అరవై ఏండ్ల ఆత్మీయ సమ్మేళనం

Sat,January 12, 2019 12:41 AM

-ఆనందోత్సాహాల మధ్య ప్రభుత్వ దంత వైద్య కళాశాల వజ్రోత్సవాలు
-దేశ, విదేశాల నుంచి విచ్చేసిన పూర్వ విద్యార్థులు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ‘ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం చదువులమ్మ చెట్టునీడలో..’ అంటూ దంత వైద్య కళాశాల పూర్వవిద్యార్థులు తమ అరవై ఏండ్ల ఆత్మీయ సమ్మేళనంలో పాలుపంచుకున్నారు. విద్యార్థి దశలోని మధుర జ్ఞాపకాలు.. చిలిపిచేష్టలు.. అధ్యాపకులతో ఉన్న అనుబంధాన్ని షష్టిపూర్తి కాలంపాటు మూటగట్టుకుని దేశ, విదేశాల నుంచి నగరంలోని ఉస్మానియా దవాఖాన పక్కన గల ప్రభుత్వ దంత వైద్యకళాశాలలో వాలిపోయారు. భౌతికంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మేమంతా హైదరాబాదీ విద్యార్థులమేనని నినదించారు. నగరంలోని ఉస్మానియా దవాఖానకు ఆనుకుని, మూసీనది ఒడ్డున ఉన్న ప్రభుత్వ దంత వైద్య కళాశాల ఆవిర్భవించి 60ఏండ్లు పూైర్తెన సందర్భంగా శుక్రవారం కళాశాల ఆవరణలో పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకుల మధ్య కళాశాల వజ్రోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా.రమేశ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.వెంకటేశ్వర్లు, అలుమ్ని అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంఈ డా.రమేశ్ మాట్లాడుతూ దంత వైద్య విద్యార్థుల అరవై ఏండ్ల అనుబంధాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైద్య రంగంలో చారిత్రాత్మక మార్పులు వచ్చాయని, ఒక్కమాటలో చెప్పాలంటే యావత్ దేశానికి తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఒక రోల్ నిలిచిందన్నారు. ప్రజారోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఇటీవల 20 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ దంత కళాశాల అలుమ్ని అసోసియేషన్ ఆర్గనైజింగ్ చైర్మన్ డా.ఎ.ఎస్.నారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎన్.వెంకటేశ్వర్లు, ఏఏజీడీసీహెచ్ అధ్యక్షుడు డా.చంద్రశేఖర్, కార్యదర్శి డా.నర్సింహ స్వామి, డా.చంద్రకాంత్ మాట్లాడుతూ తాము ఒక ఉన్నత స్థానంలో నిలబడేందుకు మూలాధారంగా నిలిచిన మాతృసంస్థ ప్రభుత్వ దంత కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. తమ వంతు కృషిగా ప్రతి సంవత్సరం ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో మెరిట్ సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ పూర్వ విద్యార్థుల సంఘం నుంచి అందజేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న డెంటల్ వైద్య శిబిరాలకు తమవంతు సహా య సహకారాలు అందిస్తామన్నారు. అసిస్టెంట్ పోస్టల్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ డెంటల్ కాలేజీకి సంబంధించిన పోస్టల్ కవర్ విడుదల చేశారు. వజ్రోత్సవాల్లో భాగం గా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పూర్వ అధ్యాపకులు, విద్యార్థులను ఘనంగా సన్మానించారు. విదేశాల నుంచి 60 మం ది, స్వదేశం నుంచి సుమారు వెయ్యి మంది పూర్వవిద్యార్థులు కళాశాల వజ్రోత్సవంలో పాల్గొని ఆత్మీయతను పంచుకున్నారు.

431

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles