తరగతులు ప్రారంభమైనా.. మెస్‌లు తెరువరా?


Fri,January 11, 2019 12:30 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అదో ప్రతిష్టాత్మక యూనివర్సిటీ.. అందులో సీటు సంపాదించేందుకు నెలల తరబడి పుస్తకాలతో కుస్తీలు.. తీరా సీటు పొందాక.. నిత్యం ఏదో ఒక ఇబ్బందే.. గచ్చిబౌలిలోని ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభమైనా.. మెస్‌లు తెరుచుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి విశ్వవిద్యాలయంలో తరగతులు మొదలయ్యాయి. పది రోజులు గడుస్తున్నా.. మెస్‌లు అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు భోజనం కోసం అవస్థలు పడుతున్నారు. క్యాంపస్ మొత్తంలో రెండు, మూడు మెస్‌లు మాత్రమే ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీకి దగ్గరలో ఏ హోటల్ లేకపోవడం, ఒకవేళ విద్యార్థులు బయటికి వెళ్లి తినాలన్నా.. ఐదారు కిలోమీటర్లకు పైగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు బయటికి వెళ్లి తినలేక.. క్యాంపస్ పరిధిలో ఉండే భోజన దుకాణాల్లో అధిక ధరలు చెల్లించి తినలేక ఉపవాసం ఉండే పరిస్థితి నెలకొంది. అయితే యూనివర్సిటీలో ఒపెన్ అయిన కొన్ని మెస్‌ల్లో ఇచ్చే కూపన్ల ద్వారా భోజనం చేసే సదుపాయం ఉంది. విద్యార్థులు ఎక్కువగా ఉండడం.. కూపన్లు తక్కువగా ఉండడం వల్ల కొంతమందికి మాత్రమే భోజనం దొరకుతుంది. అదీనూ రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా విద్యార్థులు దొరికిన అరకొర ఫాస్ట్‌ఫుడ్ తిని అనారోగ్యం బారిన పడే పరిస్థితులు ఏర్పడ్డాయి.


మెస్ సెక్రటరీని ఎన్నుకోనందు వల్లే..
యూనివర్సిటీలోని ప్రతిమెస్‌ను ఆ హాస్టల్స్‌కు సంబంధించిన ఇద్దరు విద్యార్థులు నడపాల్సి ఉంటుంది. సదరు వసతి గృహం పరిధిలోని విద్యార్థులంతా కలిసి ఇద్దరు విద్యార్థులను మెస్ కార్యదర్శులుగా ఎన్నుకుంటారు. అలా ఎన్నికైన విద్యార్థులను చీఫ్ వార్డెన్ ఆమోదించిన తర్వాత వారే నెలమొత్తం మెస్ నిర్వహణను చూసుకుంటారు. మెస్ కార్యదర్శుల ఆధ్వర్యంలో మెస్‌కు సంబంధించిన సరుకులన్నీ ఉంటాయి. అయితే ఈ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభం కాకపోవడంతో మెస్ ప్రారంభం ఆలస్యమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెస్‌లను ప్రారంభిస్తే.. విద్యార్థులకు ఉపవాస బాధలు తప్పుతాయి.

397

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles