లేనోళ్లకే..ఇండ్లు..

Sun,January 13, 2019 12:19 AM

-నిరుపేదలకు డబుల్ బెడ్
-పదిశాతం స్థానికులకు, మూడు శాతం దివ్యాంగులకు..
-త్వరలో మార్గదర్శకాలు ..?
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలోని పేదల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ గృహాలను ఇండ్లులేని నిరుపేదలకు కేటాయించనున్నారు. అలాగే స్థానికంగా నివసించే వారికి పదిశాతం, దివ్యాంగులకు మూడు శాతం పంపిణీ చేయనున్నారు. మిగిలిన ఇండ్లను నాలాలు, రోడ్ల వెంట నివసిస్తున్న వారికి ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో మార్గదర్శకాలు వెలువడే అవకాశమున్నది. జీహెచ్ పేదల కోసం మొదటి దశలో భాగంగా రూ. 8,598.58 కోట్ల అంచనా వ్యయంతో 117 ప్రాంతాల్లో ఒక లక్ష డబుల్ బెడ్ ఇండ్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 49 ప్రాంతాల్లో 9,828 గృహాలను ఇన్ గుడిసెలు తొలిగించి అపార్ట్ నిర్మాణం) పద్ధతిలో నిర్మిస్తుండగా, 68 ప్రాంతాల్లో ఖాళీ జాగాల్లో 90,172 ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు సింఘం చెరువు తండా, గాజులరామారం, అమీన్ జమ్మిగడ్డ, ఖిడికీ బూత్ అలీషా, సయద్ సాబ్ కా బాడా తదితర ఆరు ప్రాంతాల్లో 612 ఇండ్లు పూర్తయ్యాయి. ఇందులో సింఘం చెరువు తండాలో ఇప్పటికే లబ్ధిదారులకు
గృహాలను అందజేశారు.

ఇక్కడ ఇన్ విధానంలో నిర్మించినందున కేటాయింపు సాఫీగా సాగిపోయింది. ఇన్ విధానంలో ఎక్కడి వారికి అక్కడే ఇండ్లను నిర్మిస్తారు కాబట్టి లబ్ధిదారుల ఎంపిక ముందే పూర్తవుతుంది. కాగా, ఖాళీ జాగాల్లో నిర్మిస్తున్న గృహాలకు పోటీ అధికంగా ఉన్నందున లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం కాలనీలు నిర్మిస్తున్న ఆయా ప్రాంతాల్లోని నిరుపేదలకు పదిశాతం ఇండ్లను రిజర్వు చేస్తారు. అలాగే, లబ్ధిదారుల్లో మూడు శాతం దివ్యాంగులకు కేటాయిస్తారు. దివ్యాంగులకు గ్రౌండ్ లేక మొదటి అంతస్తులో ఇండ్లను కేటాయించాలని నిర్ణయించారు. ఇవిపోగా మిగిలిన గృహాలను ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇండ్లు లేనివారికి కేటాయిస్తారు. ముఖ్యంగా నాలాలు, రోడ్ల వెంట నివసిస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. నాలాలపై నివాసాల కారణంగా నగరంలో ముంపు సమస్య తలెత్తుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

దాదాపు 20వేల కుటుంబాలు ఇలా నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్య ఏటా పెరుగుతూ పోతున్నది. దాదాపు దశాబ్దకాలంగా కబ్జాల తొలిగింపు ప్రయత్నం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నించకపోవడంతో నాలాలపై నివసిస్తున్న వారు ఖాళీ చేసేందుకు ససేమిరా అన్నారు. తాజాగా ప్రభుత్వం వారికి డబుల్ బెడ్ ఇండ్లను కేటాయించాలని నిర్ణయించింది. ఇప్పటికే అధికారులు నాలాలు, రోడ్లపై నివసిస్తున్న వారిని గుర్తించి వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం నిర్వహించారు. లక్ష గృహాల్లో వీరికి మొదటి ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. వీరికి కేటాయించడం వల్ల ఇండ్లు లేని నిరుపేదలకు గృహాలను ఇవ్వడంతో పాటే దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న నాలాల విస్తరణ కార్యక్రమానికి కూడా మోక్షం లభిస్తుందనేది అధికారుల భావన. అయితే, ఇండ్ల కేటాయింపుపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

326

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles