గృహ సంకల్పం


Sat,January 12, 2019 12:47 AM

-మూడు నెలల్లో బోజగుట్ట ‘డబుల్ బెడ్
-మొదటి విడుతలో 264 ఇండ్లు
-మరో మూడు మాసాల్లో 248..
-చకచకా సాగుతున్న నిర్మాణాలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : బోజగుట్టలో డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణం చకచకా సాగుతున్నది. వచ్చే మూడు నెలల్లో 264 ఇండ్లు సిద్ధం కానున్నాయి. తదుపరి మూడు నెలలకు మరో 248 ఇండ్లు పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతేకాదు, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మిగిలిన లబ్ధిదారులను కూడా వెంటనే ఖాళీ చేయించి ఇండ్లను నిర్మించాలని సంకల్పించారు. దీనికోసం ఈనెల 22న బల్దియా, రెవెన్యూ, పోలీస్ తదితర విభాగాల అధికారులు బోజగుట్టపై సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రెవెన్యూ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం నాంపల్లి నియోజకవర్గం, గుడిమల్కాపూర్ డివిజన్ పరిధిలోని బోజగుట్టలో సుమారు 13 ఎకరాల ప్రభుత్వ స్థలంలో శివాజీనగర్ (564 కుటుంబాలు), శ్రీరాంనగర్ (398), వివేకానందనగర్ (730) కలిపి మొత్తం 1,692 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికోసం రూ.141కోట్ల వ్యయంతో 1,824 డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించేందుకు జీహెచ్ అధికారులు టెండర్లు ఖరారు చేశారు. అయితే ఇందులో 512 కుటుంబాలు మాత్రమే ఇండ్లను ఖాళీ చేయడంతో వారికోసం ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇందులో 264 ఇండ్లు తుది దశకు చేరుకోగా, వచ్చే మూడు నెలల్లో సిద్ధం చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

మిగిలిన 248 గృహాలను వచ్చే ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సంకల్పించారు. గుట్టలు, రాళ్లు, కొన్ని గుడిసెలు అడ్డుగా ఉండడంతో మెటీరియల్ తీసుకొచ్చేందుకు ఇబ్బంది అవుతున్నట్లు, అందుకే ఇండ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, మిగిలిన వారు ఖాళీ చేసేందుకు ఒప్పుకోకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ వారికి ఫలితం దక్కలేదు. బాధితులకు పునరావాసం కల్పించి ఇండ్లను ఖాళీ చేయించడంతోపాటు నిర్మాణ పనులు చేపట్టేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అధికారులు బాధితులను అమీన్ రామేశ్వరం బండ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న జేఎన్ గృహాలకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు వారిని జేఎన్ గృహాల కాలనీలకు తీసుకెళ్లి చూపించారు. అయినా వారు అక్కడికి వెళ్లేందుకు ఒప్పుకోవడంలేదు. అందరూ ఖాళీ చేస్తే 1,824 గృహాలతో మూడంతస్తుల అపార్ట్ ట్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ కొం దరు ఖాళీ చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. ఓ వైపు డబుల్ బెడ్ గృహాలకు ఒప్పుకొని తమ ఇండ్లను ఖాళీ చేసిన లబ్ధిదారులు... త్వరగా తమకు ఇం డ్లను అందించాలని కోరుతుండగా, మిగిలినవారు డబుల్ బెడ్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో బోజగుట్ట ఆక్రమణదారులు రెండు వర్గాలుగా విడిపోయారు

త్వరగా పూర్తి చేయాలని లబ్ధిదారుల వినతి

నిర్మాణం చేపట్టిన ఇండ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి తమను ఆదుకోవాలని కోరుతూ వివేకానందనగర్ బస్తీవాసులు శుక్రవారం జీహెచ్ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. తాము అద్దెలు చెల్లించలేక పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో నివసిస్తున్నామన్నారు. విష పురుగులబారిన పడే ప్రమాదముందని, అందుకే వెంటనే తమకు ఇండ్లను పూర్తి చేసి ఇవ్వాలని వారు కోరారు. ఈ మేరకు బాధితులు బల్దియా చీఫ్ ఇంజినీర్ సురేశ్ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఖాళీ చేయకుండా ఉన్నవారిని కూడా కోర్టు ఆదేశాల ప్రకారం ఖాళీ చేయించి ఇండ్ల నిర్మాణం చేపట్టాలని వారు కోరారు. వచ్చే మూడు నెలల్లో 264ఇండ్లను సిద్ధం చేస్తామని, మిగిలినవి వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా సురేశ్ వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా పండుగ అనంతరం ఈనెల 22న రెవెన్యూ, టౌన్ పోలీసు అధికారులతో కలిసి బోజగుట్ట బాధితులతో సమావేశం నిర్వహించి అక్కడి సమస్యలన్నీ పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

589

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles