ఇంట్లోకి చొరబడి... వృద్ధురాలిపై దాడి


Mon,January 14, 2019 01:01 AM

మన్సూరాబాద్ : ఎవరూ లేని సమయంలో ఓ అగంతకుడు ముఖానికి మాస్క్ వేసుకుని ఇంట్లోకి చొరబడి... వృద్ధురాలిపై దాడిచేసి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దోచుకెళ్లారు. అగంతకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం... నాగోల్ డివిజన్, రాక్ స్వర్ణలత (72) కొడుకు రవికాంత్, కోడలు శ్వేతతో కలిసి ఉంటుంది. ఆదివారం ఉదయం ఉద్యోగ నిమిత్తం రవికాంత్, శ్వేతలు బయటకు వెళ్లారు. స్వర్ణలత సాయంత్రం సమయంలో వాకింగ్ వెళ్లి... సుమారు 6:30 గంటలకు ఇంటికి చేరుకుంది. వాకింగ్ చేస్తుండగానే ఆమెను వెంబడించిన అగంతకుడు ముఖానికి మాస్క్ వేసుకుని ఇంట్లోకి చొరపడి ముందుగా గడియ పెట్టాడు. ఒక్క ఉదుటున వృద్ధురాలిపై దాడి చేసి ముఖంపై, కండ్లపై పిడిగుద్దులు గుద్దడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.


వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు, ఆమె చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు సుమారు తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, ఇంట్లోని విలువైన వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లి పోయాడు. తీవ్రం గా గాయపడిన వృద్ధురాలు రక్తపు మడుగులోనే పడి ఫోన్ ద్వారా కోడలు శ్వేతకు సమాచారం ఇచ్చింది. కోడలు శ్వేత 100 కు డయల్ చేయడంతో అక్కడి చేరుకున్న ఎల్బీనగర్ పోలీసులు వృద్ధురాలిని చికిత్స నిమిత్తం రాక్ పవన్ దవాఖానకు తీసుకెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉంటున్న విషయాన్ని ముందు నుంచే గమనించిన అగంతకుడు ప్లాన్ ప్రకారం దాడి చేసి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న రాచకొండ క్రైమ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

444

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles