అడ్వెంచర్స్.. అదుర్స్


Mon,October 22, 2018 12:08 AM

-ఉల్లాసంగా..ఉత్సాహంగా గడిపిన ఐటీ ఉద్యోగులు
-ఆదివారం ఈవెంట్స్‌లో పాల్గొన్న 3,200 మంది
-15వ ఈవెంట్ బ్రెయిన్ ఫ్రీజ్‌కు భలే క్రేజ్
మొయినాబాద్ : అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే అడ్వెంచర్స్, ఆప్టికల్స్ గేమ్స్ అదిరిపోయాయి. రెండు రోజులు ఐటీ ఉద్యోగులకు వీకెండ్స్ ఉండటంతో సరదాగా బయటకు వచ్చారు. అయితే వారికి రెండు రోజుల పాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ లభించింది. హైదరాబాద్ చుట్టు ఉన్న ఐటీ ఉద్యోగులంతా నగర శివారులోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని పెద్దమంగళారం గ్రామ రెవెన్యూలో డెవిల్స్ సర్క్యూ ట్ ఆధ్వర్యంలో నిర్వహిచిన అడ్వెంచర్స్, 15 రకాల ఆప్టికల్ గేమ్స్‌లో పాల్గొన్నారు. ఆదివారం నిర్వహించిన ఈవెంట్స్‌లో సుమారుగా 3200 మంది ఐటీ ఉద్యోగులు పాల్గొని సరదాగా.. ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. దీంతో ఈవెంట్స్ నిర్వహించిన ప్రాంతమంతా కేరింతలతో మార్మోగింది. ఈవెంట్స్‌లో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు సినిమా పాటలకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. మొదటి రోజు కంటే రెండోరోజు నిర్వహించిన ఈవెంట్స్‌లో రెండింతలు పాల్గొన్నారు. ఆ ప్రాంతమంతా జనసందోహంతో సందడిగా మారింది. ప్రతి ఈవెంట్ కష్టతరమైన పట్టుదలతో, ఎంతో ఇష్టంగా ఫీట్స్ చేశారు. పురుషులతోపాటు ప్రతి ఈవెంట్‌లో మహిళలు పోటీపడి ఫీట్స్ చేశారు. రెండు రోజులు పాటు నిర్వహించిన ఈవెంట్లలో దాదాపుగా 5 వేల మంది ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా ఐటీ ఉద్యోగులతోపాటు కొన్ని ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. పీఏసీఎస్ చైర్మన్ పాటి జగన్‌మోహన్‌రెడ్డి, నాయకులు రాందేవ్‌రెడ్డి, భీమేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈవెంట్లలో బ్రెయిన్ ఫ్రీజ్‌కే క్రేజీ...
రెండు రోజులపాటు నిర్వహించిన అడ్వెంచర్స్, ఆప్టికల్ గేమ్స్‌లో అన్ని ఈవెంట్స్ కంటే బ్రెయిన్ ఫ్రీజ్‌కే ఎక్కువ క్రేజీ ఉంది. ఎందుకంటే బ్రెయిన్ ఫ్రీజ్ కంటే ముందు 14 ఈవెంట్స్‌లో ఫీట్స్(టాస్క్) చేసుకుంటూ వస్తారు. ఏ టాస్క్(ఫీట్) చేసినా చెమటలు పట్టి తమ ప్రతిభను కనబర్చుకుంటూ వస్తారు. ఇందులోని 15వ ఈవెంటే బ్రెయిన్ ఫ్రీజ్ ఈవెంట్. ఇక్కడికి రాగానే వారికి పట్టిన చల్లని చెమటలు దేవుడెరుగు.. కానీ అందులో నుంచి ఈదితే మాత్రం చలితో వణికి పోవాల్సిందే మరి. మూడు ఫీట్ల లోతులో 10 ఫీట్ల పొడువుతో చేసిన గుంతలో సుమారుగా 40 టన్నుల ఐస్ ముక్కలు వేశారు. సుమారుగా-40(మైనస్ 40) డిగ్రీల చల్లదనం వారికి తగులుతుంది. వారు అందులో నుంచి నడుచుకుంటూ బయటకు రావాలి. ఎక్కువ సేపు అందులో ఉంటే బాడీలో ఉన్న రక్తం కూడా గడ్డ కట్టే ప్రమాదం లేకపోలేదు. అయినా వారు ఐస్ గడ్డలు ఉన్న గుంతలోనికి దిగి అందులో నుంచి గబగబా నడుచుకుంటూ ఒడ్డుకు చేరుతారు. ఈ 15 ఈవెంట్ల కంటే బ్రెయిన్ ఫ్రీజ్‌కే చాలా క్రేజ్ ఉంటుందని పాల్గొన్న ఐటీ ఉద్యోగులు అంటున్నారు.

8 నగరాల్లో రాణించిన వారికి మారుతి కారు
ఇలాంటి ఈవెంట్స్ పోలీసు, మిలటరీ, కమాండోస్ దళాలకు శిక్షణలు ఇవ్వడానికి నిర్వహిస్తారు. ఐటీ ఉద్యోగులకు ప్రతి ఏడాది డెవిల్స్ సర్క్యూట్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఇందులో హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ ప్రముఖ నగరాల్లోని ఐటీ కంపెనీ ఉద్యోగులు పాల్గొని రెండు రోజులపాటు సరదాగా గడుపుతారు. ఇందులో భాగంగానే డెవిల్స్ సర్క్యూట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌తోపాటు చెన్నై, బెంగళూరు, ముం బై, ఢిల్లీ, జైపూర్, చండీగఢ్, పుణె వంటి ప్రధాన నగరాల్లో అడ్వెంచర్స్, ఆప్టికల్ గేమ్స్ నిర్వహిస్తారు. 8 నగరాల్లో నిర్వహించే ఈవెంట్లలో పాల్గొని ఎక్కువ పాయింట్స్ సాధించిన వారికి మారుతీ కంపెనీకి చెందిన(స్విఫ్ట్)కారును బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని డెవిల్స్ సర్క్యూట్ సంస్థ వ్యవస్థాపకులు తెలిపారు.
సత్వరమే వైద్య సేవలు...: ఈవెంట్లలో అభ్యర్థులకు ఎలాంటి ప్రమాదం జరిగినా వైద్య సేవలు అందించడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. చిన్న గాయాలైతే అక్కడే ప్రథమ చికిత్సలు చేశారు. ఒకవేళ ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే వెంటనే బంజారాహిల్స్‌లోని అపోలో దవాఖానకు తరలించడానికి అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు.

184
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...