ఓటరు నమోదుపై ప్రత్యేక ప్రచారం


Fri,January 18, 2019 12:11 AM

మేడ్చల్ రూరల్ : జిల్లాలో 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కుకు అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఆయన నూతన ఓటర్ల నమోదు, ఓటరు జాబితా సవరణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో ద్వారా ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20, 23, 24, 25 తేదీల్లో నిర్వహించే స్పెషల్ క్యాంపెయిన్‌లో 2019, జవనరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి పౌరుడికి ఫారం 6 అందజేసి, ఓటరుగా నమోదు చేయాలన్నారు. ఆ రోజుల్లో ఫారం 6, 7, 8, 8ఏలతో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో ఉండి, వచ్చిన దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు.


25వ తేదీ వరకు ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు, తొలగింపు, చిరునామా మార్పు, తప్పుల సవరణ తదితర కార్యక్రమాలను పూర్తి చేసి, ఖచ్చితమైన ఓటరు జాబితాను రూపొందించాలన్నారు. బీఎల్‌ఓలు ఇంటింటి వెళ్లి పరిశీలన నిర్వహించే సమయంలో తమతో తప్పనిసరిగా మార్కుడ్ ఓటర్ జాబితా, బీఎల్‌ఓ రిజిష్ర్టర్, తొలగింపు జాబితా, 6, 7, 8, 8ఏ ఫారాలను తీసుకెళ్లాలన్నారు. ఏఈఆర్‌ఓలు తమ బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లతో వెంటనే సమావేశం నిర్వహించి, ఈ విషయంపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఎప్పటికప్పుడు బీఎల్‌ఓ రిజిష్టర్‌ను తనిఖీ చేయాలని, వారి పరిధిలోని డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు, పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కళాశాలలు, మాల్స్‌లలో నూతన ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరించడానికి ప్రత్యేక డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఏఈఆర్‌ఓ కార్యాలయంలో ఓటరు జాబితాలో పేర్లు పరిశీలన, నూతన ఓటరు నమోదు, ఇతర సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో విజయకుమారి, డీఆర్‌డీవో కౌటిల్యా, అధికారులు పాల్గొన్నారు.

460

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles