాగా, దాని తరువాత మీరాలం పార్కే అతిపెద్దదిగా చెప్పవచ్చు. దీన్ని రూ. 6.5 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు. లైటింగ్, దక్కన్ శైలి పెయింటింగ్స్, ఓపెన్ జిమ్, పిల్లల ఆట వస్తువులు, ఫౌంటేన్‌లు, మినీ సైన్స్ పార్కు, దక్కన్ శైలి శిల్పాలు, చిత్రాలు ఈ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పార్కు ప్రవేశ ద్వారంలోనే దక్కన్ శైలి శిల్పాలు, చిత్రాలతో కూడిన ఎంట్రీ ప్లాజాను నిర్మించారు. అంతేకాదు, పార్కులో 8 మీటర్ల వెడల్పుతో 6.8 కి.మీ.ల పొడవైన వాకింగ్ ట్రాక్‌ను నిర్మించడం మరో విశేషం.


ప్రత్యేక డిజైన్లు..
పార్కులో చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులను ఏర్పాటు చేయడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ఆదరణ గల పచ్చీసు ఆట, చెస్ ఆట మాదిరి నమూనాలను అభివృద్ధి చేశారు. పంచతత్వ వాకింగ్ ట్రాక్ మరో ఆకర్షణగా మారింది. మీరాలం ట్యాంకు జూ పార్కు వైపున గల ప్రధాన గేట్ వద్ద పెద్దఎత్తున పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలు, చెత్తను పూర్తిగా తొలగించి పార్కు చుట్టూ మొక్కలు నాటడంతోపాటు పార్కులో ప్రత్యేకంగా ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేశారు. మొదలు మీరాలం చెరువు కట్టను పటిష్ట పరిచిన అధికారులు అనంతరం చెరువు చుట్టూ ఫెన్సింగ్, పాత్-వే, లైటింగ్, పచ్చదనం, సుందరీకరణ తదితర పనులు చేశారు.

చారిత్రక నేపథ్యం..
హైదరాబాద్-బెంగళూరు మార్గంలోని నెహ్రూ జూపార్కు వద్ద మీర్ ఆలం అనే ట్యాంకు ఉంది. హుస్సేన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు నిర్మించక ముందే నగరానికి ఈ సరస్సు ద్వారా మంచినీరు సరఫరా చేసినట్లు చరిత్ర చెబుతున్నది. మూడవ నిజాం మీర్ అక్బర్ అలీఖాన్ సికందర్ జాహ్ ఆసిఫ్ జాహ్ హయాంలో హైదరాబాద్ స్టేట్‌కు అప్పట్లో ప్రధాన మంత్రిగా వ్యవహరించిన మీర్ ఆలం బహదూర్ 1804లో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి రెండేండ్లు పట్టినట్లు, టిప్పు సుల్తాన్‌ని ఓడించిన అనంతరం మీర్‌ఆలం శ్రీరంగపట్నం నుంచి తెచ్చిన ఖజానాతో ఈ సరస్సును నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

నేడే ప్రారంభం
అన్ని హంగులతో ముస్తాబైన మీరాలం లేక్‌వ్యూ పార్క్‌ను శనివారం సాయంత్రం 3 గంటలకు ప్రారంభించనున్నట్లు రాజేంద్రనగర్ ఉపకమిషనర్ ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శైలేంద్రకుమార్ జోషి, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్, అదనపు కమిషనర్ లేక్స్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ దాసరి హరిచందన, చార్మినార్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ డి.శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు.

అన్ని వసతులను పూర్తి చేశాం
మీరాలం లేక్‌వ్యూ పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పార్కుకు వచ్చే వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తాం. పచ్చిక బైళ్లు, రంగురంగుల పూల మొక్కలు, గోడలపై తెలంగాణ సంస్కృతిక సాంప్రదయాల చిత్రాలు, టాయ్‌లెట్స్, వాకర్లకు అనుగుణంగా రోడ్లు, పౌంటేన్స్ వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నాం.
- ప్రదీప్‌కుమార్, రాజేంద్రనగర్ డీసీ

538

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles